ఎల్. రమణ: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన -Newsreel

ఎల్.రమణ

ఫొటో సోర్స్, facebook/L.Ramana

ఫొటో క్యాప్షన్, ఎల్.రమణ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా చేశారు.

టీఆర్ఎస్‌లో చేరనున్న ఎల్.రమణ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు.

అందులో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, రాష్ట్ర ప్రగతిలో భాగమయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.

తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రమణ లేఖలో స్పష్టం చేశారు.

ఆయన తన రాజీనామా లేఖను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.

తన ఎదుగుదలకు గత 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన నారా చంద్రబాబు నాయుడుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎల్.రమణ గురువారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరి మధ్యా దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిగాయి.

తర్వాత ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన రమణ జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎంతో చర్చించానని, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన్ను కొనియాడారు.

హేరత్ ప్రావిన్స్‌లో తనిఖీలు చేస్తున్న తాలిబన్‌లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హేరత్ ప్రావిన్స్‌లో తనిఖీలు చేస్తున్న తాలిబన్‌లు

కీలక వాణిజ్య మార్గాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్‌లు

అఫ్గాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఓ మార్గాన్ని తాలిబన్‌లు తమ అధీనంలోకి తీసుకున్నారని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు.

ఇరాన్ సరిహద్దుల్లోని కస్టమ్స్ కార్యాలయం పైకప్పుపై ఉన్న అఫ్గానిస్తాన్ జెండాను తాలిబన్‌లు తొలగిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇరాన్ మీడియా, సోషల్ మీడియాలో ఇది షేర్ అయింది.

అఫ్గానిస్తాన్, ఇరాన్ మధ్య పెద్ద వాణిజ్య మార్గాలలో 'ఇస్లామ్ కాలా క్రాసింగ్' ఒకటి. అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి దీని ద్వారా నెలకు 2 కోట్ల డాలర్ల విలువైన ఆదాయం వస్తుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అమెరికా సేనలు వైదొలగడంతో తాలిబన్‌లు మళ్లీ జోరు పెంచారు. అఫ్గానిస్తాన్ అంతటా అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.

400 జిల్లాలున్న అఫ్గానిస్తాన్‌లో మూడో వంతు కంటే ఎక్కువ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని చెబుతున్నారు.

హేరత్ ప్రావిన్స్‌లో ఉన్న ఇస్లామ్ కాలా క్రాసింగ్‌ను తాలిబన్‌లు స్వాధీనం చేసుకున్నాని అఫ్గాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

''సరిహద్దు భద్రతా దళాలు సహా అన్ని అఫ్గాన్ బలగాలు ఇస్లామ్ కాలా క్రాసింగ్‌ను తిరిగి ప్రభుత్వపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అని అఫ్గాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ అరియాన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

మరోవైపు ఇస్లామ్ కాలా మార్గం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్ నుంచి ఆగస్టు 31 నాటికి అమెరికన్లందరూ వెనక్కి వస్తారు: జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనికులను వెనక్కి పిలిపించాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఆపరేషన్ ఆగస్టు 31 నాటికి ముగుస్తుందని ఆయన చెప్పారు.

అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి తిరిగిరావడాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. తన చర్యలు ప్రజల ప్రాణాలు కాపాడాయని చెప్పారు.

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల మీద పట్టు సాధిస్తున్న తరుణంలో అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేశారు.

2001 సెప్టెంబర్ 11న జరిగిన మిలిటెంట్ దాడి తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో యుద్ధం చేసింది.

అమెరికా సైనికుల ఉపసంహరణ

ఫొటో సోర్స్, Getty Images

2021 సెప్టెంబర్ 11 నాటికి అమెరికా సైనికులందరూ తిరిగి స్వదేశానికి చేరుకోవాలని ఈ ఏడాది మొదట్లో అధ్యక్షుడు జో బైడెన్ గడువు విధించారు.

2021 మే నాటికి అమెరికా సైనికులను అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించేలా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాలిబన్లతో ఒక ఒప్పందం చేసుకున్నారు. కానీ, జనవరిలో అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ దానిని మరింత పొడిగించారు.

అఫ్గానిస్తాన్‌లో మరో ఏడాది ఉండి పోరాడడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని, బదులుగా అక్కడ నిరవధిక యుద్ధం కొనసాగడానికి అది కారణం అవుతుందని వైట్ హౌస్ నుంచి మాట్లాడిన జో బైడెన్ అన్నారు.

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారా అనేదానిపై మాట్లాడ్డానికి ఆయన నిరాకరించారు. తన ప్రకటనను సమర్థించుకున్న ఆయన అఫ్గానిస్తాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులు ఉంటే, తాలిబన్లలో 75 వేల మంది ఫైటర్లు ఉన్నారని చెప్పారు.

సైనికులను పూర్తిగా ఉపసంహరించిన తర్వాత కూడా అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాబూల్ విమానాశ్రయం, ఇతర ప్రధాన ప్రభుత్వ సంస్థల భద్రత కోసం 650 నుంచి 1000 మంది అమెరికా సైనికులు అక్కడే ఉండవచ్చని భావిస్తున్నారు.

అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఫ్గానిస్తాన్‌ నుంచి సైనికుల ఉపసంహరణకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది.

జమ్ము కశ్మీర్ చొరబాటు యత్నం

ఫొటో సోర్స్, Twitter/White Knight Corps

జమ్ము-కశ్మీర్‌లో చొరబాటు యత్నం విఫలం, ఇద్దరు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మృతి

జమ్ము-కశ్మీర్ రాజౌరీ జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో గురువారం రాత్రి సైన్యం మిలిటెంట్ల చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంది.

ఈ ఆపరేషన్‌లో రెండు ఏకే-47 రైఫిళ్లు, భారీగా మందుగుండు స్వాధీనం చేసుకుంది.

డిఫెన్స్ పీఆర్ఓ వివరాల ప్రకారం ఈ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తానీ మిలిటెంట్లు చనిపోయారు. దానితోపాటూ ఇద్దరు సైనికులు నాయబ్ సుబేదార్ శ్రీజిత్.ఎం, సిపాయి మరుప్రోలు జశ్వంత్ రెడ్డి మృతిచెందారు.

సైన్యం ఆ ప్రాంతమంతా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

సిపాయి మరుప్రోలు జశ్వంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందినవారు.

జశ్వంత్ రెడ్డి మృతితో బాపట్ల మండలంలోని ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)