కోవిడ్-19: ప్రపంచమంతా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ కరోనావైరస్, భారత్‌లో ఆరు, పాకిస్తాన్‌లో మూడు కేసులు

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో మొదట బయటపడ్డ కోవిడ్-19 కొత్త రకం వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో తాజాగా భారత్, పాకిస్తాన్‌లు కూడా చేరాయి.
భారత్‌లో ఇప్పటి వరకు 6 కొత్త రకం వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ ఆరుగురూ బ్రిటన్ నుంచి వచ్చినవారే. అందులో మూడు కేసులు బెంగళూరు నిమ్‌హన్స్, రెండు కేసులు హైదరాబాద్‌లోని సీసీఎంబీ, ఒక కేసు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిర్ధరించారు. ఆరుగురినీ ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చి దిల్లీలోని ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంకు వచ్చిన మహిళకు కొత్త వేరియంట్ కోవిడ్ సోకినట్టు నిర్ధరణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
పాకిస్తాన్‌లోనూ మూడు కొత్త రకం కోవిడ్- 19 కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్ నుంచి కరాచీకి వచ్చినవారిలో ఈ రకం వైరస్‌ను గుర్తించారు.
ఇంతకుముందు బ్రిటన్ నుంచి స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ దక్షిణ కొరియా తదితర దేశాలకు వెళ్లిన వారిలో ఈ కొత్త రకం వైరస్ బయటపడింది.
ఈ కొత్త రకం వైరస్‌ను కట్టడి చేసేందుకు నెల రోజులపాటు విదేశీయులు దేశంలోకి రాకుండా జపాన్ నిషేధం విధించింది.

ఫొటో సోర్స్, Reuters
మెరుపు వేగంతో వ్యాపిస్తున్న కొత్త వేరియంట్
ఈ కొత్త రకం ఇతర కరోనా వైరస్ రకాలకన్నా 50% నుంచీ 70% వేగంగా వ్యాప్తి చెందుతున్నదని భావిస్తున్నారు.
"కరోనావైరస్‌లో కొత్త రకం శరీరంలో ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లోంచి సులువుగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది పిల్లల్లో కూడా తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి" అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ వెండీ బార్క్లే తెలిపారు.
"ఇది ఎక్కడ, ఎలా ప్రారంభమయ్యిందనే అంశాల విశ్లేషణ ఫలితాలు కూడా పిల్లల్లో అధిక స్థాయిలో వ్యాప్తిని సూచిస్తున్నాయి" అని ఎన్ఈఆర్‌వీటీఏజీ సభ్యులు ప్రొఫెసర్ నైల్ ఫెర్గుసన్ తెలిపారు.
అయితే, ఈ అంశం ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉందని, దీన్ని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుందన్నది నిజమైతే, ఈ కొత్త రకం కరోనావైరస్ ఇంత త్వరగా ఎలా వ్యాప్తి చెందుతున్నదనే దానికి జవాబు దొరుకుతుందని ప్రొఫెసర్ ఫెర్గుసన్ అన్నారు.
బ్రిటన్‌లోని సమర్థమైన నిఘా వ్యవస్థ వల్లే కోవిడ్-19 వైరస్ కొత్త రకం గుర్తించగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో నవంబర్‌లో లాక్‌డౌన్ ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని, ఆర్ నంబర్ (వైరస్ సోకిన వ్యక్తి, ఇతరులకు వ్యాపింపజేసే సగటు సంఖ్య) 1.2గా నమోదయ్యిందని... దీనర్థం కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
బ్రిటన్‌లో లాక్‌డౌన్ సమయంలో ఇతర రకాల కరోనావైరస్‌లకు ఈ ఆర్ నంబర్ 0.8 గా నమోదవ్వడమే కాకుండా ఈ సంఖ్య తగ్గుతూ ఉండడం గమనార్హం.
"ఇదే పద్ధతిలో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటే కొత్త సంవత్సరంలో ఎలాంటి నిబంధనలు పాటించవలసి ఉంటుంది, ఎన్ని నిబంధనలను సడలించవచ్చు అనేది ఆలోచించుకోవాలి" అని ప్రొఫెసర్ ఫెర్గుసన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అన్ని దేశాలకూ వ్యాక్సీన్ దొరకదా.. ఎవరికి లభ్యమవుతుంది.. ఎవరికి అవకాశం లేదు?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?
- అర్బన్ ఎకో ఫార్మింగ్: విశాఖలో వీకెండ్స్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా వ్యవసాయం చేస్తున్నారు?
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








