పాకిస్తాన్‌లో హిందూ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి అడ్డంకులు.. ‘ముస్లిం రాజ్యంలో హిందూ ఆలయాలు నిర్మించకూడదు’.. ఫత్వా జారీ చేసిన మదర్సా

పాకిస్తాన్‌లో శ్రీకృష్ణ ఆలయం
ఫొటో క్యాప్షన్, సైద్‌పూర్ మందిరం
    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్ నుంచి

ఇస్లామాబాద్‌లో సుమారు 3వేల మంది హిందువులు నివసిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్ తర్వాత ఇటీవలే ప్రభుత్వం వారికి తమ మతాచారాలను నిర్వహించుకునేందుకు, ఓ ఆలయ నిర్మాణానికి ఇస్లామాబాద్‌లో 20వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. అయితే ముస్లిం రాజ్యంలో కొత్తగా ఆలయ నిర్మాణాలు చేపట్టకూడదంటూ స్థానిక మత పెద్దలు ఫత్వా జారీ చేశారు.

ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా హిందూ ఆలయ నిర్మాణానికి కొన్నాళ్ల క్రితం స్థలాన్ని కేటాయించింది ఇస్లామాబాద్ నగర అభివృద్ధి ప్రాధికారిక సంస్థ. అయితే ప్రస్తుతం ఆ ఆలయ నిర్మాణానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. స్థానికంగా పేరున్న జామియా అషఫ్రియా మదర్సా.. ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఫత్వా జారీ చేసింది. అదే సమయంలో స్థానిక న్యాయవాది కూడా ఆలయ నిర్మాణాన్ని తక్షణం నిలిపేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 23వ తేదీన హ్యూమన్ రైట్స్ పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ మలి.. ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో భూమి పూజ నిర్వహించారు. ఆ కార్యక్రమం చాలా నిరాడంబంరంగా జరిగింది.

సుమారు 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని 2017లో స్థానిక హిందూ సంఘానికి అప్పగించారు. అయితే పరిపాలన సంబంధమైన సమస్యల కారణంగా ఆలయ నిర్మాణం ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ స్థలాన్ని హిందూ సంఘానికి పూర్తిగా అప్పగించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలయం మొదటి విడత నిర్మాణానికి పది కోట్ల రూపాయల(ప్రస్తుత భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.5కోట్లు సుమారు) నిధులను కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.

“ఇస్లామాబాద్‌లో మొట్ట మొదటి ఆలయం.. ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి 4 కెనల్స్(సుమారు20,000 చదరపు అడుగులు) స్థలాన్ని కేటాయించింది. లాంగ్ లివ్ పాకిస్తాన్” అని లాల్ చంద్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే స్థానిక హిందూ సంఘం తమ సభ్యుల నుంచి సేకరించిన నిధులతో ఆలయ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం ప్రారంభించింది. ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇంకా వారికి అందాల్సి ఉంది.

పార్లమెంటరీ సెక్రటరీ లాల్ చంద్ బీబీసీతో మాట్లాడుతూ... “ఆ స్థలంలో ఆలయం సహా, కమ్యూనిటీ హాల్, వసతి గదులు, భోజన ఏర్పాట్లు, హిందువుల అంత్యక్రియలకు అవసరమయ్యే స్మశానాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం ఆలయ నిర్మాణానికి పాకిస్తాన్ కరెన్సీలో సుమారు 50 కోట్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.24 కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నాం” అని చెప్పారు.

“భిన్న మతాలకు నిలయం మా దేశం. అన్ని మత విశ్వాసాలు కల్గిన ప్రజలు మా దేశంలో ఉన్నారు. అలాగే రాజధాని ఇస్లామాబాద్‌పై పాకిస్తానీ పౌరులందరికీ సమాన హక్కులుంటాయి. ఓ రకంగా ఇది పాకిస్తాన్‌లో భిన్న మతాల మధ్య నెలకొన్న పరస్పర విశ్వాసాలకు, సామరస్యానికి నిదర్శనం” అని లాల్ చంద్ చెప్పుకొచ్చారు.

కేవలం హిందువులకే కాదు ఇస్లామాబాద్‌లో ఇతర నివసిస్తున్న ఇతర మైనారిటీ వర్గాలైన క్రైస్తవులు, జోరాష్ట్రియన్లకు కూడా ప్రభుత్వం 20వేల చదరపు అడుగుల చొప్పున్న భూమిని కేటాయించిందని లాల్ చంద్ తెలిపారు.

“దేశంలోని భిన్న మతస్థుల మధ్య పరస్పర విశ్వాసం, సామరస్యాలను ప్రోత్సహించడం, పాకిస్తాన్ అన్ని మతాలను కలుపుకొని పోయే దేశమన్న విషయాన్ని ప్రతిబింబిస్తుంది. మహమ్మద్ అలీ జిన్నా ఆశయం కూడా అదే” అని లాల్ చంద్ అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్:ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణపు పనులు
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణపు పనులు

ఆలయ నిర్మాణానికి అడ్డంకులు - ఫత్వా జారీ - కోర్టులో కేసు

జామియా అషఫ్రియా లాహోర్‌లో ఉంది. ఫిరోజ్ పూర్ రోడ్‌లో ఉన్న దేవ్‌బందీ ఇస్లామిక్ సెమినరీకి చెందినది ఈ సంస్థ. 1947లో పాకిస్తాన్ ఏర్పాటయిన తర్వాత ఈ సంస్థ ప్రారంభమయ్యింది.

దేశంలో ఇదో ప్రముఖ మత పరమైన విద్యా సంస్థ. ఇస్లామిక్ విద్య కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడకు వస్తుంటారు.

ఆ సంస్థ అధికార ప్రతినిధి మాటల ప్రకారం ముఫ్తీ మహమ్మద్ జక్రియాకు జామియా అషఫ్రియాతో సుమారు 2 దశాబ్దాలుగా అనుబంధం ఉంది.

ఇస్లాం ప్రకారం మైనార్టీల ఆలయాలను సంరక్షించాలి. అలాగే వారి మతపరమైన విధులకు సహకరించాలి. అంతే తప్ప కొత్తగా ఆలయాలు లేదా ప్రార్ధనా స్థలాల నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని ఆయన జారీ చేసిన ఫత్వాలో ఉంది. ఆ ఫత్వాను సంస్థలోని ఇతర సీనియర్ ముఫ్తీలు కూడా ఆమోదించారు.

తన ఫత్వాకు మద్దతుగా కొన్ని చారిత్రక వ్యాఖ్యాలను, ఉదాహరణలను కూడా ఆయన అందులో ప్రస్తావించారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన స్థానికుల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్లే తాము అలా స్పందించాల్సి వచ్చిందని చెప్పారు.

“మేం ఖురాన్, సున్నా ప్రకారం ప్రజల్ని మార్గనిర్దేశం చేస్తూ వారికి అన్ని విషయాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. మా అంతట మేం ఏదీ కొత్తగా సృష్టించం. నాకు అర్థమైనంత మేరకు ఓ ముస్లిం రాజ్యంలో కొత్తగా ఇస్లామికేతర ఆలయాలు లేదా ప్రార్థనా స్థలాల నిర్మాణం చేయకూడదు” అని తెలిపారు.

ఒక వేళ ప్రభుత్వం మీ ఫత్వాను పట్టించుకోకపోతే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం చెప్పారు.

“ప్రభుత్వంతో బలవంతంగా రద్దు చేయించే అధికారం మాకు లేదు. మతాచారాల ప్రకారం మేం మార్గనిర్ధేశనం మాత్రమే చేయగలం. మా పని మేం పూర్తి చేశాం” అని ముఫ్తి జక్రియా అన్నారు.

“ఫత్వా జారీ చేయడం వెనుక ఎవరితోనూ ఘర్షణలు పెట్టుకునే ఉద్ధేశం మాకు లేదు. స్థానిక పౌరుల నుంచి వచ్చిన మతపరమైన ప్రశ్నలకు సెమినరీలోని మత పెద్దలు ఇస్లాంలో తమకున్న పరిజ్ఞానం మేరకు స్పందించారు అంతే” అని జామియా అషఫ్రియా అధికార ప్రతినిధి మౌలానా ముజీబ్ ఉర్ రెహమాన్ బీబీసీతో అన్నారు.

పాకిస్తాన్:ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణపు పనులు

మరోవైపు ఇస్లామాబాద్‌కు చెందిన తన్విర్ అక్తర్ అనే న్యాయవాది కూడా కృష్ణ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “ నాకున్నదంతా ఒకే ఒక్క అభ్యంతరం. ఈ భూసేకరణ సమయంలో హెచ్-9 సెక్టార్లో ఉన్న భూమిని ఆలయానికి రిజర్వ్ చేస్తున్నట్లు నగరాభివృద్ధి ప్రాధికారిక సంస్థ ప్రస్తావించిందా? కాని పక్షంలో ఇప్పుడు హిందూ ఆలయ నిర్మాణం కోసం సీడీఏ ఎలా భూమిని కేటాయిస్తుంది? ఇది ముమ్మాటికి మాస్టర్ ప్లాన్‌ నిబంధనల్ని తుంగలో తొక్కడమే. అందుకే దీన్ని తక్షణం ఆపాలి” అని తన్విర్ అన్నారు.

అయితే హైకోర్టు మాత్రం తన్విర్ అక్తర్ పిటిషన్‌ ప్రకారం... ఆలయ నిర్మాణంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు దేశంలో మైనార్టీలకు కూడా మెజార్టీ ప్రజలకు ఉన్నట్టే తమ మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు హక్కు ఉందని స్పష్టం చేసింది.

అదే సమయంలో మాస్టర్ ప్లాన్‌ను అతిక్రమించలేదన్న విషయంలో తదుపరి విచారణకు హాజరయ్యే నాటికి పిటిషనర్‌కు తగిన వివరణ ఇవ్వాలంటూ సీడీఏ సహా ఇతర అధికారవర్గాలకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ పరిణామాలపై లాల్ చంద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

“భిన్న విశ్వాసాలకు, భిన్న సంస్కృతులకు నిలయం పాకిస్తాన్. ఇతర మతాలకు చెందిన వారు కూడా ఈ దేశంలో మిగిలిన వారితో కలిసే జీవిస్తున్నారు. ఈ దేశంలో మైనారిటీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని మహమ్మద్ అలీ జిన్నా కూడా హామీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అందుకు పూర్తిగా కట్టుబడి ఉంది కూడా. తదుపరి విచారణ సమయంలో కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

లాల్ చంద్ (మధ్యలోని వ్యక్తి)
ఫొటో క్యాప్షన్, లాల్ చంద్ (మధ్యలోని వ్యక్తి)

ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్

పాకిస్తాన్‌లో హిందువుల జనాభా సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. ఎక్కువగా దక్షిణ సింధు ప్రావిన్స్‌లోని ఉమర్‌కోట్, థర్పాకర్, మిర్పుర్ ఖాస్ జిల్లాల్లో ఉంటారు. ఇస్లామాబాద్ నగరంలోనే నివసిస్తున్న హిందువుల సంఖ్య సుమారు 3 వేల వరకు ఉంటుంది.

థర్పార్ పూర్‌ నుంచి ఇస్లామాబాద్ ‌వచ్చి స్థిర పడ్డ కుటుంబాలలో స్థానిక హిందూ సంఘం మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ దాస్ కుటుంబం కూడా ఒకటి. 1973లో ఆయన నగరానికి వచ్చారు.

“మర్గాల్లా పర్వతాన్ని ఆనుకొని కొత్తగా రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసిన 6 ఏళ్ల తర్వాత వచ్చిన మొదటి వాళ్లలో నేను కూడా ఒకణ్ణి. అయితే గడిచిన కొన్నేళ్లుగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో హిందువుల జనాభా పెరుగుతూ వస్తోంది” అని ప్రీతమ్ తెలిపారు.

ఇస్లామాబాద్‌ నగర సమీపంలో సైదాపూర్ అనే గ్రామం ఉంది. జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతం ఎంతో కొంత పునరుద్ధరణకు నోచుకుంది. అయితే అది కేవలం లాంఛన ప్రాయమైన నిర్మాణం మాత్రమే. రాజధానిలో పెరుగుతున్న హిందువుల జనాభా అవసరాలను అది ఏ మాత్రం తీర్చలేదు.

“మా మతాచారాలను నిర్వహించుకునేందుకు చాలా కష్టమైపోతోంది. కనీసం అంత్యక్రియల్ని చేసేందుకు మరుభూమి కూడా లేదు. దీంతో మేం చనిపోయిన మా బంధువులకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఇతర నగరాలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. మాకు కనీసం ఒక కమ్యూనిటీ సెంటర్‌ కూడా లేదు. దీపావళి, హోలీ వంటి పండగల్ని మేం ఎక్కడ జరుపుకోగలం? ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న డిమాండ్. చివరకు ప్రభుత్వం మా గోడును పట్టించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని ప్రీతమ్ అన్నారు.

పాకిస్తాన్:ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది
ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది

రాజకీయ నేతల రియాక్షన్

పాకిస్తాన్‌లో కొంత మంది రాజకీయ నాయకులు కూడా దేశంలో ముఫ్తీ జక్రియాకి ఉన్న స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని వారికే మద్దతిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయుకుడు, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చౌదరీ పర్వేజ్ ఇలాహి కొత్తగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టడంపై తన నిరసన వ్యక్తం చేశారు.

“ఇస్లామ్ పేరుతోనే పాకిస్తాన్ పుట్టింది. అలాంటిది రాజధానిలో కొత్తగా ఆలయాన్ని నిర్మించడం అంటే అది కేవలం ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధం మాత్రమే కాదు... మహమ్మద్ ప్రవక్త సృష్టించిన మదీనాను అవమానించడమే” అని ఆయన మీడియా సెల్ విడుదల చేసిన ఓ వీడియోలో పర్వేజ్ ఇలాహీ వ్యాఖ్యానించారు.

మక్కా జయించిన తర్వాత కాబాలోని 360 విగ్రహాలను మహమ్మద్ ప్రవక్త నాశనం చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

అదే సమయంలో మైనార్టీల హక్కులను కాపాడేందుకు తనతో పాటు తన పార్టీ కూడా కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. అంటే దానర్థం కేవలం ఇప్పటి వరకు ఉన్న ఆలయాల పునర్నిర్మాణం విషయంలోనే తప్ప, కొత్త ఆలయ నిర్మాణాల విషయంలో మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు

పర్వేజ్ ఇలాహీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కటాస్ రాజ్ ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకున్నారు.

మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దేశంలో మైనార్టీలను కూడా తమ ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులతో సమానంగా చూస్తుందని పదే పదే చెప్పుకొస్తున్నారు.

“దేశంలో ముస్లిమేతరుల్ని కానీ వారి ప్రార్థనాలయాలను కానీ లక్ష్యంగా చేసుకుంటే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రజల్ని హెచ్చరిస్తున్నాను. ఈ దేశంలో ఉన్న మైనార్టీలు కూడా ఈ దేశ ప్రజలతో సమానం” అంటూ కొన్ని నెలల క్రితం ఇమ్రాన్ ఖాన్ ట్విటర్లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)