కరోనావైరస్: ఫేక్ న్యూస్ వల్ల ఈ ఆరు నెలల్లో ఏమేం జరిగిందో తెలుసా...

టెంపరేచర్ చెక్ చేసుకుని ప్రార్థనలకు హాజరవుతున్న ముస్లింలుటెంపరేచర్ చెక్ చేసుకుని ప్రార్థనలకు హాజరవుతున్న ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెంపరేచర్ చెక్ చేసుకుని ప్రార్థనలకు హాజరవుతున్న ముస్లింలు
    • రచయిత, శ్రుతి మేనన్
    • హోదా, బీబీసీ రియాల్టీ చెక్

నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే వదంతులు కొన్ని సార్లు తీవ్ర ప్రభావం చూపించవచ్చు. భారత్‌లో కరోనావైరస్ సంక్షోభ సమయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఆన్‌లైన్‌లో వ్యాపించే కట్టు కథలు అసలు వార్తలను కమ్మేస్తున్నాయి.

తప్పుడు కథనాల వల్ల మైనారిటీ వర్గాలు, మాంసోత్పత్తి పరిశ్రమ వర్గాలు ప్రభావితమవడం ఇటీవల చూశాం.

భారత్‌లో ఎక్కువగా వ్యాపించిన కొన్ని వదంతులు, వాటి వల్ల ప్రభావితమైనవారి గురించి బీబీసీ రియాల్టీ చెక్ బృందం తాజాగా పరిశోధించింది.

మతాన్ని లక్ష్యంగా చేసుకోడం మరింత పెరిగింది

భారత్‌లో మతాన్ని నిందిస్తూ ఆన్‌లైన్‌లో వ్యాపించే తప్పుడు కథనాలు ఎక్కువే. కరోనావైరస్ సంక్షోభ సమయంలో ఇవి మరింత పెరిగాయి.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ ఐదు భారతీయ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్స్ నిగ్గు తేల్చిన వదంతులను మేం పరిశీలించాం.

వాటిలో ప్రధానంగా నాలుగు అంశాలకు సంబంధించిన వదంతులు ఉన్నాయి. అవి...

  • కరోనావైరస్ వ్యాప్తి
  • ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లు
  • పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)
  • ముస్లిం వర్గంపై ఆరోపణలు

ఈ ఐదు వెబ్‌సైట్లు కలిపి మొత్తంగా 1,447 వదంతులు, కథనాలపై నిజ నిర్ధరణ చెక్ చేశాయి. వాటిలో 58 శాతం కరోనావైరస్‌కు సంబంధించినవే.

తప్పుడు చికిత్స మార్గాలు, లాక్‌డౌన్‌పై వదంతులు, వైరస్ మూలాల గురించిన కుట్ర సిద్ధాంతాలు వీటిలో ఎక్కువగా ఉన్నాయి.

జనవరి నుంచి మార్చి ఆరంభం వరకూ కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం మరీ ఎక్కువగా లేదు. అప్పుడు సీఏఏ గురించి వదంతులు ఎక్కువగా ఉన్నాయి.

ముస్లింలపై సీఏఏ వివక్షపూరితంగా ఉందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈశాన్య దిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫిబ్రవరిలో అల్లర్లు జరిగాయి. వీటి గురించి అప్పట్లో చాలా వదంతులు చక్కర్లు కొట్టాయి.

తప్పుదోవ పట్టించేలా మార్చిన వీడియోలు, నకిలీ ఫొటోలు, పాత వీడియోలు, ఫొటోలను ఉపయోగిస్తూ అసత్య కథనాల ప్రచారం జరిగింది.

తబ్లీగీ జమాత్ సభ్యులు కరోనావైరస్ బారిన పడ్డ తర్వాత ముస్లింలను నిందిస్తూ వదంతులు పెరిగాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తబ్లీగీ జమాత్ సభ్యులు కరోనావైరస్ బారిన పడ్డ తర్వాత ముస్లింలను నిందిస్తూ వదంతులు పెరిగాయి

కరోనావైరస్ వ్యాపించినప్పుడు...

ఏప్రిల్ మొదటి వారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న అసత్య వార్తలు, వదంతులు బాగా ఎక్కువ ఉన్నట్లు మా విశ్లేషణలో గుర్తించాం.

తబ్లీగీ జమాత్ అనే ఇస్లామిక్ సంస్థకు చెందిన చాలా మంది సభ్యులు దిల్లీలో ఓ మతపరమైన సమావేశానికి హాజరై కరోనావైరస్ బారిన పడ్డ తర్వాత ఇవి పెరిగాయి.

ఆ సంస్థకు చెందినవారు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలడం పెరిగినకొద్దీ, ముస్లింలు కావాలనే వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న అసత్య కథనాలు వైరల్‌గా మారాయి.

ముస్లింల వ్యాపారాలను బహిష్కరించాలని దేశంలోని చాలా చోట్ల పిలుపులు వచ్చాయి.

‘‘బ్రెడ్‌పై ఓ ముస్లిం వ్యక్తి ఉమ్ముతున్నట్లు చూపిస్తున్న ఓ నకిలీ వీడియో వాట్సాప్‌లో వైరల్ అయింది. మేం కూరగాయాలు అమ్మేందుకు ఊళ్లకు వెళ్లేందుకు అప్పుడు చాలా భయపడ్డాం’’ అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూరగాయలు అమ్ముకునే ఇమ్రాన్ (పేరు మార్చాం) బీబీసీతో అన్నారు.

ప్రస్తుతానికి ఇమ్రాన్, ఆయన తోటి వ్యాపారులు ఓ పట్టణ మార్కెట్‌లోనే కూరగాయలు అమ్ముకుంటున్నారు.

ముస్లిం వ్యాపారులను వారి పనిని వారు చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని దిల్లీలో మైనార్టీ కమిషన్ పోలీసులను కోరింది.

‘‘తబ్లీగీ జమాత్‌కు చెందినవారిపైనే కాదు, దేశవ్యాప్తంగా మిగతా ముస్లింలపైనా దాడులు జరిగాయి’’ అని కమిషన్ ఛైర్మన్ జఫారుల్ ఇస్లాం బీబీసీతో అన్నారు.

దిల్లీ మార్కెట్లో చికెన్ వ్యాపారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాంసాహారం గురించి తప్పుడు వార్తలు ప్రచారం కావడంతో ఆ వ్యాపారం దెబ్బ తింది

మాంసం వ్యాపార రంగంపై ప్రభావం

మాంసం మానేసి, శాకాహారం మాత్రమే తీసుకుంటే కరోనావైరస్ బారినపడకుండా ఉండొచ్చన్న తప్పుడు కథనం కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.

ఇలాంటి నకిలీ సమాచారాన్ని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం కూడా వివిధ కార్యక్రమాలు మొదలుపెట్టింది.

వాట్సాప్‌లో వ్యాపించిన ఈ తప్పుడు సందేశాల వల్ల మాంసం అమ్మకాల రంగంలో ఉన్న ముస్లింలతోపాటు ముస్లిమేతరులు కూడా ప్రభావితమయ్యారు.

ఏప్రిల్ వరకూ వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగం రూ.13 వేల కోట్ల వరకూ నష్టపోయిందని ప్రభుత్వ వర్గాలు లెక్కగట్టాయి.

‘‘చికెన్ తింటే కరోనావైరస వస్తుందని వాట్సాప్‌లో సందేశం వ్యాప్తి చెందింది. జనాలు కొనడం మానేశారు’’ అని మహారాష్ట్రకు చెందిన మాంసం విక్రయదారుడు తౌహిద్ బరాస్కర్ అన్నారు.

‘‘మా అమ్మకాలు 80 శాతం పడిపోయాయి. అప్పుడు ఉన్న కోళ్లను ఏం చేసుకోవాలో తెలియక ఉచితంగా పంచేశాం’’ అని అదే రాష్ట్రానికి చెందిన మాంసం వ్యాపారి సుజీత్ ప్రభావ్లే చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో నకిలీ వార్తలు కూడా జోరుగా వ్యాపించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో నకిలీ వార్తలు కూడా జోరుగా వ్యాపించాయి.

మాంసం దుకాణాలను మూసివేయాలంటూ మాజీ టాప్ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించారంటూ ఓ తప్పుడు కథనం కూడా అప్పుడు బాగా ప్రచారమైనవాటిలో ఉంది.

‘‘వదంతులు, నకిలీవార్తలు సోషల్ మీడియాలో జనానికి తెలిసినవారి నుంచే వస్తాయి. అందుకే వాటిలోని నిజానిజాలు తెలుసుకోకుండా జనం నమ్మేస్తారు’’ అని ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా చెప్పారు.

మాంసంతో పాటు గుడ్ల పరిశ్రమపైనా ఈ వదంతుల ప్రభావం పడింది.

అధికారిక సమాచారం ప్రకారం జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో గుడ్ల అమ్మకాలు హైదరాబాద్‌లో 52%, దిల్లీలో 30%, ముంబయిలో 21% పడిపోయాయి.

కోళ్ల దానాగా ఉపయోగపడే మక్కలకు కూడా డిమాండ్ తగ్గిపోయి, ప్రభుత్వం సూచించిన కనీస మద్దతు ధర కన్నా 35% తక్కువకు రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.

అదనపు సహకారం: షాదాబ్ నజ్మీ, దిల్లీ

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)