కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు

చైనాలో తయారైన వైద్య పరికరాలు నాసీరకంగా ఉన్నాయని ఆరోపించిన దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చైనాలో తయారైన వైద్య పరికరాలు నాసీరకంగా ఉన్నాయని ఆరోపించిన దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం చైనాలో తయారు చేసిన వైద్య పరికరాలను యూరప్‌లోని పలు దేశాలు తిరస్కరించాయి.

చైనా నుంచి వచ్చిన వేలాది కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు, సర్జికల్ మాస్కులు ప్రమాణాలకు తగినట్లుగా లేవని స్పెయిన్, టర్కీ, నెదర్లాండ్స్ అధికారులు చెప్పారు.

యూరప్ దేశాల్లో కరోనావైరస్ ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఈ మహమ్మారి బారినపడి 10,000 మందికి పైగా మరణించారు.

ఈ వైరస్ మొదట చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో బయటపడింది. దీనిని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేసింది.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న మాస్కుల్లో ఫిల్టర్లు సరిగా పనిచేయడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న మాస్కుల్లో ఫిల్టర్లు సరిగా పనిచేయడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి

లోపం ఏంటి?

నాసీరకంగా ఉన్న 6,00,000 ఫేస్ మాస్కులను వెనక్కి పంపిస్తున్నట్లు నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. అవి మార్చి 21న చైనాలోని ఓ సంస్థ నుంచి వచ్చాయి, వెంటనే దేశంలోని వైద్య బృందాలకు వాటిని పంపిణీ చేశారు. కానీ, వాటిలో లోపాలు ఉన్నాయని తాజాగా అధికారులు గుర్తించారు.

వాటి నాణ్యతకు సంబంధించి ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, ప్రమాణాలకు తగినట్లుగా మాస్కులు లేవని, వాటిలోని ఫిల్టర్లు సరిగా పనిచేయడం లేదని డచ్ అధికారులు అంటున్నారు.

"ఆ లోపాలను గుర్తించిన వెంటనే మిగిలిన మాస్కుల పంపిణీని నిలిపివేశాం. ఆ షిప్‌మెంట్‌లో వచ్చిన మాస్కుల్లో దేనినీ ఉపయోగించకూడదని నిర్ణయించాం" అని చెప్పారు.

Sorry, your browser cannot display this map