ఇండోనేసియాలో సునామీ: 380 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, AFP/Getty Images
ఇండోనేసియాలోని తీర ప్రాంత నగరం 'పాలు'లో శుక్రవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన ప్రకంపలన ఫలితంగా సునామీ విరుచుకుపడింది. దీంతో కనీసం 380 మందికి పైగా మృతి చెందారని అధికారులు చెప్పారు.
అధికారులు సునామీ హెచ్చరికలు ఎత్తివేసిన కాసేపట్లోనే పది అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతూ సులవేసి ద్వీపంలోని పాలు నగరాన్ని ముంచెత్తాయి.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోలో జనం భయానకంగా అరుస్తూ పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. భవనాల నడుమ ఒక మసీదు కూలిపోవడం కనిపించింది.
గత నెలలో కూడా వరస భూకంపాలు ఇండొనేషియా ద్వీపాలను అతలాకుతలం చేశాయి. లోంబోక్‌లో సంభవించిన భూకంపానికి వందలాది మంది చనిపోయారు. ఆగస్టు 6న సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం 460 మంది ప్రాణాలు తీసింది.
తాజా భూకంపం, మధ్య సులవేసిలో శుక్రవారం సాయంత్రం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కానీ, ఒక గంట తరువాత హెచ్చరికలను ఉపసంహరించారు.
సునామీ పాలూ ప్రాంతాన్ని డీకొంటున్న దృశ్యాలు ఆందోళనకరంగా ఉన్నాయి. సముద్రం మీంచి దూసుకొచ్చిన అలలు భవనాల్లోకి వచ్చాయి. భూకంప కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మసీదు సునామీ తాకిడికి ఒరిగిపోయింది.

ఫొటో సోర్స్, Antara Foto/Rolex Malaha via Reuters

ఫొటో సోర్స్, AFP

అయితే, సునామీ వెనక్కి తగ్గిందని ఇండొనేషియా వాతావరణ-భూభౌతిక శాఖ అధిపతి డ్వికోరిటా కర్నావటి అన్నారు.
"సునామీ కాసేపట్లోనే బీభత్సం సృష్టించింది. ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. భవనాలు కుప్పకూలాయి. ఒక నౌక తీరానికి కొట్టుకు వచ్చింది" అని ఆమె చెప్పారు.
2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన తీవ్ర భూకంపంతో వచ్చిన భారీ సునామీ వల్ల హిందూ మహా సముద్రం పరిధిలో 2,26,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఒక్క ఇండొనేషియాలోనే 1,20,000 మందికి పైగా చనిపోయారు.
తరచూ భూకంపాలు సంభవించే అవకాశంతో పాటు అగ్నిపర్వతాలున్న వలయంలో ఉన్న ఇండొనేషియాకు భూకంపాల ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటోంది.

ఫొటో సోర్స్, EPA
ఇవి కూడా చదవండి:
- ఇది ఓ డాన్ కథ: బడా రాజన్ ‘ప్రేమ’.. చోటా రాజన్ ‘పగ’
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?
- బిగ్ బాస్: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’ –బాబు గోగినేని
- #HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్ నడుపుతున్నా.. తప్పేంటి?
- ‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










