ట్రంప్-పుతిన్ భేటీ: అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం వ్యవహారంలో ఒబామాను తప్పుపట్టిన ట్రంప్

ఫొటో సోర్స్, AFP
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తనకంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామాపై విమర్శల వర్షం కురిపించారు. ఇది జరిగేనాటికి అధ్యక్షుడిగా ఉన్న ఒబామా అప్పుడు చర్యలెందుకు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు.
‘‘పన్నెండు మంది రష్యన్లకు సంబంధించి మీరు విన్నదంతా ట్రంప్ పాలనాకాలంలో జరగలేదు. ఒబామా పాలనలో చోటుచేసుకున్న వ్యవహారమిది. ఎన్నికలకు ముందు 2016 సెప్టెంబరులోనే ఒబామాకు ఎఫ్‌బీఐ సమాచారం ఇచ్చినా ఇచ్చినా ఆయన స్పందించలేదు ఎందుకు?’’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు తొలుత నిర్ణయించిన ప్రకారమే భేటీ అవుతారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి.
జులై 16వ తేదీ సోమవారం ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్‌లు భేటీ కానున్నట్లు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ వెల్లడించారు.
కానీ, తమ దేశ ఎన్నికల్లో తలదూర్చారంటూ 12 మంది రష్యా నిఘా అధికారులపై అమెరికా అభియోగాలు మోపిన నేపథ్యంలో ఈ భేటీ రద్దు చేసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రష్యా మాత్రం తన వైపు నుంచి ఈ సమావేశం జరగాలనే కోరుకుంటోంది. ''మా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేవు. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చలు జరిపేందుకు ట్రంప్‌ను సరైన భాగస్వామిగానే పరిగణిస్తున్నాం'' అని రష్యా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు యురీ ఉషకోవ్ అన్నారు.
సోమవారం నాటి కీలక భేటీకి ముందు సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టేందుకే కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో ఏ ఒక్కరూ హ్యాకింగ్ చేసినట్లు కానీ, సైనిక నిఘాకు పాల్పడినట్లుగా కానీ ఆధారాలు లేవని తెలిపింది.
కానీ, అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్‌స్టీన్ మాత్రం ఎన్నికలను ప్రభావితం చేయడమే లక్ష్యంగా వారంతా కుట్ర పన్నారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోపణలేమిటి?
2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ ఏడాది మార్చిలో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ప్రచార బృందం ఈ-మెయిల్ ఖాతాలపై సైబర్ దాడులు చేశారన్నది వీరిపై ఆరోపణ.
కీస్ట్రోక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డెమొక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుల, పార్టీ కార్యాలయంలోని కంప్యూటర్లపై నిఘా పెట్టారని అమెరికా ఆరోపించింది.
కుట్రలో ఉన్నవారు నకిలీ ఖాతాలను సృష్టించి వాటి సహాయంతో దొంగిలించిన వేలకొద్దీ ఈ-మెయిళ్లను బయటపెట్టారని రోసెన్‌స్టీన్ అన్నారు.
ఒక రాష్ట్ర ఎన్నికల మండలి వెబ్‌సైట్ నుంచి 5 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన సమాచారాన్నీ దొంగిలించారని ఆయన ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎవరేమన్నారు..?
ఐరోపా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం బ్రిటన్ం ప్రధాని థెరెసా మేతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడిని తాను ప్రశ్నించి తీరుతానని అన్నారు.
మరోవైపు పుతిన్‌తో సమావేశాన్ని రద్దు చేసుకోవాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు కోరుతున్నారు. ''సోమవారం పుతిన్‌తో జరగాల్సిన భేటీని ట్రంప్ రద్దు చేసుకుని తీరాలి'' అంటూ డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ఛైర్మన్ టామ్ పెరెజ్ డిమాండ్ చేశారు. పుతిన్ అమెరికాకు స్నేహితుడేం కాదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమావేశాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసీ ట్వీట్ చేశారు.
రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ కూడా ఈ భేటీ విషయంలో మాట్లాడారు.. పుతిన్ దీనికి బాధ్యత వహించకపోతే భేటీని రద్దు చేసుకోవాలని ట్రంప్‌కు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
32 మందిపై అభియోగాలు
ట్రంప్‌కు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా 2016 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణలపై స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటివరకు 32 మందిపై నేరారోపణ చేశారు. ఇందులో మూడు సంస్థలు, ఒకప్పుడు ట్రంప్‌కు సలహాదారులుగా ఉన్న నలుగురిపైనా ఆరోపణలు చేశారు. ఈ 32 మందిలో ఎక్కువ మంది రష్యాకు చెందినవారే.
అయితే, ట్రంప్ సలహాదారులెవరూ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేయడానికి రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఎదుర్కోలేదు.
మరోవైపు అమెరికా జాతీయ భద్రత వ్యవహారాల మాజీ సలహాదారు మైఖేల్ ఫ్లిన్, విదేశాంగ విధాన మాజీ సలహాదారు జార్జ్ పపడోపోలస్‌లు రష్యన్లతో తమకున్న సంబంధాలపై తప్పుడు ప్రకటనలు చేశామని నేరాన్ని అంగీకరించారు.
ట్రంప్ ప్రచార కార్యక్రమ మాజీ ఛైర్మన్ పాల్ మనాఫోర్ట్, ఆయన డిప్యూటీ రాక్ గేట్స్‌లపై ఉక్రెయిన్‌లోని వారి రాజకీయ సలహా సంస్థ వ్యవహారాల్లో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- ట్రంప్‌ను తట్టుకుని నాటో నిలబడగలదా?
- ట్రంప్ దెబ్బ: అమెరికాలో తగ్గిన పర్యాటకులు
- అమెరికా ఎన్నికల టాంపరింగ్లో రష్యన్ల పాత్రపై అభియోగం
- పుతిన్‌ను రక్షకుడిగా ఎందుకు చూపిస్తున్నారు?
- స్నేహితుడా.. శత్రువా.. ఎవరైతే ‘నాకేంటి అంటున్న ట్రంప్
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- అమెరికాలో 10శాతం మందికే పాస్‌పోర్టులు.. నిజమేనా?
- రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. ‘ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








