ట్రంప్‌ను తట్టుకుని నాటో నిలబడగలదా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జొనాథన్ మార్కస్
- హోదా, దౌత్యరంగ ప్రతినిధి
ఈ నాటో శిఖరాగ్ర సదస్సు ఇతర సదస్సుల లాంటిది కాదు. దానికి కారణం ప్రధానంగా ఒక వ్యక్తి - డొనాల్డ్ ట్రంప్. ఆయన సారథ్యంలో.. అమెరికాకు - దాని మిత్రులైన చాలా దేశాలకు మధ్య తరచుగా ఉద్రిక్తతలు తలెత్తి విభేదాలుగా మారాయి. అవి అలాగే కొనసాగితే.. ఈ కూటమి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది.
అసలు ఈ నాటో ఎందుకు?
సోవియట్ యూనియన్ నుంచి ఎటువంటి దాడి జరగకుండా నిరోధించేందుకు ఏర్పాటైన రక్షణాత్మక సైనిక కూటమి ఈ నాటో.
ఈ కూటమి కేవలం సైనిక సంస్థ మాత్రమే కాదు. అంతకు మించినది.
ఇది ‘‘పశ్చిమ’’ ప్రపంచానికి ఒక కేంద్రీయ సంస్థ. 1945లో నాజీయిజం ఓటమి నుంచి ఉద్భవించిన ప్రపంచాన్ని నియంత్రించటానికి అమెరికా, దాని మిత్రదేశాలు ఉద్దేశించిన అనేక అంతర్జాతీయ సంస్థల్లో ఒక భాగం.
కానీ ప్రాధమికంగా నాటో అనేది ఒక ఉమ్మడి విలువల కూటమి. అట్లాంటిక్‌కి అటూ ఇటూ దేశాల ఐక్యత. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో ఇది విచ్ఛిన్నమవతున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
నాటో బంధం విచ్ఛిన్నమవుతోందా?
నిర్దిష్టంగా చెప్తే.. అమెరికా అధ్యక్షుడు, చాలా నాటో మిత్ర దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఎక్కువగా డబ్బుకు సంబంధించినవే.
‘భారం పంచుకోవటం’ అనేది నాటో సదస్సుల్లో చాలా కాలంగా ప్రధాన అంశంగా ఉంది.
ఈ అంశం మీద గట్టిగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ మొదటి వారు కాదు.
కానీ.. శైలిలోను, సారంలోను ఆయన కొత్తగా కనిపిస్తారు.
నాటో సభ్య దేశాలన్నిటి రక్షణ వ్యయం 2024 నాటికి జీడీపీలో 2 శాతానికి పెరగాలని ఆ సభ్యదేశాలన్నీ అంగీకరించిన లక్ష్యాల మీద చర్చ కేంద్రీకృతమై ఉంటుంది.
చాలా దేశాల్లో ఈ వ్యయం నిజంగానే పెరిగింది. అందులో ట్రంప్ ప్రభావం కొంత ఉంది కూడా.
కానీ.. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి చాలా దేశాలు ఇంకా కష్టపడాల్సి రావచ్చు.
ట్రంప్ దృష్టిలో.. అమెరికా భాగస్వాముల్లోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన జర్మనీ చాలా తప్పు చేస్తోంది.
ట్రంప్ ఈ నెల ఆరంభంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ను ఉద్దేశించి.. ‘‘మిమ్మల్ని రక్షించటం ద్వారా మేం ఎంత రక్షణ పొందుతున్నామో నాకు తెలియదు’’ అని వ్యాఖ్యానించారు.
రష్యాతో జర్మనీ గ్యాస్ ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘వాళ్లు రష్యాకు వందల కోట్ల డాలర్లు చెల్లిస్తారు. దానంతటికీ చెల్లిస్తున్న వెర్రివాళ్లం మనం’’ అని కూడా పేర్కొన్నారు.
అసలు అమెరికాకి నాటో ఎంత విలువైనదని ప్రశ్నించటమనేదే కొత్త విషయం. అమెరికా భాగస్వామ్య పక్షాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశమది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ముప్పు ఎంత తీవ్రమైనది?
నాటో ఎదుర్కొంటున్న వ్యూహాత్మక సవాళ్లు మారుతున్నాయి. అవి చాలా సంక్లిష్టమైనవి.. అదే సమయంలో సులభంగా నిర్వచించలేనివి కూడా.
మళ్లీ బలం పుంజుకుంటున్న రష్యా నుంచి సమచారం - సైబర్ యుద్ధం వరకూ.. ఉగ్రవాదం నుంచి సామూహిక వలసల వరకూ ఈ సవాళ్లు చాలా ఉన్నాయి.
రష్యా ముప్పు కూడా మారింది. ఇది పాత సోవియట్ యూనియన్ కాదు. భారీ రష్యా యుద్ధ ట్యాంకులు పశ్చిమ దిశగా చొచ్చుకురాగల ముప్పు తక్కువ. కానీ హ్యాకింగ్ నుంచి సైబర్ దాడుల వరకూ సమాచార ఆపరేషన్ల వరకూ విస్తృత వ్యూహాలతోనే ఇప్పుడు పెద్ద ముప్పు. అవన్నీ పశ్చిమ ప్రజాస్వామ్యాలను అస్థిరపచటం లక్ష్యంగా సాగేవి.
రష్యా ప్రభుత్వం.. హత్యలకు కూడా సంసిద్ధంగా ఉందని పశ్చిమ ప్రభుత్వాలు స్పష్టంగా నమ్ముతున్నాయి.
2006లో లండన్‌లో అలెగ్జాండర్ లిత్వినెంకో హత్య, ఈ ఏడాది విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీలో మాజీ రష్యా గూఢచారి సెర్గీ స్క్రిపాల్, ఆయన కూతురు యూలియా స్క్రిపాల్‌లపై హత్యాయత్నాలను చూశాయి.
రష్యా సాపేక్షంగా బలహీనమైన దేశం. కానీ తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవటానికి అది తన సైనిక బలాన్ని ఉపయోగించటానికి.. ప్రత్యేకించి తమ దేశానికి దగ్గర్లోని జార్జియా, ఉక్రెయిన్‌లలో ఉపయోగించటానికి - సిద్ధంగా ఉంది.
నాటో సరిహద్దులను విస్తరించుకోవటం.. తన భద్రతకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్‌ను తట్టుకుని నాటో మనగలదా?
భూగోళమంతటా వ్యూహాత్మక ప్రయోజనాలున్న సూపర్‌పవర్ అమెరికా. రష్యా ముప్పు ఇప్పుడు భిన్నమైనది - దానిని ఎదుర్కోవటానికి గతంలో అవసరమైన భారీ బలగాలు ఇప్పుడనవసరం.
బహుశా.. యూరప్ తన స్వీయ రక్షణకు తానే చూసుకోగలిగి ఉండాలేమో.
ట్రంప్ మాటల తూటాలు ఎలా ఉన్నా.. అమెరికా నిజానికి యూరప్‌లో కొన్నేళ్ల కిందటికన్నా మరింత ఎక్కువగా సైనికంగా మరింత క్రియాశీలంగా ఉంది.
ఆయన ప్రభుత్వంలోని కీలక సభ్యులు.. ప్రత్యేకించి రక్షణమంత్రి జేమ్స్ మాటిస్.. అట్లాంటిక్ కూటమికి బలమైన మద్దతుదారులే.
కానీ.. అమెరికాకు మిత్రదేశాలైన యూరోపియన్ దేశాలు, కెనడాల విలువలు ట్రంప్ స్వయంగా విశ్వసిస్తారా? ఆయన విశ్వసించరని చాలా మంది అంటారు.
అమెరికాకు నాటో వంటి ఒక కూటమి ఎంత విలువైనదో ఆయన గుర్తిస్తారా? దీనికి కూడా చాలా మంది ఇచ్చే సమాధానం.. లేదు అనే.
ఈ నాటో సదస్సు అనంతరం ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమవటానికి వెళ్తారు. ఇది నాటో మిత్రదేశాలు చాలా వాటిని కలవరపాటుకు గురిచేస్తోంది. ట్రంప్ ఏం వదులుకోవచ్చు? నాటో కష్టాల నుంచి రష్యా ఏ సందేశం స్వీకరిస్తుంది?
ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఎదురవుతున్న ఒడిదొడుకుల విషయంలో నాటో దౌత్యవేత్తలు చేతులెత్తేశారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైతే.. నాటో నామమాత్రంగా మారుతుందని.. ట్రాన్స్‌అట్లాంటిక్ వెన్నెముక తీవ్రంగా దెబ్బతింటుందని భయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- ట్రంప్ అను నేను..!
- ట్రంప్‌కి బీపీ ఎంత?
- ‘బ్రిటన్‌లో రష్యా విష ప్రయోగం’
- ‘ట్రంప్‌కి ఆ ప్రమాదాలు తెలుసు’
- ట్రంప్ మానసిక స్థితిపై మళ్లీ చర్చ
- ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాం: ట్రంప్
- ఎఫ్‌బీఐ అధికార దుర్వినియోగం: ట్రంప్ సర్కారు ఫైర్
- భారతీయులు వైద్య విద్య కోసం రష్యా వెళ్లట్లేదు. ఎందుకంటే..
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- 'పోర్న్ స్టార్ నోరు మూయించడానికి ట్రంప్ లక్షా 30 వేల డాలర్లు చెల్లించారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








