సానుభూతి, సైన్యం, ఫేక్ న్యూస్, మతం: పాక్ ఎన్నికల్లో వీటి మధ్యే పోటీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓ ప్రభుత్వం పూర్తి కాలంపాటు పని చేయడం పాక్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
ప్రస్తుతం అక్కడ అన్నీ రాజ్యాంగ బద్ధంగా జరుగుతున్నట్లుగానే కనిపించినా, ఎన్నికలు సజావుగా సాగవేమోననీ, లేదా వాయిదా పడే అవకాశం ఉందేమోననే అనుమానం చాలామందిలో నెలకొంది.
ఈసారి ఎవరు గెలుస్తారోననే చర్చా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని పాక్ నిపుణులు భావిస్తున్న ఐదు ప్రధాన అంశాలివి.
1. నవాజ్ షరీఫ్‌కు సానుభూతి పవనాలు
షరీఫ్ పిల్లలకు విదేశీ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయంటూ 2016లో పనామా పత్రాలు బయట పెట్టిన నేపథ్యంలో, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌ను ఆ దేశ సుప్రీం కోర్టు గతేడాది చట్టసభల్లో ప్రాతినిధ్యానికి అనర్హుడిగా ప్రకటించింది. దాంతో ఈసారి ఎన్నికల్లో షరీఫ్ పోటీ చేయడానికి వీల్లేదు.
కానీ తన సోదరుడి నాయకత్వంలో నడుస్తున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ పార్టీ ప్రచారంలో షరీఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం షరీఫ్ తన ప్రచారంలో ‘ముఝే క్యూ నికాలా?’(నన్ను ఎందుకు తొలగించారు?) అనే మాటనే మంత్రంగా మార్చుకున్నారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని చెబుతున్నారు. ప్రజలు గనక ఆయన మాటల్ని నమ్మితే, చట్ట విరుద్ధంగా అతడిని తొలగించారని భావిస్తే, మరింత మెజారిటీతో ఆ పార్టీని గెలిపించే అవకాశం ఉందని సోహైల్ వారైచ్ అనే రాజకీయ నిపుణుడు అభిప్రాయపడుతున్నారు.
‘తనను తాను ఓ బాధితుడిగా చూపించుకోవడంలో షరీఫ్ విజయం సాధించారు. చాలామంది అతడి మాటల్ని నమ్ముతున్నారు. కావాలనే అతడిని ఇరికించారని భావిస్తున్నారు. గతేడాదిలో ఆయన 70సార్లకు పైగా కోర్టు మెట్లెక్కారు. రాజకీయంగా అణగదొక్కాలనే తనను అన్నిసార్లు కోర్టుకు రప్పిస్తున్నట్లుగా ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్లారు’ అంటారు అహ్మద్ బిలాల్ మెహబూబ్. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ డెవలప్‌మెంట్ అంట్ ట్రాన్స్‌పరెన్సీ అనే సంస్థకు బిలాల్ నాయకత్వం వహిస్తున్నారు.
షరీఫ్ భార్యకు క్యాన్సర్ సోకడంతో ప్రస్తుతం ఆమెకు లండన్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామం కూడా ఆయనకు ప్రజల సానుభూతిని తీసుకొచ్చిందని నిపుణులు భావిస్తున్నారు.
2008లో బేనజీర్ భుట్టో హత్యకు గురైన కొన్నాళ్లకే ఆమె పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా చూస్తే తక్కువ వ్యవధి ఉన్నప్పుడు సానుభూతి ఓట్లు కీలకంగా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. మిలిటరీ ప్రభావం
దేశంలో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన విషయమని ఇటీవల పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినా, ఆ దేశ రాజకీయాల్లో మిలిటరీ ప్రభావం బలంగా ఉంటుందని చాలా మంది నమ్మకం.
సైన్యం మొగ్గు చూపిన పార్టీలకే ప్రజలు ఓటేసే అవకాశాలు ఎక్కువని, గతంలోని ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అహ్మద్ బిలాల్ మెహబూబ్ అంటున్నారు.
సోహైల్ వారైచ్ మాత్రం ఇదే అంశాన్ని భిన్నంగా చూస్తున్నారు. ‘సైన్యంలో పనిచేసే బృందాలు, వాళ్ల కుటుంబ సభ్యులతో పాటు మొత్తంగా సైన్యం మీద ఆర్థికంగా ఆధారపడ్డవారి సంఖ్య దాదాపు కోటిదాకా ఉంటుంది. అలా చూస్తే చాలా ప్రాంతాల్లో ఫలితాల్ని వాళ్లు నేరుగా శాసించొచ్చు’ అని ఆయన చెబుతారు.
పత్రికా స్వేచ్ఛను నియంత్రించడం ద్వారా వాళ్లు ఎన్నికలు జరిగే తీరునీ ప్రభావితం చేయగలరని సారా ఖాన్ అనే మరో రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. మత రాజకీయం
పాకిస్తాన్ ప్రజల జీవితాల్లో మతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్నికలూ అందుకు అతీతం కాదు. మత ప్రాతిపదికన కూడా ఇటీవల అక్కడ అనేక పార్టీలు, కూటములు ఏర్పాటయ్యాయి.
నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీల మధ్య ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మతపరమైన కూటములే అక్కడ ప్రధాన భూమిక పోషిస్తాయని, మెజారిటీ తక్కువగా ఉన్న స్థానాల్లో ప్రధాన అభ్యర్థుల్ని గెలిపించేందుకైనా, ఓడించేందుకైనా ఈ మతపరమైన ఓట్లే కీలకంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో మతపరమైన పార్టీలు కలిసి పీఎంఎల్-ఎన్ ఓట్లను చీల్చిన విషయాన్ని సోహైల్ గుర్తు చేస్తున్నారు.
‘దేశంలో ఓట్లను రాల్చడానికి ఇప్పటికీ మతం కీలక పాత్ర పోషిస్తోంది. దైవ దూషణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ప్రాబల్యమూ పెరిగిపోయింది. ఈసారి ఎన్నికల్లో అవి ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి’ అన్నారు సారా ఖాన్.
4. అభివృద్ధి-ఆర్థిక వ్యవస్థ
పాకిస్తాన్ ఓటర్లు పార్టీల మ్యానిఫెస్టోలు, వారి ఆర్థిక ఎజెండాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఉద్యోగావకాశాలు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన లాంటి కొన్ని అంశాలను మాత్రం కీలకంగా భావిస్తారు. అందుకే నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి ఆధారంగా కూడా ఓటర్లు తమ నాయకుడిని ఎంచుకునే అవకాశం ఉందని సారా ఖాన్ చెబుతున్నారు.
2013లో నిర్వహించిన ఓ సర్వే కూడా ఎక్కువ శాతం ఓటర్లు అభివృద్ధి ఆధారంగానే ఓట్లు వేస్తామని చెప్పినట్లు తేల్చింది.
అందుకే ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక పరమైన అంశాలను సమర్థంగా నిర్వహించగలరా లేదా అనే ప్రశ్న కూడా అక్కడి ప్రజల్లో నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
5. మీడియా-ఫేక్ న్యూస్
మీడియా, ఫేక్ న్యూస్ కూడా ఎన్నికలను, ఓటర్లను ప్రభావితం చేయగలదని నిపుణులు భావిస్తున్నారు.
‘సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వేగంగా విస్తరిస్తుంది. జనాలు త్వరగా వాటిని నమ్మేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది కల్పితమో చెప్పాల్సిన బాధ్యత మీడియాపైనే ఉంది. కానీ దేశంలో ప్రస్తుతం మీడియా నాణ్యతను గమనిస్తే అది సాధ్యం కాదేమోననే అనుమానం కలుగుతుంది. అందుకే దేశంలో ఫేక్ న్యూస్‌ను అరికట్టడం అంత సులభం కాకపోవచ్చు’ అంటున్నారు సోహైల్.
దేశంలో సోషల్ మీడియా ఎక్కువ మందికి అందుబాటులో లేకపోవడంతో రానున్న ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయడం, నిజాలను వెలుగులోకి తేవడంలో మీడియాదే కీలకపాత్ర.
ఇవి కూడా చదవండి
- కత్తి మహేశ్: పోలీసులు ఎందుకు బహిష్కరించారు?
- అమెరికాలో చనిపోతే స్వదేశానికి తెచ్చేదెవరు? సాయం చేసేదెవరు?
- ‘అది మోక్షం కాదు, పిచ్చి’
- ముంబయిలో మురికి వాడ.. ఇప్పుడు రంగుల లోకమైంది
- యుగాండ: ఫేస్‌బుక్, వాట్సప్ వాడితే ట్యాక్స్ కట్టాలి
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- 'పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పెద్ద నేతలంతా నిరుపేదలే'
- పాకిస్తాన్ సెనెటర్‌గా ఎన్నికైన హిందూ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








