చెస్ ఒలింపియాడ్ 2022: చెన్నైలోని ఈ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్స్ అమెరికాకు చెక్ పెడతారా?

చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చొక్కా, లుంగీ కట్టుకున్న గుర్రం 'తంబి'.. చెస్ ఒలింపియాడ్ 2022 మస్కట్
    • రచయిత, సూసన్ నినాన్
    • హోదా, బీబీసీ న్యూస్

భారతదేశంలో చివరిసారిగా 2013లో చెస్ జాతీయ వార్తల ముఖ్యాంశాల్లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం తరువాత మళ్లీ దేశంలో అతిపెద్ద చెస్ పోటీలు జరగనున్నాయి. చెన్నైలో చెస్ ఒలింపియాడ్ 2022 ప్రారంభం కానుంది. జూలై 28 నుంచి ఆగస్ట్ 10 వరకు జరగనున్న ఈ పోటీల్లో 180కి పైగా దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు.

రెండేళ్లకోసారి జరిగే చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత్ ఒకే ఒక్కసారి మెడల్ గెలుచుకుంది. 2014లో 19వ సీడ్‌లో ఉన్న ఆటగాళ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాంస్యం గెలుచుకున్నారు.

ఈసారి మాత్రం భారత్ టాప్ సీడెడ్ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. అమెరికా తరువాత రెండవ స్థానంలో భారత్ ఉంది. దేశంలో నైపుణ్యం గల చెస్ గ్రాండ్ మాస్టర్లు పెరుగుతున్నారన్న దానికి ఇదే నిదర్శనం.

అయిదుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న విశ్వనాథన్ ఆనంద్ మార్గనిర్దేశంలో భారత చెస్ బృందాలు ఆటకు పదునుపెడుతున్నాయి. విజయవంతమైన కోచ్‌ల వద్ద శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు తయారవుతున్నారు.

ఈసారి వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు.

మొత్తం 30 మంది భారత క్రీడాకారులు ఆరు జట్లుగా (ఓపెన్, మహిళల విభాగాల్లో ముగ్గురు చొప్పున) ఈ ఈవెంట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

గత కొన్ని వారాలుగా వారికి 'టీం ట్రైనింగ్' ఇస్తున్నారు. కొందరు ఆటగాళ్లు విదేశాల్లో టోర్నమెంటు ఆడేందుకు వెళ్లి వచ్చారు. వారంతా స్వదేశంలో ఆటకు సిద్ధం కావాల్సి ఉంది.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయిదుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న విశ్వనాథన్ ఆనంద్, భారత చెస్ జట్లకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.

మొదటి ఓపెన్ జట్టు (A టీం)లో పెంటాల హరికృష్ణ, విదిత్ గుజ్రాతి, కె. శశికిరణ్, ఎస్ఎల్. నారాయణన్, అర్జున్ ఎరిగైసి లాంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు.

కానీ, రెండవ జట్టు (B టీం) మరింత ఆసక్తికరం. ఉజ్వలమైన యువ గ్రాండ్‌మాస్టర్లు ఇందులో ఉన్నారు. వాళ్లంతా 11వ సీడెడ్ ఆటగాళ్లు.. ఆర్. ప్రగ్నానంద, డి. గుకేష్, నిహాల్ సరిన్, రౌనక్ సాధ్వానీ, 2014 పోటీల్లో దూసుకెళ్లిన బి. అధిబన్.

"మంచి బలమైన B టీం ఉండడం అనేది అరుదుగా జరిగే విషయం. ఈ టీంకు మెడల్స్ గెలుచుకునే సత్తా ఉంది" అని కోచ్ శ్రీనాథ్ నారాయణన్ అన్నారు. సెకండ్ సీడెడ్ ప్లేయర్స్‌కు ఆయన శిక్షణ ఇస్తున్నారు.

"చివరి నిమిషంలో ఆరోగ్యపరమైన సమస్యలు ఏవీ తలెత్తకుండా ఉంటే, మనం మెడల్స్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆటగాళ్లపై ఒత్తిడి లేదు. పోటీ చివరికొచ్చేకొద్దీ అంచనాలు పెరుగుతాయి" అని శ్రీనాథ్ నారాయణన్ అన్నారు.

చెస్ ఒలింపియాడ్ ప్రారంభ, ముగింపు వేడుకలకు ఒక్కోరోజు కేటాయించారు. జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు పోటీలు జరుగుతాయి. 11 రౌండ్లలో మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యలో ఒకరోజు విశ్రాంతి ఉంటుంది. ఒక్కో జట్టులో నలుగు ఆటగాళ్లు ఉంటారు. ఒక రిజర్వ్ ప్లేయర్ ఉంటారు.

భారత మహిళల జట్టు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి లాంటి అత్యుత్తమ ప్లేయర్స్‌తో బలంగా ఉంది. వీళ్లు నంబర్ వన్ స్థానంలో (1వ సీడ్) ఉన్నారు. కచ్చితంగా దేశానికి పతకాలు సాధిస్తారనే అంచనాలు వీరిపై ఉన్నాయి. మహిళల జట్టులో తాన్యా సచ్‌దేవ్, ఆర్. వైశాలి, భక్తి కులకర్ణి కూడా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, కోనేరు హంపి: 'అమ్మాయి కదా... గ్రాండ్ మాస్టర్ కాగలదా అని అనేవారు'

రూల్స్ ఏమిటి?

చెస్ ఒలింపియడ్ పోటీల్లో నిబంధనలు ఇవీ..

  • ఆటగాళ్ల స్కోర్ ప్రకారం ప్రత్యర్థులతో తలపడతారు. అయితే, ఒక జట్టుతో ఒకసారి మాత్రమే ఆడతారు.
  • A టీంలో అత్యుత్తమ ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. B టీంలో రెండవ స్థానంలో ఉన్న ఆటగాళ్లు ఉంటారు.
  • మ్యాచుల్లో పాయింట్లు లెక్కబెడతారు. రెండు పాయింట్లు వస్తే గెలిచినట్టు. ఒక పాయింట్ వస్తే డ్రా అయినట్టు. ఒక్క పాయింటూ రాకపోతే ఓడిపోయినట్టు లెక్క.
  • పోటీల్లో రెండు విభాగాలు ఉంటాయి.. ఓపెన్ క్యాటగిరీ, మహిళల విభాగం. ఓపెన్ క్యాటగిరీలో పురుషులు, మహిళలూ కూడా పాల్గొనవచ్చు.
చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపీ భారత మహిళల జట్టులోని టాప్ ప్లేయర్లలో ఒకరు

చెస్ ఒలింపియాడ్ 2022 మస్కట్ 'తంబి'

కోవిడ కారణంగా గత రెండేళ్లల్లో చెస్ ఒలింపియాడ్ గేమ్స్ ఆన్‌లైన్‌లో జరిగాయి. రెండింటిలోనూ భారత్ పతకాలు గెలుచుకుంది. అయితే, ఎదురెదురుగా కూర్చుని ఆడే సంప్రదాయ చదరంగం ఆట తీరే వేరు. రెండేళ్లకొకసారి ప్రతిష్టాత్మకంగా జరిగే ఒలింపియాడ్ పోటీలకున్న క్రేజ్ వేరు.

సాధారణంగా, ఇంత భారీ స్థాయి పోటీలు నిర్వహించడానికి రెండు మూడేళ్ల ముందు నుంచీ సన్నాహాలు ప్రారంభిస్తారు. కానీ, రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో చివరి నిమిషంలో ఆతిధ్యానికి సిద్ధమయిన భారత్ కేవలం నాలుగు నెలల్లోనే ఏర్పాట్లు చేసింది.

తమిళనాడు ప్రభుత్వం 79 కోట్ల ( 10 మిలియన్ డాలర్లు) బిడ్‌తో సిద్ధమైంది. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) ఆఘమేఘాల మీద ఈ పది రోజుల వేడుకకు ఏర్పాట్లు చేసింది. సుమారు 1,700 క్రీడాకారులకు ఆతిధ్యం సిద్ధం చేసింది.

వేదిక నిర్వహణ, ఎలక్ట్రానిక్ చెస్ బోర్డుల పనితీరు పరీక్షించేందుకు గత ఆదివారం 1,400 స్థానిక క్రీడాకారులతో ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించారు.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్ మస్కట్ 'తంబి'. (తమ్ముడు). లుంగీ, చొక్కా ధరించిన గుర్రం (చెస్‌లో నైట్) తంబి ఎయిర్‌పోర్టులో విదేశీ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాడు.

చెస్ దిగ్గజాలు రష్యా, చైనా ఈ పోటీల్లో పాల్గొనట్లేదు. కానీ ఇతర దేశాల సాయుధ సైనికులంతా గజ, అశ్వ దళాలతో చెన్నైలో దిగుతున్నారు.

నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ పావులు కదిపేందుకు సిద్ధంగా ఉన్నారు. గత అయిదేళ్లుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న కార్ల్‌సెన్ వచ్చే ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకోబోతున్నానని ఈ మధ్యే ప్రకటించారు.

కాకతాళీయంగా, కార్ల్‌సన్ తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నది చెన్నైలోనే. 2013లో డిఫెండింగ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ఒక తరం భారతీయ చెస్ క్రీడాకారులను ఒక ఊపు ఊపింది. ఈరోజు దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న గ్రాండ్‌మాస్టర్లు అప్పట్లో ఏడు, ఎనిమిది వయసు గల పిల్లలు. ఆ మ్యాచ్ జరుగుతున్న వేదిక బయట కళ్లు పెద్దవి చేసుకుని వేలాడిన పిల్లలు వీళ్లు.

వారిలో ప్రజ్ఞానంద, నిహాల్ కూడా ఉన్నారు. ఇంచుమించు అదే సమయంలో, నిహాల్ చెన్నైలో జరిగిన నేషనల్ అండర్-నైన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 20 ఏళ్ల క్లార్‌సన్ కొత్త చెస్ ఛాంపియన్‌గా ఎదిగిన మ్యాచ్ నిహాల్‌కు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013లో ఆనంద్, కార్ల్‌సన్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక తరం భారతీయ చెస్ క్రీడాకారులను ఒక ఊపు ఊపింది.

దేశంలో చెస్ క్రేజ్ నింపడానికి ఇదో మంచి అవకాశం

ప్రస్తుత భారత జట్టు కోచ్, గ్రాండ్‌మాస్టర్ శ్రీనాథ్‌కు మాత్రం 1995 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రత్యేకమైనది. రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్, భారత ప్లేయర్ ఆనంద్ మధ్య జరిగిన ఆట తన జీవితాన్ని మార్చేసిందని శ్రీనాథ్ చెప్పారు.

"మా నాన్న ఆ మ్యాచ్‌ను టీవీలో చూసి, చెస్ ఆటతో ప్రేమలో పడిపోయారు. అప్పుడే నన్ను చెస్‌లో ప్రోత్సహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పటికి నేను పుట్టి ఏడాది అయింది" అని చెప్పారు శ్రీనాథ్.

ప్రస్తుత ఒలింపియాడ్ గేమ్స్ కోసం నిర్వాహకులు మెరుపువేగంతో ప్రచారాలు చేశారు.

చెన్నైలోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన నేపియర్ వంతెన ఇప్పుడు చదరంగం ఆకారాన్ని సంతరించుకుంది. నలుపు, తెలుపు గడులతో చెస్ బోర్డులా మెరిసిపోతోంది. మస్కట్ తంబి పాల ప్యాకెట్లపై, సోషల్ మీడియా వేదిలపై దర్శనమిస్తున్నాడు. ఈ వేడుక హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి.

చెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నలుపు, తెలుపు గడులతో చెన్నైలోని నేపియర్ వంతెన

కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో చెస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ పెరిగిపోయింది. యూట్యూబ్, ట్విచ్ స్ట్రీమింగుల్లో చాలామంది ఫాలోవర్స్ తయారయ్యారు. దాని ఫలాలు ఈ ఒలింపియాడ్‌కు అందనున్నాయి.

భారత్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీ జరిగి తొమ్మిదేళ్లు అవుతోంది. దీర్ఘకాలం తరువాత దేశంలో చెస్ క్రేజ్ నింపడానికి ఓ కొత్త పోటీ అవసరం. చెస్ ఒలింపియాడ్ 2022 ఆ పని చేస్తుందని ఆశిస్తున్నారు.

భారతదేశానికి ఈ ఆతిథ్యం చారిత్రాత్మకం కావచ్చు. సాధారణంగా క్రికెట్ లేదా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ విశేషాలతో నిండిపోయే సోషల్ మీడియా ఇప్పుడు చెస్ పోటీల విశేషాలతో నిండిపోయినా ఆశ్చర్యం లేదు.

భారతీయులకు తమ దేశంలోని అత్యుత్తమ చెస్ ఆటగాళ్ల పేర్లు తెలుసుకోవటానికి ఇదొక మంచి అవకాశం.

వీడియో క్యాప్షన్, ఇప్పుడా ఆ ఊరు ఊరంతా చెస్ ఆడుతూ చెస్ విలేజ్‌గా పేరుతెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)