వనమా రాఘవ భూ కబ్జాపై జాయింట్‌ సర్వే- ప్రెస్‌రివ్యూ

వనమా రాఘవేంద్రరావు

ఫొటో సోర్స్, FACEBOOK/VANAMARAGHAVENDRA

ఆస్తి పంపకం వ్యవహారంలో తలదూర్చి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి ఘటనకు కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావు(రాఘవ) అక్రమ ఆస్తులను నిగ్గుతేల్చే పనిలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు ఉన్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

రాఘవ అరెస్టు తర్వాత అందరి దృష్టి ఆయన చేసిన భూ కబ్జాలపై పడింది. మీడియాలో కూడా ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్న క్రమంలో కొన్ని సామాజిక మాధ్యమాల్లో రాఘవ ఆక్రమించిన భూమిగా ప్రచారం అవుతున్న పాల్వంచ మండలం బంగారుజాల గ్రామంలోని పామాయిల్‌ తోటపై అధికారులు దృష్టి పెట్టారు.

ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు గురువారం ఆ తోటను సందర్శించారు. సర్వేలో భాగంగా ఆ భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందా? లేక రెవెన్యూ పరిధిలోకి వస్తుందా? అనే విషయాలపై ఆరా తీశారు.

మరో రెండు రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని, సర్వే పూర్తయిన తర్వాత అటవీ భూమి అక్రమణకు గురైందా..? లేదా..? అనే విషయాన్ని వెల్లడిస్తామని ఎఫ్‌డీవో అనిల్‌ తెలిపినట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కే తారకరామారావు

ఫొటో సోర్స్, KTR/FACEBOOK

‘మోదీ 15 లక్షల హామీ ఈ శతాబ్దపు అబద్ధం’

దేశంలో ప్రతి ఒక్క పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఈ శతాబ్దపు అతి పెద్ద అబద్ధమని తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె. తారకరామారావు వ్యాఖ్యానించినట్లు 'నమస్తే తెలంగాణ' ఒక వార్తను ప్రచురించింది.

''మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విట్టర్‌ వేదికగా 'ఆస్క్‌ కేటీఆర్‌' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలతోపాటు ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సినిమా, క్రీడలు వంటి అనేక అంశాలపై స్పందించారు.

ఈ సెషన్‌ జాతీయస్థాయిలో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ మంత్రి కేటీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ హామీపై ఒక్క మాటలో స్పందించాలని ఓ నెటిజన్‌ కోరగా.. 'జుమ్లా ఆఫ్‌ ద సెంచరీ' (ఈ శతాబ్దానికే అతి పెద్ద అబద్ధం) అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

'బీజేపీ ఏడేండ్లుగా అధికారంలో ఉన్నా ఇప్పటికీ మత విద్వేషాల చుట్టే తిరుగుతున్నది తప్ప.. ఇదీ మేం చేసిన అభివృద్ధి అని చూపించుకునే స్థితిలో ఎందుకు లేదు?' అని నెటిజన్‌ ప్రశ్నించగా.. 'వాళ్లు ఏమీ చేయలేదు కాబట్టి చెప్పుకోలేరు' అని బదులిచ్చారు.

దేశ ప్రయోజనాలకోసం సీఎం కేసీఆర్‌ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నారని, మరి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. 'భవిష్యత్తును ఎవరు ఊహించగలరు?' అంటూ మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

80 మందితో కాల్‌ సెంటర్‌.. రూ. 50 కోట్లకు పైగా టోకరా

నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ అంతర్జాతీయ క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని 'ఈనాడు' ఒక వార్తను రాసుకొచ్చింది.

''మొహాలీ, హైదరాబాద్‌కు చెందిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. వీరి నుంచి రూ.1.11 కోట్లు, పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.

సీపీ మాట్లాడుతూ,. ''ఈ ముఠా 80 మందితో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుల అమ్మకాలు చేస్తోంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడ్డారు.

ఈ వ్యవహారంలో ఈ ముఠాకు చెందిన నవీన్ బొటాని కీలక పాత్ర పోషించారు. నవీన్‌ 2017లో ఆర్‌ఎన్‌ టెక్‌ సర్వీసెస్‌ అని ఒక కంపెనీని స్థాపించారు. ఇందులో 80 మందితో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

దిల్లీ, మొహాలీ, ఘజియాబాద్‌లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డులు ఉన్నవారి సమాచారాన్ని ఈ ముఠా సేకరించింది.

విదేశీ క్రెడిట్ కార్డుల కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు.

దుబాయ్‌లో మరో 2 ముఠాలు ఉన్నట్లుగా గుర్తించాం'' అని సీపీ వెల్లడించారని'' ఈనాడు పేర్కొంది.

అటవీ విస్తీర్ణం

ఫొటో సోర్స్, KTR/TWITTER

హరితాంధ్రప్రదేశ్‌: అటవీ విస్తీర్ణం పెరుగుదలలో తెలుగు రాష్ట్రాలు టాప్

దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ఆధారంగా తెలిసినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

'ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2021'ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ గురువారం విడుదల చేశారు.

''ఇందులో గత రెండేళ్లలో ఏపీ 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల సాధించి టాప్‌లో నిలిచింది. 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి.

మెట్రో నగరాల్లో 2011- 2021 మధ్య దశాబ్ద కాలంలో పచ్చదనం విస్తీర్ణం గ్రేటర్‌ హైదరాబాద్ లో అత్యధికంగా (48.66 చ.కి.మీ) పెరిగింది. నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది.

గత రెండేళ్లలో దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదైందని నివేదిక వెల్లడించింది.

మొత్తం భౌగోళిక ప్రాంతంలో అత్యధిక అటవీ విస్తీర్ణమున్న రాష్ట్రాల్లో మిజోరం (84.53%), అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్‌ (74.34%), నాగాలాండ్‌ (73.90%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.

దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ నిలిచింది. దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కి.మీ ఉండగా.. 2019తో పోలిస్తే 17 చదరపు కి.మీ పెరుగుదల నమోదైందని తేలింది.

దేశంలోని అడవుల్లో కార్బన్‌ స్టాక్‌ 7,204 మిలియన్‌ టన్నులుండగా, 2019తో పోలిస్తే 79.4 మిలియన్‌ టన్నుల పెరుగుదలగా గుర్తించినట్లు నివేదిక వెల్లడిస్తోందని'' సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)