నల్గొండ జిల్లా: వీడని చింతపల్లి హత్య చిక్కుముడి, ఇంకా దొరకని మొండెం

మహంకాళి విగ్రహం
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్ దగ్గర జరిగిన హత్య కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. చనిపోయిన వ్యక్తి మొండెం దొరకలేదు.

మృతుడు సూర్యాపేట జిల్లా శూన్య పహాడ్‌కు చెందిన జయేందర్ నాయక్ అని గుర్తించారు. ఆ వ్యక్తి మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొండెం నుంచి వేరు చేసిన రక్తం కారుతున్న తలను స్థానిక మెట్టు మహంకాళి మైసమ్మ అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు.

వీడియో క్యాప్షన్, నల్గొండలో హత్య నరబలి కోసమే జరిగిందా?

సోమవారం ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారి దీన్ని గుర్తించారు.

''రోజూ ఉదయం ఆరు గంటలకు పూజ కోసం వచ్చి మైక్ వేస్తాను. రోజూ అక్కడ శుభ్రం చేస్తాను. తరువాత స్నానం చేసి వచ్చి దీపం పెడతాను. సోమవారం ఉదయం ఆరు గంటలకు వచ్చినప్పుడు పాదాల దగ్గర అది (తల) కనిపించింది. అది అదే(తల) అని అర్థమవుతోంది కానీ, నా కంటికి ఆపరేషన్ కావడంతో సరిగా కనిపించలేదు.

దీంతో కంగారుగా పరిగెత్తి దగ్గర్లోని వాళ్లను పిలిచాను. వారు వచ్చి చూసి తలే అని చెప్పారు. వెంటనే సర్పంచికి చెప్పాం. పోలీసులు వచ్చారు. ఇక అప్పటి నుంచి అమ్మవారికి దీపం కూడా పెట్టలేదు. భయం వేసింది.

నాలుగేళ్లుగా ఇక్కడ పూజ చేస్తున్నా, ఎప్పుడూ ఇలా చూడలేదు. మా ఇంట్లో కూడా భయపడుతున్నారు. కూలి పని చేసుకునే వాళ్లం. మేం ఎప్పుడూ ఇలాంటివి వినలేదు. ఎవరో తెచ్చి ఇక్కడ వేశారు'' అని బీబీసీతో చెప్పారు ఆ గుడి బాధ్యతలు చూస్తోన్న బ్రహ్మచారి.

''చనిపోయిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. అతని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు అంటు అయింది. ఆలయం శుద్ధి చేయాలి. అది జరిగినప్పటి నుంచి లైట్ వేయడానికి కూడా మనసు ఒప్పక లైట్ వేయలేదు'' అన్నారు బ్రహ్మచారి.

మహంకాళి విగ్రహం

'ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు'

''ఇలాంటిది ఎప్పడూ జరగలేదు. ఇదే మొదటిసారి. 30 ఏళ్లుగా గుడి నిర్వహిస్తున్నాం. బోనాలు చేస్తున్నాం. హోమాలు చేస్తున్నాం. శుభకార్యాలకు అమ్మవారిని దర్శించుకుంటున్నాం.

ఎలా జరిగిందో తెలియదు. ఈ ఏరియాలో ఎప్పుడూ చూడలేదు. ఆ వ్యక్తిని కూడా ఎప్పుడూ చూడలేదు. నరబలులు ఎప్పుడూ జరగవు ఇక్కడ. ఈ ఏరియాలో అలాంటి వాళ్లు లేరు'' అని బీబీసీతో చెప్పారు ఆ గ్రామ సర్పంచ్, దేవాలయ కమిటి అధ్యక్షులు విశ్వనాథం.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి అక్కడకు రావడానికి గ్రామస్తులు కూడా భయపడుతున్నారన్నారు సర్పంచ్.

''ప్రస్తుతానికి పూజలు ఆపాం. ఆలయం శుద్ధి చేసి, హోమం చేసి మళ్లీ పూజలు చేస్తాం'' అన్నారాయన.

మహంకాళి విగ్రహం

మృతుడి వివరాలు ఎలా తెలిశాయి?

వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయిన ఫోటోలను చూసిన మృతుడి బంధువులు పోలీసులను సంప్రదించారు. ఫోటోలోని వ్యక్తి తమ వాడే అని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుని వివరాలు తెలిశాయి.

చనిపోయిన వ్యక్తి పేరు జయేందర్ అని, అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు వారు తెలిపారు. కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు జయేందర్.

''జయేందర్ మా అన్న కొడుకు. అయితే వయసులో నాతోటి వాడు. దీంతో చిన్నప్పటి నుంచి అతను నాకు తెలుసు. బాగా చదివేవాడు. కానీ ఇంటర్ నుంచి మానసిక సమస్యలు ఉన్నాయి. ఎర్రగడ్డ ఆసుపత్రిలోనూ, ఇతర చోట్లా మేం చికిత్స అందించాం. ఇంటికి వచ్చినా మళ్లీ వెళ్లిపోయేవాడు. కొంతకాలం హాస్టళ్లో కూడా ఉంచాం. ఇంటి నుంచి రెండుసార్లు పారిపోయాడు.

చివరకు తుర్కయాంజాల్ వచ్చి అక్కడే భిక్షాటన చేస్తూ ఉంటున్నాడు. మేం ఎంత పిలిచినా తను రాలేదు. దీంతో తల్లిదండ్రులే ఎప్పుడైనా తుర్కయాంజాల్ వెళ్లి కొడుకుని చూసి వెళుతుంటారు. అతనికి ఇద్దరు చెల్లెళ్లున్నారు'' అని బీబీసీతో చెప్పారు మృతుని బంధువు అశోక్ నాయక్.

''సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వాట్సాప్‌లో ఫోటో చూసి అనుమానంతో అన్నకు కాల్ చేశాను. బాబు ఎక్కడ ఉన్నాడని అడిగాను. తుర్కయాంజాల్‌లో ఉంటున్నాడు అన్నాడు. నాకు అనుమానం వచ్చింది కానీ నేరుగా చెప్పలేకపోయాను. పోయి ఫోటో చూపించాను. మన బాబే అన్నారు. వెంటనే పోలీసులకు చెప్పాం'' అంటూ వివిరించారు అశోక్.

ఇది ముందే ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా తెలుస్తోందని అన్నారు అశోక్.

తెలంగాణ పోలీస్

మొండెం కోసం గాలిస్తున్న పోలీసులు

ఘటన జరిగిన తీరు నరబలిని తలపిస్తోంది. ఇప్పటి వరకూ మృతుడి మొండెం దొరకలేదు. పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

మృతుడు గతంలో తుర్కయాంజాల్‌లో భిక్షాటన చేస్తూ ఉండేవాడనీ, కొంతకాలంగా కనిపించడం లేదనీ విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

దీంతో పక్కా ప్రణాళిక ప్రకారమే ఇది జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

''మృతుడికి ఆ ఊరిలో ఎవరితోనూ పరిచయాలు లేవు. ప్రస్తుతానికి తల ఒక్కటే దొరికింది. మొండెం కోసం గాలిస్తున్నాం. విచారణ తరువాతే వివరాలు చెప్పగలం'' అన్నారు దేవరకొండ డీఎస్పీ ఆనంద రెడ్డి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)