'స్కైలాబ్' సినిమా రివ్యూ: కరీంనగర్ జిల్లా బండలింగంపల్లిలో సాగిన కథ

ఫొటో సోర్స్, facebook/satyadev
- రచయిత, రేఖ పర్వతాల
- హోదా, బీబీసీ కోసం
స్కైలాబ్ భూమి మీద పడబోతోందంటూ 1979లో చెలరేగిన కలకలాన్ని నేపథ్యంగా తీసుకుని అల్లిన ఈ చిత్రంలో నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించారు. అయితే, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే స్కైలాబ్ 'స్కైలాబ్' మంచి కామెడీ సినిమాగా ఆకట్టుకుంటుంది. ఇది నవ్విస్తూనే మానవీయ కోణాన్ని హృద్యంగా చూపించిన సినిమా.
కొత్త ఆలోచనలు యువతరం నుండే వస్తాయని మరోసారి ఈ సినిమా నిరూపించింది. స్కైలాబ్ న్యూ ఏజ్ హ్యూమర్ అంటే సరిగ్గా సరిపోతుంది.

ఫొటో సోర్స్, facebook/Dr.RaviKiraneYadav
ఇదీ కథ...
కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లి గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. అన్ని ఊళ్లలాగే ఈ ఊరు కూడా అంటరానితనం, దొరతనం, ప్రజల అమాయకత్వం, అజ్ఞానం, మూఢనమ్మకాలు ఇలా ఓ మినీ భారతదేశం లాగా ఉంటుంది.
ఆ ఊరి దొర బిడ్డ గౌరి (నిత్య మీనన్) పెద్ద విలేఖరి అవ్వాలని, తన ఇంటి పేరుతో కాకుండా తనకంటూ సొంత గుర్తింపు, ప్రాచుర్యం సంపాదించుకోవాలని ఆ దిశగా తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్) ట్రీట్మెంట్ చేసిన ఒక పేషెంట్ చనిపోవతాడు. దాంతో, అతడి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. తిరిగి లైసెన్స్ కోసం ప్రయత్నిస్తే అయిదు వేలు లంచం అడుగుతారు.
ఆ డబ్బు కోసం వాళ్ల తాత (తనికెళ్ల భరణి) దగ్గరికి వస్తారు. ఆ ప్రయత్నాలు ఫలించక సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) తో కలిసి ఆ ఊరిలో హాస్పిటల్ పెడదామనుకుంటారు.
ఇక రామారావు తన తాతలు సుబేదారులుగా పనిచేశారని చెబుతూ.. వాళ్ల ఫోటోలు, జ్ఞాపకాలతో గడుపుతూ ఊరినిండా అప్పులు చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. తన తాతల నుంచి సంక్రమించిన 30 ఎకరాల పొలం కోర్టు కేసుల్లో ఇరుక్కుందని అది తిరిగి వస్తే, మీ అప్పులన్నీ తీర్చేస్తానని చెబుతూ అప్పుల వాళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతుంటారు.
ఏదైనా పని చేసుకోమంటే తమది సుబేదారి వంశం కాబట్టి పనిచేయనంటుంటారు రామారావు. పని చేద్దామన్నా తమవాళ్ళు చేయనివ్వరని చెబుతుంటారు.
ఈ కథంతా నడుస్తుండగా నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ ‘స్కైలాబ్’ అంతరిక్షం నుంచి భూమి మీద పడుతుందని.. అదీ నేరుగా బండలింగంపల్లిలోనే పడుతుందన్న వదంతులు వ్యాపించడంతో ఆ గ్రామ ప్రజల ఎలాంటి భయాందోళనలకు గురయ్యారు, నిజంగానే స్కైలాబ్ ఆ గ్రామంలోనే పడిందా, ప్రధాన పాత్రలు తాము అనుకున్నవి సాధించాయా? అనేది స్క్రీన్ మీద చూడాలి.
ఈ మూడు కథలను దర్శకుడు మలచిన విధానం చాలా ఆసక్తిగా, ఆహ్లాదంగా ఉంది.
తాయత్తులు కట్టే పెద్దమనిషి మాట నమ్మి ఆ ఊరిలో ఉన్న ప్రాథమిక ఆస్పత్రిని కూడా మూసేసి అందులో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు.
అయిదు వేల రూపాయల కోసం వచ్చిన డాక్టర్ ఆనంద్ ఆ ఊరిలో హాస్పిటల్ పెట్టి ఆ డబ్బు సంపాదిద్దాం అనుకుంటారు.
రామారావు తల్లి, వాళ్ళ నానమ్మ వాస్తవానికి దూరంగా చరిత్ర భ్రమలో బతుకుతూ గొప్పలు పోతుంటారు. వాళ్ళ తాత కిరీటానికి రోజు పూజలు చేస్తుంటారు. చివరికి ఆ కిరీటం అమ్మేసి హాస్పిటల్ పెట్టడానికి రామారావు చేసిన ప్రయత్నంలో ఆయన నిజంగానే ఆ ఊరికి సుబేదార్ అయ్యారనిపిస్తుంది.
జ్వరం వచ్చినా జబ్బు వచ్చిన తాయత్తుల మీద ఆధారపడే ఆ గ్రామ ప్రజల జీవితాల్లోకి హాస్పిటల్ తీసుకొస్తాడు సుబేదార్ రామారావు.
ఇక ఆనంద్ పుట్టిన ఊరిని వదిలి ఎక్కడికో వెళ్లి పరాయీకరణలో బతికే కంటే సొంత ఊళ్ళో సొంత మనుషుల మధ్య ఉంటూ వాళ్లకు వైద్యం చేయడమే మంచిదని భావించి, లైసెన్స్ వచ్చినా కూడా ఆ గ్రామ ప్రజల మధ్యనే ఉండిపోతారు.
'గౌరీ వెంకటరాజు'గా ప్రతిబింబం పత్రికలో పనిచేసి తండ్రికి ఒంట్లో బాగాలేదని తెలిసి ఇంటికి వస్తుంది హీరోయిన్.
తన రచనలు భరించలేక ఆ పత్రిక వాళ్ళు ఉద్యోగం పీకేసినట్టు ఉత్తరం రాస్తారు. తన ఇంటి పేరుతో కాకుండా గౌరిగానే పాపులర్ అవ్వాలని స్కైలాబ్ వార్తలతో ఆ ఊరి ప్రజలను భయపెడుతూ ఎన్నో కథలు, వార్తలు రాసి పంపిస్తుంటుంది, కానీ ఏ పత్రికా ప్రచురించదు.
ఆ తరువాత అద్దాల మేడ నుంచి బయటకొచ్చి దొరతనం వదిలి సామాన్యులతో కలిసి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకొని ఆ ఊరి ప్రజల కథ రాస్తుంది. ఆ కథ ప్రచురితం కావడంతో ఆమె కోరుకున్న సొంత గుర్తింపు వస్తుంది.
ఆ ఊరి రాముల వారి గుడిలోకి దళితులకు ప్రవేశం లేదని చెప్పడంతో ఒక దళిత వృద్ధుడు ఆ రాముల వారి విగ్రహాన్ని ఆ గుడి బయట చెక్కుతూ ఉంటాడు. ఎప్పుడైతే స్కైలాబ్ పడి ఊరు నాశనమవుతుందని వార్తలు వస్తుంటాయో దళితులందరూ ఆ గుళ్లోకి వెళ్లి, ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటారు. అందుకు గుడి పూజారి ఒప్పుకోడు. వాదోపవాదనల తర్వాత తలుపులు తీస్తాడు.
స్కైలాబ్ పడుతుందని దొర బోరుబావిలో దిగి దాక్కుంటే.. పాలేర్లు ఆ దొర బట్టలు వేసుకొని, దొర బ్రాందీ తాగి, దొర మంచం మీద పడుకుంటారు.
ఇలా ఏదో ఒక ఉపద్రవం, ప్రమాదమో వస్తే తప్ప ఈ మనుషులు మధ్య గీసుకున్న కుల, మత, ప్రాంత విభేదాలు చెరగవేమో అన్న సూచన చేస్తూ దర్శకుడు చాలా హృద్యంగా కథ చెప్పారు.
విగ్రహం చెక్కిన దళితుడికి గుళ్లో ప్రవేశం లేదనే దయనీయమైన పరిస్థితిని చూపిస్తూ కథని ముగించడంలో మంచి ఎత్తుగడే ప్రదర్శించారు.
"పరిమళాల నెవడాపును?/ పైరగాలినెవడాపును?/ ఎవడాపును మానవతా/ రవి రుక్కును కవి వాక్కును" అని కవి సి.నారాయణ రెడ్డి అంటారు.
అలా మనుషుల మధ్య ఎన్ని భేదాలున్నా ఎప్పటికైనా అవి కలవాల్సిందే అనే సూచన కవి చేసినట్లే, ఈ 'స్కైల్యాబ్' సినిమా ద్వారా దర్శకుడు 'విశ్వక్' మనిషే ముఖ్యమనే వాదాన్ని చాలా వివేకంగా చాటిచెప్పాడు.

ఫొటో సోర్స్, Satyadev/facebook
ఎవరెలా చేశారంటే
నిత్యమీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ నటన చాలా సహజంగా ఉంటూ ఆ పాత్రల హావభావాలని అందంగా పలికించారు. తులసి కామెడీ, తనికెళ్ళ భరణి తాత ఎమోషన్, గ్రామ ప్రజలుగా ఇతర నటులు చాలా బాగా నటించారు.
మొదటి సినిమాతోనే సరికొత్త రియలిస్టిక్ సబ్జెక్టును ఎంచుకున్న దర్శకుడు విశ్వక్‌ను ప్రశంసించాల్సిందే.
కానీ, అనుకున్న సబ్జెక్ట్ స్కైలాబ్ గురించి అయితే, సినిమా మొదటి సీన్ లోనే స్కైలాబ్ ప్రస్తావన వచ్చినా, ఆ తర్వాత ఆ ఊసే లేకుండా ఫస్ట్ హాఫ్ మెత్తం నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో స్కైలాబ్ పడబోతోంది అని తెలిసినా జనాలు అంతగా భయపడినట్టు కనిపించకపోగా, స్లోగా సాగే నెరేషన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతున్నట్టనిపిస్తుంది.
ప్రశాంతి విహారి నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. కెమెరా, లైటింగ్ వర్క్ బాగుంది.
1979 నాటి కథ కాబట్టి, ఆ పల్లె వాతావరణాన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా చూపెట్టింది.
ఇవి కూడా చదవండి:
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- ‘ఫేస్‌బుక్ ప్రొటెక్ట్’ ఫీచర్: 5 క్లిక్‌లలో యాక్టివేట్ చేసుకోండిలా...
- విశాఖకు 200 కి.మీ దూరంలో జొవాద్ తుపాను, భారీ గాలులకు కొబ్బరిచెట్టు మీదపడి ఒకరు మృతి
- మాజీ సీఎం రోశయ్య ఇకలేరు
- ‘ప్రపంచంలో ఇంకా మంచి మనుషులు ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ’
- క్వాంటం కంప్యూటర్: ఈ టెక్నాలజీలో అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలతో ఇండియా ఎందుకు పోటీ పడుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
- ‘ఒకడు ప్రకృతి.. మరొకడు ప్రళయం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














