కేసీఆర్: నేడు దిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయానికి భూమి పూజ - ప్రెస్‌రివ్యూ

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

దేశ రాజధాని దిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం చేసుకోనున్న దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ నేడు నూతన అధ్యాయానికి తెరలేపనుందని సాక్షి తెలిపింది.

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం దిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్యాలయం కోసం దిల్లీ వసంత్‌ విహార్‌లో కేంద్రప్రభుత్వం లీజు ప్రాతిపదికన 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది.

మధ్యాహ్నం 1:48 గంటలకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం 5:45 గంటలకు సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా దిల్లీ చేరుకున్నారు.

సీఎం వెంట వచ్చిన వారిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు దిల్లీ వచ్చారు’’అని సాక్షి తెలిపింది.

వంట గ్యాస్

ఫొటో సోర్స్, Getty Images

ఎల్‌పీజీ: 15 రోజుల్లోనే వంట గ్యాస్‌పై మరో రూ.25 పెంపు

15 రోజుల వ్యవధిలోనే వంట గ్యాస్‌ ధర మళ్లీ పెరిగిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండరు ధరను తాజాగా కేంద్రం రూ.25 పెంచింది. ఈ పెంపు బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.

ఈ క్రమంలో 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.937కు చేరింది. గత నెల 17న గ్యాస్‌ బండపై రూ.25 పెంచిన కేంద్రం.. పక్షం రోజుల్లోనే మళ్లీ మరో రూ.25 పెంచటం విమర్శలకు తావిస్తోంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని మాత్రం సుమారు ఏడాదిగా పెంచటం లేదు.

వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధరను గత నెలలో రూ.5 మేర తగ్గించిన చమురు సంస్థలు.. తాజాగా బుధవారం నుంచి రూ.74 పెంచాయి.

తెలంగాణలో 1.10 కోట్ల గృహావసరాల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి నెలా సుమారు 60 శాతం సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. ఈ ప్రకారం.. గ్యాస్‌బండపై ఒకసారి రూ.25 వడ్డిస్తే ప్రజలపై పడే భారం రూ.16.50 కోట్ల వరకూ ఉంటోంది.

రాష్ట్రం అంతటా సిలిండర్‌ ధర ఒకేలా ఉండదు. దూరాన్ని పరిగణనలోకి తీసుకుని రవాణా ఛార్జీలను జోడించి చమురు సంస్థలు దాన్ని నిర్ణయిస్తాయి’’అని ఈనాగు తెలిపింది.

నదీ జలాల వివాదం

కృష్టా బోర్డు సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్

‘‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాడీవేడిగా జరిగింది. శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తే ప్రధానంగా చర్చలు జరిగాయి’’అని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి ప్రధాన కారణమైన శ్రీశైలం జలవిద్యుదుత్పత్తిపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జలవిద్యుదుత్పత్తిని ఆపేయాలని కృష్ణా బోర్డు(కేఆర్‌ఎంబీ) స్పష్టం చేయగా.. తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం నుంచి వాకౌట్‌ చేసింది.

కృష్ణా జలాలపై చర్చించడానికి గాను బుధవారం జలసౌధలో బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వాడీవేడిగా ఈ సమావేశం జరిగింది. శ్రీశైలంలో జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వీల్లేదని ఏపీ పట్టుబట్టగా.. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారమే ఉత్పత్తి చేస్తున్నామని, నాగార్జునసాగర్‌ పరిధిలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికే విద్యుదుత్పత్తి చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది.

శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తితో 100 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని, దీనికి తెలంగాణే కారణమని ఏపీ వాదించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారమే చేస్తున్నామని తెలంగాణ బదులిచ్చింది.

ఈ క్రమంలో శ్రీశైలంలో తాము అనుమతిచ్చేదాకా విద్యుదుత్పత్తి చేయడానికి వీల్లేదని, వెంటనే నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాకౌట్‌ చేసింది.

సమావేశంలో ఏపీ, కేఆర్‌ఎంబీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన రజత్‌కుమార్‌.. ఉమ్మడి బోర్డు సమావేశం ముగిసే క్రమంలో కూడా జలవిద్యుత్తుపై అనవసర వాదనలు లేవనెత్తినా, పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇకపై బోర్డుల సమావేశానికి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

తిరుపతి

శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన కాయిన్లను తిరిగి భక్తులకే శ్రీవారి ధన ప్రసాదంగా ఇస్తోంది.

శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో 10 నుంచి 20 లక్షల రూపాయలు వరకు భక్తులు చిల్లర నాణేలు రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో.. టీటీడీ దగ్గర కాయిన్స్ నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి.

దీంతో టీటీడీ సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. కాయిన్స్‌ను నోట్ల రూపంలో మార్చుకునేందుకు శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరుతో 100 రూపాయి నాణేలను ప్రత్యేక కవర్లలో భక్తులకు అందజేస్తోంది.

భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో.. వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా అమ్ముతున్నారు. కవర్లో కాయిన్స్‌తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. వందరూపాయలు చెల్లించి ఆ ధనప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్ ప్రసాదం తీసుకోవచ్చు’’అని వెలుగు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)