ఆంధ్రప్రదేశ్: సాలూరులో లారీ పరిశ్రమ పూర్తిగా మూతబడి పోతుందా...క్లీనర్లుగా మారుతున్న ఓనర్లు చెబుతున్న వ్యథలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఒకప్పుడు సాలూరు అంటే లారీలు, లారీలంటే సాలూరు అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు కథ మారింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ తర్వాత రెండో అతి పెద్ద లారీ పరిశ్రమగా పేరున్న సాలూరులో ఇప్పుడు లారీ ఫర్ సేల్ ప్రకటనలు విరివిగా కనిపిస్తున్నాయి.
కొవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అనేక పరిశ్రమల్లో సాలూరు లారీ ఇండస్ట్రీ కూడా ఒకటిగా మారింది.
''నెలకి రెండు లారీల చొప్పున గత ఆరు నెలల్లో 12 లారీలను అమ్ముకున్నాను. ఇంకా నాకు 19 బండ్లున్నాయి. వాటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాను.'' అని గొర్లె మాధవరావు బీబీసీతో అన్నారు. ఆయన రాష్ట్ర లారీ ఓనర్ల సంఘం నాయకుడు.
కోవిడ్ లాక్‌డౌన్లు, అదే సమయంలో రోజు రోజుకు పెరుగుతున్న డీజీల్ ధరలు పరిశ్రమని దెబ్బతీశాయని మాధవ రావు అన్నారు.
ఇది ఒక్క మాధవ రావు కథ కాదు. సాలూరులో లారీ ఓనర్‌గా ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారు. అప్పులు చేసి లారీలు కొన్నవారు, వాటిని నడుపుకునే పరిస్థితి లేక, చేసిన అప్పులు తీర్చలేక అమ్ముకోవడమే మార్గమని భావిస్తున్నారు.
''గత ఏడాది కోవిడ్ కారణంగా అప్పు తీర్చలేక పోవడంతో వడ్డీ పెరిగింది. ఈ సెకండ్ వేవ్‌లో డీజీల్ ధరల పెంపుతో లారీ అమ్ముకుని డ్రైవరుగా మారాల్సి వచ్చింది. ఈ పని కూడా రోజూ దొరకడం లేదు'' అని శ్రీనివాసరావు అనే డ్రైవర్ కమ్ క్లీనర్ వ్యాఖ్యానించారు. గతంలో ఆయన ఓనర్ కమ్ డ్రైవర్‌గా ఉండేవారు.
ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలో రెండో అతి పెద్ద లారీ పరిశ్రమైన విజయనగరం జిల్లా సాలూరు లారీ యాజమానులు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
ఒక పక్క కొవిడ్, మరోవైపు పెరిగిన పెరిగిన ఇంధన ధరలు, తగ్గిన ఆదాయం, పెరగని కిరాయి కారణంగా ఏర్పడ్డ కష్టాల నుంచి బైట పడేందుకు కొందరు యజమానులు లారీలు అమ్ముకుని డ్రైవర్లుగా, క్లీనర్లుగా మారితే...మరికొందరు కోవిడ్ తర్వాత ఏదో ఒకటి చూసుకుందామనే ఆలోచనలో ఉన్నారు.

6 దశాబ్ధాల కిందట 12 లారీలు...
నేషనల్ హైవే 26 విజయ నగరం జిల్లా మీదుగా వెళ్తుంది. ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు సాలూరు సమీపంలో ఉంటుంది. దీంతో ముడిసరుకు,ఉత్పత్తుల రవాణాకు అవరమైన లారీల కొనడం ద్వారా వ్యాపారం చేయవచ్చునని అప్పటి స్థితిమంతులు కొందరు లారీలు కొనే ఆలోచన చేశారని, అలా ఇక్కడ లారీ పరిశ్రమ వృద్ధి చెందిందని చెబుతారు.
''1960 సమయంలో ఇక్కడ పెద్దగా ఉపాధి,వ్యాపార అవకాశాలు ఉండేవి కాదు. చాలా కుటుంబాలు వలస వెళ్లేవి. అదే సమయంలో ఇతర ప్రాంతాలు,రాష్ట్రాల నుంచి విజయనగరం,పార్వతీపురం రైల్వే స్టేషన్లకు ముడి సరకులు వచ్చేవి. వీటిని నాటు బండ్లపై గమ్య స్థానాలకు చేర్చేవారు. కానీ, దీనికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దాంతో లారీలను కొనడం ద్వారా వ్యాపారంతోపాటు స్థానికులకు ఉపాధి కూడా కల్పించవచ్చని ఆర్థిక స్థోమత ఉన్న కొన్ని కుటుంబాల వారు 12 లారీలను కొన్నారు. దీంతో స్థానికులకు డ్రైవర్లు,క్లీనర్లుగా ఉపాధి దొరికింది. అలా మొదలై..1963లో 30మందితో కలిసి సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పడింది." అని ఒకప్పటి ఓనర్, ప్రస్తుతం డ్రైవర్‌గా మారిన శ్రీనివాసరావు తన తండ్రి చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

లారీలు పోయి...అప్పులు మిగిలాయి...
సాలూరులో 2500 పైగా లారీలుంటాయి. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద లారీ పరిశ్రమగా సాలూరు అభివృద్ధి చెందింది. దీనిపై ఆధారపడి 15 వేల మంది జీవిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని ప్రధాన నగరాలతోపాటు, రాష్ట్రంలోని పలు నగరాలకు ఎగుమతులు,దిగుమతులకు ఇక్కడి లారీలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. లారీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడంతో, దాని అనుబంధ పరిశ్రమలు వచ్చాయి.
''బాడీల తయారీ, రంగులు వేయడం, రిపేర్ వర్క్స్, టైర్ల మార్పిడి వంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతాయి. సాలూరు నుంచి వచ్చామంటే...ఎన్ని లారీలున్నాయి అని అడిగేవారు. కానీ, ఇప్పుడు కరోనా దెబ్బకి...లారీలు పోయి..అప్పులు మిగిలాయి." అని శ్రీనివాస రావు చెప్పారు.
సాలూరులో శ్రీనివాస రావు లాగా ఇప్పటికి 10మంది లారీ యాజమాని స్థాయి నుంచి డ్రైవర్లు, క్లీనర్ల స్థాయికి పడి పోయారు. కొందరు ఏం చేయాలో తెలియక రోజూ యార్డ్ వద్దకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. పరిస్థితులు కుదుట పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

రూ. లక్షకు రూ.90 వేలు ఖర్చు
సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విశాఖలోని వివిధ పరిశ్రమలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలకు లారీలు నిత్యం ఇక్కడి నుంచి పరుగులు పెడుతుంటాయి.
రాయపూర్ నుంచి విశాఖకి ముడి ఇనుము (ఐరన్ ఓర్) లోడ్ తీసుకెళ్లాలంటే రూ. లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తారు. అయితే, ఇప్పుడు ఖర్చులకు కూడా మిగలడం లేదని లారీ యజమానులు అంటున్నారు.
''డ్రైవర్, క్లీనర్ భత్యాలు, జీతాలు, టోల్‌గేట్లు, ట్యాక్సులు, లారీ మెయింటెనెన్స్, లోడింగ్, అన్ లోడింగ్ వద్ద ఆలస్యం ఇలా అనేకం ఖర్చులతో కూడుకున్నవే. వీటన్నిటికి రూ. 90 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఫైనాన్స్ ఎలా కట్టాలి ? మిగులు ఎప్పుడు చూడాలి ? అందుకే లారీలను అమ్ముకుంటేనే ప్రశాంతంగా ఉందని 12 లారీలను అమ్ముకున్నా'' అని గొర్లె మాధవ రావు బీబీసీతో అన్నారు.
సెకండ్ వేవ్‌తో మూలిగే నక్క మీద తాడిపండు పడినట్లయిందని మాధవ రావు అన్నారు. నష్టాలు భరించ లేక ఇక్కడ ఉండే లారీలలో సగం యార్డులకే పరిమితమయ్యాయని ఆయన చెప్పారు.
క్లీనర్ టూ ఓనర్...ఓనర్ టూ క్లీనర్...
గతంలో సాలూరులో ఏ రోడ్డు చూసినా లారీలు రయ్ రయ్ మంటూ దూసుకుపోతూ కనిపించేవి. అదే సమయంలో లారీల నిర్మాణం కూడా సాలూరులో జోరుగా సాగేది. 2 వేల మంది ఓనర్ కమ్ డ్రైవర్లుగా ఉండేవారు. అయితే క్రమంగా వీరి సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం ఆరు వందలకు పడిపోయింది. మిగతా వారిలో కొందరు ఫీల్డ్‌ను వదిలేయగా...మరికొందరు డ్రైవర్లుగా మారిపోయారు.
''ఒకప్పుడు క్లీనర్‌గా, డ్రైవర్‌గా పని చేసి ఓనర్‌గా ఎదిగాను. కరోనా ప్రభావంతోపాటు, డీజిల్ ధర రోజు రోజుకు పెరుగుతూ మరింత భారమవుతోంది. నిర్వహణ, పన్నులు, బీమా ఇలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కోలారీకు నెలకు రూ.50 నుంచి రూ.60 వేల అదనపు భారం పడుతోంది. ఇవన్నీ భరించలేకే లారీ అమ్మేశాను. మళ్లీ డ్రైవరుగా పని చేసుకుంటున్నాను." అని సీతారామా రావు అనే డ్రైవర్ వెల్లడించారు.

యార్డులో లారీలు...ఇళ్లల్లో డ్రైవర్లు...
డ్రైవర్లు, క్లీనర్లు, కార్మికులు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకటి రెండు ట్రిప్పులు ఉన్నా...కోవిడ్ ఆంక్షల మధ్య వాటిని పూర్తి చేయడం కష్టంగా మారుతోంది.
మధ్యాహ్నం 12లోగా లోడింగ్, అన్ లోడింగ్ పూర్తి చేయాలి. సమయానికి వాహనాలు గమ్యానికి చేరుకోక పోతే అదనంగా కూలీల భారం పడుతోంది. ఇవన్నీ భరించలేకే లారీలు అమ్ముకుంటున్నామని యజమానులు చెబుతున్నారు.
''దాదాపు 11 వందలకు పైగా లారీలు యార్డులకు పరిమితమయ్యాయి. డ్రైవర్లు, క్లీనర్లు ఎక్కువ మంది పనిలేక ఇంట్లోనే ఉంటున్నారు. పెరిగిన ఖర్చులతో యజమానులు ఫైనాన్స్ కట్టడం కష్టమవుతోంది. సాధారణంగా ఏ లారీకైనా నెలకు రూ. 70 నుంచి రూ. 80 వేల ఫైనాన్స్ ఉంటుంది. కట్టకపోతే రోజువారీ వడ్డీలు వేస్తారు. దీంతో లారీలు అమ్ముకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.'' అని సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ కె. నారాయణ బీబీసీతో అన్నారు.

అమ్మడం తప్ప...కొనడం లేదు...
కరోనా ప్రారంభంతోనే లారీ పరిశ్రమకు కష్టాలు మొదలైయ్యాయి. గతంలో ఏటా కనీసం వంద కొత్త లారీలు వచ్చేవి. కానీ గతేడాదిగా సాలూరులో ఒక్క కొత్త లారీ కూడా కొనలేదు.
''గత ఏడాదిగా మూడు వందల పైగా లారీల అమ్మకాలు, వివిధ సంస్థలకు లీజులకు వెళ్లిపోయాయి'' అని సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు మహేశ్వరరావు బీబీసీతో అన్నారు.
ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గించాలని లేకపోతే లారీ పరిశ్రమలు మూతపడటం ఖాయమని సాలూరులోని లారీల యజమానులు అంటున్నారు.
నిబంధనల కారణంగా రోజుల తరబడి లోడుతో నిలపడంతో లారీల టైర్లు పేలిపోతుంటాయి. ఇది అదనపు ఖర్చని, పన్నులు కూడా ఎక్కువగానే ఉన్నాయని యజమానులు చెబుతున్నారు. విధి లేని పరిస్థితిలో లారీ అమ్ముకుందామంటే కొనేవారు కూడా లేరని కొందరు వాపోతున్నారు. ''లారీలను యార్డులలో పెట్టి మెయింటెనెన్స్ చేయాల్సి వస్తోంది. ఇది మళ్లీ అదనపు ఖర్చు.'' అని మహేశ్వర రావు వాపోయారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: వ్యాక్సీన్ తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక.. వ్యాక్సినేషన్‌కు ఇది సవాలుగా మారనుందా
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా.. ఇంతకీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది
- తిండి పెట్టకుండా తల్లిదండ్రులను చంపేసి కరోనా మరణంగా చూపారన్న ఆరోపణలతో దంపతుల అరెస్ట్
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్‌లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- వూహాన్ ల్యాబ్ లీక్ థియరీ: ‘కోవిడ్-19 సహజంగా పుట్టిందంటే నమ్మను..చైనాలో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి’
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








