ఈటల రాజేందర్ ఇప్పుడేం చేస్తారు... కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరతారా

ఫొటో సోర్స్, EatalaRajendar/facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనపై పెట్టిన కేసుల మీద హైదరాబాద్‌లో వాదనలు కొనసాగుతుంటే, మరోవైపు ఆయన తన నియోజకవర్గం పర్యటనలో తలమునకలై ఉన్నారు.
అదే సమయంలో కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులంతా ఏకమై ఈటలపై తీవ్ర విమర్శలు చేశారు. అటు ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీతో వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు?
ఈటల వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా హైకోర్టు జోక్యం, ప్రతిపక్షాల దూకుడు - ఈ రెండూ ఈటల ఉద్వాసన వ్యవహారాన్ని టీఆర్‌ఎస్ ఊహించుకున్న దానికంటే జఠిలంగా మారుస్తున్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈటల రాజేందర్‌పై కొందరు చేసిన ఫిర్యాదు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అత్యంత వేగ వంతమైన విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది.
విచారణకు ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులు ఇవ్వాలన్న సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు జమున హేచరీస్ పై ఎటవంటి మధ్యంతర చర్యలూ తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసును జూలై 6కి వాయిదా వేసింది. చట్ట ప్రకారం తగిన సమయం ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో ఈటల రాజేందర్ పై పెట్టిన కేసుల్లో ప్రభుత్వ వేగం కాస్త తగ్గొచ్చు. కానీ, టీఆర్‌ఎస్ తీసుకోబోయే రాజకీయ చర్యలకూ, దానిపై ఈటల స్పందనకూ ఈ కేసుతో సంబంధం లేదు.
ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా కరీంనగర్ నేతలను రంగంలోకి దింపింది. ఆ జిల్లాకు చెందిన పార్టీ పెద్ద నాయకులంతా తెలంగాణ భవన్‌లో విలేకర్ల సమావేశం పెట్టారు.
ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నేతలంతా ఆ వేదిక నుంచి ఈటల రాజేందర్ పై విమర్శలు గుప్పించారు.
సొంతూళ్ళో బీసీ, హైదరాబాద్ లో ఓసీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గంగుల కమలాకర్. కేసీఆర్ తమను బిడ్డల్లా చూసుకుంటున్నారనీ, పార్టీలో ముందు నుంచీ ఈటలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే వారనీ ఆయన అన్నారు.
ఈటలను పార్టీ నుంచి తొలగించాలంటూ వీరంతా కలసి పార్టీ అధిష్టానాన్ని కోరతారన్న వార్తలు కూడా తెలంగాణ భవన్‌లో వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు.
గతంలో నిజామాబాద్‌కి చెందిన డి.శ్రీనివాస్ విషయంలో ఆ జిల్లా నేతలు ఇలాంటి విజ్ఞప్తి చేశారు. అదే పద్ధతి ఈటల విషయంలో పాటిస్తారన్న వార్తలు వచ్చాయి.
అయితే, కరీంనగర్ నేతలు తమ సమావేశం తరవాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, EatalaRajendar/facebook
రాజేందర్ ఏం చేస్తున్నారు?
సోమవారం భారీ కార్ల కాన్వాయితో షామీర్ పేట ఇంటి నుంచి హుజూరాబాద్ వెళ్లిన ఆయన, అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తనకు మద్దతిచ్చే తెలంగాణ ఎన్ఆర్ఐలతో మంగళవారం ఆయన వీడియో సమావేశం కూడా నిర్వహించారు. ఆయన సమావేశాలు, ప్రసంగాలు అంతా తదుపరి అడుగుకు సన్నద్ధంగా కనిపిస్తున్నాయి.
''నన్ను పిలిచి అడిగితే నేనే రాజీనామా ఇచ్చేవాణ్ణి. నేను ముఖ్యమంత్రి కావాలనుకోలేదు. కేసీఆర్ తరువాత ఆయన కుమారుడే సీఎం కావాలి అన్నాను. ప్రగతి భవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా ఉండదు. గతంలో ఓసారి ఇదే గంగుల కమలాకర్ 'ఇంత అహంకారమా?' అని కేసీఆర్ గురించి నాతో అన్నాడు'' అని రాజేందర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈటల రాజేందర్ పూర్తిగా నర్మగర్భంగా తప్ప, ఎక్కడా పూర్తి ఓపెన్‌గా మాట్లాడడం లేదు.

ఫొటో సోర్స్, EatalaRajendar/facebook
అంతా ఆత్మగౌరవం చుట్టే...
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం అనే పదం చుట్టూ తిరిగింది. ఇప్పుడూ అదే పదం తెర ముందుకు తెస్తున్నారు ఈటల. ''తెలంగాణలో మరో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభం అయింది.'' అన్నారాయన.
అయితే ఆ ఉద్యమం ఈటల సొంతంగా చేస్తారా? వేరే పార్టీలతో కలసి చేస్తారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ చేస్తారా? రాజీనామా చేస్తారా అన్నది ప్రశ్న.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత జరిగిన తరువాత కూడా ఈటల ఎక్కడా కేసీఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్రమైన దుందుడుకు స్వరం వినిపించలేదు.
తన చరిత్ర చెప్పుకోవడం, టీఆర్ఎస్ పరిణామాలను ఏకరువు పెట్టడం, పార్టీలో మారిన పద్ధతులు, మారుతున్న పరిణామాలను గుర్తు చేస్తూ, విమర్శిస్తూ మాట్లాడతున్నారు తప్ప ఘాటైన పదజాలం వాడలేదు.
ఈ పరిణామాల తర్వాత తాను వేయబోయే అడుగు ఏదైనా అది అంత సులభం కాదన్న విషయం ఆయనకు తెలుసు. అందుకే రాజీనామా విషయంలో ఆయన ఇంత వరకు ఏమీ మాట్లాడలేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి మీద యుద్ధమే ప్రకటించే ఉద్దేశం ఉంటే, అది రాజీనామాతోనే మొదలవుతుంది.
ఈ క్రమంలోనే ఆయన తన నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల పల్స్ తెలుసుకుంటున్నారని కొందరు స్థానిక విలేకర్లు చెబుతున్నారు.
హుజూర్ నగర్‌లో ఈటల ఎక్కడకు వెళ్లినా 'సీఎం సీఎం' అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఆయనకు అనుకూలంగా పోస్టర్లు, పాటలూ వస్తున్నాయి.
''తాను ఏం చేయాలనుకున్నా, ముందు ఆయనలో ఉన్న మొహమాటాలను వదిలి పెట్టాలి. ఒకవేళ దూకుడుగా వెళ్లే ఉద్దేశం ఉంటే, ఆత్మగౌరవ పోరాటం లాంటిదేదో ప్రారంభించాలి. అంతే తప్ప ఇలాంటి మాటలతో ప్రయోజనం ఉండదు.'' అని సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్ వార్తలు కవర్ చేస్తున్న ఓ విలేకరి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, EatalaRajendar/facebook
టీఆర్ఎస్ వ్యూహమేంటి?
మరి ఈటలను గమనిస్తున్న టీఆర్ఎస్ ఏం చేయబోతోంది ? ఆయనను ఇరుకున పెట్టే అస్త్రాలు ఎన్ని ఉన్నాయి...అనేది ఇప్పుడు కీలకమైన అంశం.
ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఎవరి విషయంలోనూ ఆ పార్టీకి ఇంత ఇబ్బంది ఎదురు కాలేదు. ఒకవేళ కొందరు తిరగబడ్డా, వారు ఈటల స్థాయి హోదా, పదవీ అనుభవించిన వారు కాదు.
''భూకబ్జా అన్నది వంక మాత్రమేనని అందరికీ తెలుసు. నిజంగా ఇదే కారణం అయితే తీసేయాల్సిన మంత్రులు ,శాసన సభ్యులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తన సొంతమని కేసీఆర్ అనుకుంటున్న వేళ, అందులో మా వాటా కూడా ఉందని ఈటల అన్నారు.
పైగా ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలు తనకు కూడా ఉన్నాయని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అందుకే ఇది జరిగింది'' అని సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవిందర్ బీబీసీతో అన్నారు.
''రాజయ్య, కడియం శ్రీహరి, కొండ మురళి, స్వామి గౌడ్, ఆలె నరేంద్ర, తుమ్మల, డి .శ్రీనివాస్ లను సులువుగా వెళ్లగొట్టిన చతురత కేసీఆర్‌ది అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి'' అన్నారు రవిందర్.
మరి ఈటల కూడా ఇలా పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపేసిన జాబితాలో చేరతారా? అని తెలంగాణలో ఇప్పుడు అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఫొటో సోర్స్, EatalaRajendar/facebook
టీఆర్ఎస్ ఆలస్యానికి కారణం?
కేసీఆర్-ఈటల మధ్య పెనవేసుకున్న లావాదేవీలు మిగిలిన నాయకులందరి కంటే ఎక్కువని తెలంగాణ భవన్‌లో చెబుతారు.
'నమస్తే తెలంగాణ' పత్రిక పెట్టే సమయంలో తన భూమి తాకట్టు పెట్టి మరీ సాయం చేసానని ఈటల స్వయంగా చెప్పారు. ఇలాంటివెన్నో వారి మధ్య జరిగాయని, అందుకే మిగిలిన వారిని బయటకు పంపినంత సులభంగా ఈటలను పంపడం కుదరలేదని అంటున్నారు.
ఇటు ఈటల రాజేందర్ కూడా బయటకు వెళ్లి, విమర్శలు చేసి, ఏదో ఒక పార్టీలో చేరడం అంత సులభంగా జరిగేది కాదన్న మాట కూడా వినిపిస్తోంది.
కేసీఆర్ అంటే గిట్టని, కేసీఆర్ కి గిట్టని చాలా మందితో కొంత కాలం నుంచి ఈటల టచ్‌లో ఉన్నప్పటికీ, ఆ సమాలోచనలు ఇంకా తేలలేదనే ప్రచారం కూడా నడుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ, సొంత పార్టీ అనే మూడు ఆప్షన్ల మధ్య, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వారు బలంగా వాదిస్తోన్న విపక్షాల ఐక్యత అనే సూత్రాల మధ్య రాజేందర్ కొత్త నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కేసీఆరే తన గురువు అని మొన్న కూడా ఈటల అన్నారు. మరి ఆ గురువు తననే ఉద్దేశించి ఆ మధ్య చెప్పినట్టుగా, ''కొత్త పార్టీ పెట్టి నిలబడడం చాలా కష్టం'' అన్న మాటలను పట్టించుకుంటారా? లేక ఇంకేదైనా కొత్త సమీకరణాలను తెర ముందుకు తెస్తారా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
- సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








