చంద్ర గీసిన ఆడపిల్ల ఒయ్యారం, ఆయన అక్షరం నయగారం: అభిప్రాయం

చంద్ర

ఫొటో సోర్స్, RAVI KISHORE

ఫొటో క్యాప్షన్, ఆర్టిస్ట్ చంద్ర
    • రచయిత, అన్వర్, ఆర్టిస్ట్
    • హోదా, బీబీసీ కోసం

వీలు చేసుకుని ఒకసారి విశాలాంధ్ర బుక్ హౌస్‌కి వెళ్ళండి. డాక్టర్ పరుచూరి రాజారామ్ గారి సిగ్మండ్ ఫ్రాయిడ్ "జీవితం- కృషి" పుస్తకం అడిగి బోల్దన్ని రీప్రోడక్షన్లకు అరిగిపోయిన ఆ కవర్ బొమ్మని మనసుకు తీసుకోండి.

అదో రకం అద్బుతం. ఆ ఫాం, అ రూపారూప అపురూప నైరూప్యం ఇంకెక్కడా కానరాదు.

ఆ తరువాత ఆ దగ్గర్లో ఎక్కడైనా యండమూరి నవల థ్రిల్లర్‌ని కనిపెట్టండి దాని పాత కవర్ డిజైన్‌లో ఒక పెద్ద చేప నోట్లో కూరుకు పోయిన విధ్యాధరిని బయటకు లాగుతున్న అనుదీప్ వుంటాడు.

డార్క్ మెరూన్ బ్యాక్ గ్రౌండ్ మీద పొడుగు చేతుల తెల్ల చొక్కాని ముంజేతులవరకు మడుచుకున్న ఆ మనిషి అనాటమి, ఆ చేతులపై వెంట్రుకల నూగు, వాడు వంగిన ఆ కాంపోజిషన్, ఆ టైటిల్... అదంతా కూడా ఒక మహాద్భుతం.

ఒక మధ్యాహ్నం బాగ్‌లింగంపల్లిలోని చంద్రగారి ఇంటికి నేనూ, ఆర్టిస్ట్ మోహన్ గారు వెళ్ళాం, నానా రచ్చ చేసి డబుల్ డమ్మీ సైజుల్లో వున్న, ప్రపంచం కంటబడని చంద్ర గారు వేసిన బొమ్మలు బయటకి లాగించాం.

రంగుపోసి రేఖ లాగిన బొమ్మలు. రేఖ గీసి రంగు నింపిన బొమ్మలు. చార్కోల్ చిత్రాలు, డ్రై పేస్టల్ పూసి గీసిన కవర్లు, హృదయాలను బద్దలు కొట్టడానికి నిండుగా గుండెలు పూనిన నగ్ననాయికలు, చిత్రాతి విచిత్ర కొలాజ్‌లు....

ఆ మాయాజాలపు చంద్ర లోకంలోంచి మౌనంగా బయటకు నడుస్తూ నేను" ఒక్క డజను సంవత్సరాలు దూరంగా ఎక్కడికయినా పారిపోయి బొమ్మలపై బొమ్మలు గీయాలనుంది, చంద్ర గారంత" అంటే, దానికి మోహన్ గారు" నాకూ అలాగే వుందబ్బా! అయితే నేను కొద్దిగా సీనియర్ని కాబట్టి అయిదేళ్ళు మాత్రమే పారిపోతా" అన్నాడు.

అయినా ఇద్దరి విషాదం తక్కెడలో వేస్తే సమానంగా తూగింది.

బాపుతో చంద్ర

ఫొటో సోర్స్, Anwar

ఫొటో క్యాప్షన్, బాపుతో చంద్ర

మీరు ఎప్పుడైనా రాంనగర్‌లో 'రచన' పత్రిక ఆఫీస్‌కు వెళ్ళారా? కార్యాలయం గోడపై సిసలైన చంద్ర మాత్రమే గీయగలిగిన ఆబ్‌స్ట్రాక్ట్ అద్భుతం ఒకటుంటుంది.

నిజానికి ఒకటి జరగాల్సింది కనీసం ముప్ఫై నలభయ్యేళ్లక్రితం లేదా ఇంకా ముందే అది జరిగుంటే, చంద్ర గారు కనుక బాపూని ఆవహించుకోడం ఆహ్వానించకపోతే. నావంటి వాడు, మీలాంటి వారు ప్రపంచం ఏ మూలకెళ్ళినా అయాం ఫ్రం ది లాండ్ ఆఫ్ చంద్ర అని గర్వంగా మనల్ని మనం పరిచయం మొదలుపెట్టుకోవాల్సినది.

అది బాపు బొమ్మల మాయా మోహమో? పాపులర్ ఆర్ట్ తెచ్చే పేరు జాలమో? అందులో కూరుకుపోయిన మనుషుల్లో ఒకరిగా చంద్ర కూడా ఇరుక్కుపోయారు. మరిక బయటకు రానంతగా ఆ ఇంకు జ్వాలల్లో తనను తానే దహించుకున్నారు.

అచ్చంగా, ఆత్మ సాక్షిగా చెప్పుకోవాలంటే మనకు తెలుగులో ఉన్న అద్భుత ఇలస్ట్రేటర్లు అయిదారుగురే అందులోనూ చంద్ర రేఖ, రంగు అత్యంత ప్రత్యేకం. ఏమబ్బా? ఆ వ్వెరి వ్వెరి స్పెషల్ అంటే ఆయన కుంచె గీత కాని, కలం రేఖ కానీ సాలిడ్ అన్నమాట. అంత బలమైన రేఖ చంద్ర గారిది.

చంద్ర గీసిన చిత్రం
ఫొటో క్యాప్షన్, చంద్ర వేసిన చిత్రం

ఆ కుంచె లాగిన రేఖ ఇంకులో ముంచినట్లుగా ఉండదు, తారులో ముంచి చిక్కని తీగ లాగిన రీతిన ఉంటుంది.

ఆయన లైన్. ఆ చిక్కని నలుపు గీతల్లో దిద్దుకున్న ఇలస్ట్రేషన్ లోని ఆ అబ్బాయిలు, ఆ అమ్మయిలు వారి పూల పూల చీరలు. పొడవాటి ఆ చేతి వేళ్ళు, ఆకాశాన బారులు బారులుగా పక్షులు, ముక్కలైపోయిన హృదయం నుంచి రాలిపోతున్న మరిన్ని హృదయాలుగా కవిత్వం బొమ్మలు, చివరికి సులువుగా గీసి పడేస్తారనుకునే కార్టూన్ బొమ్మల్లో కూడా కవ్వించి, లవ్వించి నిండా ముంచేసే అమ్మాయిల బొమ్మాయిలు.

ఆ బొమ్మాయిల ముక్కులకు ఉరి తగిలించుకుని ఆ అమ్మాయిల కళ్ళల్లోకి ములిగి చనిపోదామనుకున్న అబ్బాయిలు... ఒకటా! వెయ్యా! "ఏమని పొగడుదుమే యికనిను ఆమని సొబగుల... అని అన్నమయ్య అంతగా పాట కట్టింది చంద్ర బొమ్మ మాయలో పడిపోయే.

అంతేనా వాత్సాయనుడు కూడా సూత్రాలుగా దిద్దలేకపోయిన భంగిమల్ని చంద్ర కుంచె కనిపెట్టింది. తెలుగు అనాటమిని మర్యాదగా చీర వలిచి పాఠకులకు విందు ఆరబోసింది.

ఆర్టిస్ట్ చంద్ర

ఫొటో సోర్స్, Anwar

ఫొటో క్యాప్షన్, ఆర్టిస్ట్ చంద్ర

డిటెక్టివ్ నారద సినిమా సంపాదించండి. ఫోటో స్టూడియో సెట్‌లో గోడలమీద నిండి వున్న లైఫ్ సైజ్ చంద్ర బొమ్మల కోసం పాజ్ చెయ్యండి. పేము కుర్చీ బెత్తాల మధ్య లోంచి కనబడుతున్న కాంపోజిషన్ విల్లుగా వంగి వున్న అమ్మాయిని వాటేసుకున్న పురుషుడు ఆ వేగానికి అదిరిపోయి బెదిరిపోయిన ఆ అమ్మాయి లేడి కన్నులు. తలుచుకుంటుంటే! దేవుడా కణ్ణు రెండు కణ్ణు అనే మళయాల పాటని తెలుగు మాటల్లో వింటున్నట్టుగానే ఉంటుంది.

మంచు పల్లకి సినిమాలో చిరంజీవి యాక్టింగ్ చేసినవన్నీ చంద్ర బొమ్మలే. భావయుక్తంగా బోల్డన్ని డ్రాయింగులు. తలుచుకున్న కొద్ది బోల్డంత బెంగలు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే బొమ్మల కాగితాలన్నీ మడత పెట్టేసి పాత కాగితాల జాబితాలో కలిపేసి తూకపు రూపాయిలకి అమ్మేసి ఉంటారు కదా!

చంద్ర గీసిన చిత్రం

36-24-36 గణితం పట్టిన కుంచె దిద్దిన గొడ మీద అందాలకి తెల్ల వెల్ల తగిలించి మనల్ని మనమే కాదు గోడనీ సంస్కారవంతం చేసే ఉంటాం, అవునా?

అయ్యో మళ్ళీ బెంగ. అది వట్టి గోడ కాదురా బాబు నిండా కళాకండ. నేలను కొనేవాడు ఉన్నాడు కానీ గోడని కొన్నబాపతులు ఎక్కడా? అంతేనా? మరి చంద్ర అక్షరాలు.

చంద్ర గీసిన ఆడపిల్ల నడుముకు ఎన్ని వయ్యారాలో అంతకన్నా మించి నయగారాలు పోయింది చంద్ర అక్షరం. తెలుగు అక్షరాన్ని ఇన్ని రకాలుగా వ్రాయవచ్చా అని కలిగ్రఫి శాస్త్రం కూడా అనుమానాస్పదం అయ్యేంతగా తెలుగు కథ, కవిత, కవర్ ల మీద కుప్పించి ఎగసిన కాంతి చంద్ర మునివేళ్ళ మీద మెరిసిన అక్షరంది.

చంద్ర వేసినచిత్రం
ఫొటో క్యాప్షన్, చంద్ర గీసిన ముఖ చిత్రం

ఆయన రంగులూ అంతే, తెరిప పడకుండా, అనగా తెలుగులో ప్యాచ్ పడకుండా అంటారే అలా రంగు దిద్దడం చంద్ర స్పెషాలిటి. కేమిల్ ట్రాన్స్‌పరెంట్ రంగుల్లో, బ్రిల్ రంగులు మేళవించి వాటికి కాస్త పోస్టర్ రంగులు కలిపి అటు పారదర్శకం కాక ఇటు ఒపెక్ కాకుండా పూసేవాడు. దానిని చూసేవాడు చిత్రకారుడు అయితే వాడి మతి ఎంత పోవాలో అంత మాత్రం పోయేట్టుగా చేసే వర్ణ సమ్మేళనం చంద్రది.

అటు ఆ అతి చక్కని అనాటమీని చూడాలా? ఆ పైన వ్రాసిన అక్షరాల పొందికని చూడాలా? ఈ బొమ్మ మీద పూసి ఆరేసిన లావణ్య కాంతిని చూడాలా? అదంతా కాదని చంద్ర చెప్పే సినిమాల, నాటకాల, సాహిత్యపు కబుర్లని వినాలా.

రెండు కన్నులు, రెండు చెవులు, ఒక హృదయం పట్టుకుని వెడితే సరిపోని మానవుడు అతను. చంద్ర అందరు కళాకారుల్లాంటి కళాకారుడు కాడు. అందరు మనుషుల్లాంటి మనిషి కాడు. ఈ రోజు ఒక అద్భుతమైన చిత్రకారుడు, ఒక అత్యద్భుతమైన మనిషి ఇద్దరూ సెలవని వెళ్ళిపోయారు.

ఈ తెలుగు భూమి మీద చిత్రకళ, సాహిత్యం అనే విషయాల మధ్య వసించిన ఆయన ఇక చాల్లే అనుకున్నారు. ఇక సెలవు అనుకున్నారు. ఆయన వాడిన కలాలు, కుంచెలు, కాగితాలని, మనల్ని వదిలేసి వెళ్ళి చంద్ర లోకం చేరారు.

ఈ కుంచెల్ని, కాగితాలని ఏం చేసుకోవాలో మనకు తెలీదు, తాము ఇకేం కావాలో పాపం వాటికీ తెలీదు. తెలుగు పత్రిక చిత్రకళ మరోసారి అనాధయ్యింది. తెలుగు బొమ్మల అమ్మాయి పూర్తిగా కన్ను మూసింది.

( అభిప్రాయం రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)