చిత్రకారుడు చంద్ర మృతి... సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, Anwar
చిత్రకారుడు చంద్ర బుధవారం రాత్రి మరణించారు. సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న ఆర్‌కే మదర్ థెరెసా రీహాబిలిటేషన్ సెంటర్‌లో మృతిచెందారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన చంద్ర చిత్రకళా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సుపరిచితుడైన చంద్ర మంచి కథా రచయిత కూడా.
ఆయన పలు సినిమాలకు ఆయన ఆర్ట్ డైరెక్టరుగా పనిచేశారు. బి.నరసింగరావు ద. ర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
చిత్రకళకు సంబంధించిన వ్యాసాలు, కవితలు కూడా రాసినరు చంద్ర కొద్దికాలం విరసంలో సభ్యుడిగా ఉన్నారు.
చంద్ర మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
'ఎందరో చిత్రకారులకు ఆయనే స్ఫూర్తి'
లక్ష్మణ్ ఏలె, చిత్రకారుడు
‘‘చంద్ర తమలాంటి ఆర్టిస్టులు ఎందరికో ఇనిస్పిరేషన్’’ అని అన్నారు చిత్రకారుడు ఏలె లక్ష్మణ్.
1990ల మొదట్లో తన తొలి చిత్ర పదర్శన భువనగిరిలో ఏర్పాటు చేసినప్పుడు చంద్ర, ఆర్టిస్ట్ మోహన్ వచ్చి ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు లక్ష్మణ్.
"చంద్ర ఒక అద్భుతమైన ఇలస్ట్రేటర్. ఆయన వేసిన ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగు సాహిత్యానికి అనుబంధంగా ఎప్పటికీ నిలిచిపోతాయి. తెలుగునాట బాపు తరువాత అంతటి ప్రభావం చూపిన మరొక గొప్ప ఆర్టిస్ట్ చంద్రగారు" అని అన్నారు.
‘కొండంత వాడు కుర్రకుంక సాయం అడగటేమిటి?అదే మరి చంద్ర అంటే’
సురేంద్ర, హిందూ కార్టూనిస్ట్
‘‘అరవై, డెబ్బై, ఎనభైల్లొ పత్రికలు కథలు,సీరియళ్లు,నవలలకు స్వర్ణయుగం. చంద్ర వీరవిహారం చేసిన సమయం.చంద్ర బొమ్మ కనపడని పత్రికలే ఉండేవి కాదు.
చంద్ర బొమ్మల గురించి కొత్తగా చెప్పల్సింది లేదు.చంద్ర గురించే చెప్పవలిసింది ఉంది.
నేను అప్పుడప్పుడే ఆంధ్రభూమిలొ వచ్చీ రాని కార్టూన్లు వేస్తున్నపుడు వారాసిగూడలో నా గదికి రాత్రి పదింటికి వచ్చి 'ఒరే నాయనా నువ్ నాకో సాయం చెయ్యాలిరా..వంశీ సినిమా జోకర్ లో రాజేంద్రప్రసాద్ గెటప్ ఒకటుంది అది నాకు వచ్చి చావడం లేదు,కొంచెం వేసిపెట్రా బాబ్బాబు" అన్నారు.
ఆయనకు రానిది నాకెలా వస్తుంది.కొండంత వాడు కుర్రకుంక సాయం అడగటేమిటి? అదే మరి చంద్ర అంటే! చంద్ర ఉంటాడు, కనిపించడంతే.’’

ఫొటో సోర్స్, ChandraBommalu/Facebook
‘చిత్రకళకు సంబంధించిన పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నన్ని ఇంకెక్కడా ఉండవేమో’
రాజు, కార్టూనిస్ట్
‘‘నేను బొమ్మలు నేర్చుకోవాలి అనుకున్నప్పటి ఏ తెలుగు మ్యాగజైన్ చూసినా చంద్ర గారి బొమ్మలే. అవే బొమ్మలు ప్రాక్టీస్ చేసేవాడిని. హైదరాబాద్ వచ్చిన తరువాత చంద్ర గారిని కలవటం ఆయనతో మాట్లాడటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. తరువాత కాలంలో ఆయన మా ఇంటికి రావటం, నేను ఆయనింటికి వెళ్లడం బొమ్మలు, కార్టూన్స్ గురించి మాట్లాడుతూ గంటలు గంటలు గడిచి పోయేవి.
ఆయన ఇంటిలో ఉన్న ఆర్ట్ బుక్స్ మరే ఆర్టిస్ట్ దగ్గరా ఉండేవికావేమో? ఆయన చూడటానికి కోపంగా ఉన్నట్టున్నా సన్నిహితంగా ఉన్న వారికే తెలుస్తుంది ఆయనెంత హ్యూమరిస్టో.
కొంతకాలం క్రితం సుమారు రెండేళ్ల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భాగ్ లింగంపల్లి టీ కాంటీన్లో ఆయనతో గడిపిన సమయం మరిచిపోలేనిది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం, ఇప్పుడు ఆయన చనిపోయారని వార్త తట్టుకోలేని విషయం. ఆయన లేని లోటు తెలుగు ఆర్టిస్ట్స్‌కి, వందలాది శిష్యులకు తీరని లోటు’’ అని ఆర్టిస్ట్, క్యారికేచరిస్ట్ రాజు అన్నారు.
'ఆ చంద్రహాసం ఇక లేదా...'
నర్సిం, కార్టూనిస్ట్
"చంద్రన్న" అని ఆప్యాయంగా గా పిలుచుకునే ఆ చంద్రహాం ఇక లేదని తెలిసి మనసంతా వికలమై పోయింది. కొన్నివేల బొమ్మలకు తనదైన శైలిలో ప్రాణప్రతిష్ట చేసిన ఆ బొమ్మల బ్రహ్మ, 70 ల నుంచి అర్ధ శతాబ్దం పాటు తెలుగు పాఠకలోకాన్ని తనవెంట తిప్పుకున్నాడు. బాపు తర్వాత, బాపు అంతటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇలస్ట్రేషన్స్, కార్టూన్స్, పెయింటింగ్స్, పోర్ట్రెయట్స్ వంటి అనేక ప్రక్రియల్లో బొమ్మలు గీసిన చంద్ర మంచి కథకుడు, కవి, యాక్టర్ కూడా.
సృజన కవర్ పేజీ మీద ఆయన వేసిన శ్రీశ్రీ లైన్ డ్రాయింగ్ ని నేను అప్పట్లో నా స్కూల్ బోర్డ్ మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి .ఆయన లైన్ ని సొంతం చేసుకుని ప్రాక్టీస్ చేసి ఎదిగిన ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








