'చెక్' సినిమా రివ్యూ: చంద్రశేఖర్ ఏలేటి, నితిన్ 'మైండ్ గేమ్'లో లాజిక్ మిస్సయిందా...

ఫొటో సోర్స్, FB/Bhavya Creations
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
ప్రతిసారీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చే చంద్రశేఖర్ ఏలేటి, సినిమాల కోసం తనను తాను ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ.. కష్టపడే తత్వం కనబరిచే నితిన్ కాంబినేషన్, జైలు సన్నివేశాలు, ఇద్దరు కథానాయికలు, ఆకట్టుకునే సంభాషణలతో ట్రైలర్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా "చెక్".
ఒక దీర్ఘకాలిక విరామం తరువాత చంద్రశేఖర్ ఏలేటి విజయం సాధించారా? అసలు సినిమా కథ ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు సమీక్షించుకుందాం.
ఆన్ లైన్ మోసాలు చేస్తూ బతికే ఆదిత్య(నితిన్)కు బాంబు పేలుడులో నలబై మంది చనిపోవడానికి కారణమైన ఉగ్రవాదుల్లో ఒకరని భావించిన కోర్టు ఉరిశిక్ష వేస్తుంది.
ఆ కేసు వాదించడానికి లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) ఒప్పుకుంటుంది. జైల్లో శ్రీమన్నారాయణ (సాయిచంద్) మాజీ చెస్ కోచ్ పరిచయంతో చదరంగం ఆటపై ఆదిత్య పట్టు సాధిస్తాడు.
అనాధగా పెరిగి, ఆన్ లైన్ మోసాలకు అలవాటు పడి, యాత్ర(ప్రియా ప్రకాష్ వారియర్)తో ప్రేమలో పడిన ఆదిత్యకు ఉగ్రవాదులకూ సంబంధం ఏమిటి?
చదరంగంలో స్టేట్ చాంపియన్ నుంచి విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడేవరకూ సన్నివేశాలు ఆకట్టుకున్నాయా? లాయర్ మానస తన క్లైంట్ నిర్దోషి అని నిరూపించడానికి ఏం చేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫొటో సోర్స్, FB/Bhavya Creations
ఆటలు నేపథ్యంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, శారీరక శ్రమతో ఉండే ఆటలలో కంటికి కనిపించే ఇంటెన్సిటీని మేధతో ఆడే ఆటతో తెరపై చూపించడం కష్టం.
అలాగే సన్నివేశాల వెనక ప్రేక్షకులను పరిగెత్తించే హంటింగ్ సినిమాలకు కథ కంటే కథనంపై గ్రిప్ చాలా అవసరం. లాజిక్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా పలికించగలగాలి.
అలా గతంలో హలీవుడ్ నుండి టాలీవుడ్ వరకువచ్చిన చాలా సాధారణమైన కథలే బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయనడానికి నిదర్శనాలు కోకొల్లలు.
దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తన మార్క్ కథను ఎంచుకున్నాడు అనడంలో సందేహం లేదు కానీ, దాన్ని కెమెరాలో బంధించేప్పుడు లాజిక్స్ మిస్సయ్యాడు అనడం వాస్తవం.
ఇక ఎమోషన్స్‌ని గట్టిగా అరవడం పదిమందిని చావ బాదడంలోనే చూపించాలనుకోవడం విషాదం.

ఫొటో సోర్స్, FB/Bhavya Creations
"కోర్టు ప్రాంగణంలో జడ్జి మనవరాలు, స్టేట్ చెస్ చాంపియన్ చెస్ ఆడుతూ, కూర్చోవడం మొదలు...వేట సినిమాలో చిరంజీవి శిష్యుడిలా మూడు నెలలు జైలు లోపల సొరంగం తవ్వడం.." లాంటి సన్నివేశాలు నేలవిడిచి సాముచేసినట్లుగా ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి.
ఇక అనాథగా ఉన్నప్పుడుగానీ, ప్రేమించిన అమ్మాయి దూరమైనప్పుడుగానీ, రాష్ట్రపతి క్షమాబిక్ష లభించనప్పుడుగానీ ఏ సంధర్భంలోనూ సన్నివేశంలో ఉండాల్సిన ఇన్ డెప్త్, పాత్రలలో పలికించాల్సిన భావోద్వేగాలు అస్సలు కనపడవు.
సినిమా మధ్యలో రెండు కామిక్&ఏమోషన్స్ కలగలిసిన పాత్రలు ఎందుకు కనపడతాయో, ఎందుకు ముగుస్తాయో అర్థం కాదు. చెస్ కోచ్ శ్రీమన్నారాయణ పాత్ర బ్యాక్ గ్రౌండ్ చెప్పేసుంటే ఆ పాత్ర ఉధృతి మరింత పెరిగేదేమో అనిపిస్తుంది.
ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు లాంటి సినిమాలలో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న చంద్రశేఖర్ ఏలేటి లాంటి దర్శకుడిని తక్కువ చేయడం కాదుగానీ, ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని సమపాళ్లలో మిక్స్ చేయలేకపోయారన్నది నిజం.
ఉరిశిక్ష పడిన ఖైదీ పాత్రలో, మధ్యలో మెరిసే లవర్ బాయ్ పాత్రలో నితిన్ ఆకట్టుకోగలిగాడు.

ఫొటో సోర్స్, FB/Bhavya Creations
నితిన్ తరువాత చెప్పుకోదగిన పాత్ర సాయిచంద్‌ది. ఖైదీగా, చెస్ కోచ్‌గా ఆయన అద్భుతంగా నటించారు.
రకుల్ మొదటిసారి అనుకుంటా... గ్లామర్, అందాల ప్రదర్శన లేని సాధారణ లాయర్ పాత్రలో కనపడింది. తన పరిధిలో బాగానే నటించింది.
ప్రియా ప్రకాష్ వారియర్ తెరపై కనిపించేది పదిహేను నిమిషాలే. కానీ కుర్రకారు గుండెలకు ఎక్కుపెట్టిన బాణం లాంటి ఆ పాత్ర, ఇలా మెరిసి అలా మాయమవుతుంది. సిమ్రన్ చౌదరి మైలేజీ ఉన్న ఆర్టిస్ట్‌లా కనపడింది.
ఇక ఇద్దరు జైలర్లు మురళీ శర్మ, సంపత్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేసారు. పోసానికి కామెడీ చేయడానికి స్కోప్ లేకపోయింది.
టెక్నికల్ విషయాల గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ్ పేరు మొదట ప్రస్తావించాలి. కెమెరా పనితనం మెప్పిస్తుంది. తరువాత ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ఇద్దరి గురించి మాట్లాడాలి. ప్రతి సన్నివేశం సెట్టింగే అని తెలిసినా, ప్రేక్షకులను ఆ వాతావరణంలోకి తీసుకెళ్లగలిగారు.
కథనంలో మిస్సయిన చాలా గ్రిప్స్ ఎడిటింగ్‌తో పూడ్చగలిగారు. కల్యాణ్ మాలిక్ మ్యూజిక్ బాగుంది. అయితే ఎక్కువ పాటలు లేవు. నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో ఇన్వాల్వ్ చేసేలా ఉంది.
చివరగా ఫైట్ మాస్టర్ తెలుగు సినిమాకు కావాల్సిన లాంగ్ జంప్, హై జంప్, గాలిలో పల్టీలు కొట్టడం లాంటివన్నీ బాగా చేయగలిగాడు.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








