పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: పార్టీ మారిన భార్యకు విడాకుల నోటీస్ పంపించిన ఎంపీ

ఫొటో సోర్స్, Bapi Banarjee
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
పశ్చిమబెంగాల్ ఎన్నికల రాజకీయాలు కుటుంబం సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి.
తన భార్య పార్టీ మారిందన్న ఆగ్రహంతో ఓ ఎంపీ ఏకంగా ఆమెకు విడాకులిస్తానని బెదిరించారు.
బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ తన భార్య సుజాతా మొండల్ ఖాన్‌కు విడాకుల నోటీసు పంపారు.
అంతకు ఒక రోజు ముందు ఆమె బీజేపీ ప్రత్యర్ధి, బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
మరికొద్ది నెలల్లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్యే నెలకొంది.
బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
తాను బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సోమవారంనాడు సుజాత మొండల్ ఖాన్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
పార్టీని వీడటానికి అనేక కారణాలను కూడా ఆమె చూపించారు.

ఫొటో సోర్స్, BAPI BANERJEE
బీజేపీపై ఆగ్రహంగా సుజాత
బీజేపీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని, అనేకమంది అవినీతిపరులైన ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని, పార్టీకి విధేయంగా ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
“బీజేపీ తృణమూల్ కాంగ్రెస్‌కు బి-టీమ్‌లాగా తయారైంది.
అలాంటప్పుడు నేను బి-టీమ్‌లో ఉండటంకన్నా ఎ-టీమ్‌లో చేరడం ఉత్తమం’’ అన్నారామె.
ఇది జరిగిన కొద్దిగంటల్లోనే సుజాతా మొండల్ ఖాన్ భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ హడావుడిగా మీడియా ప్రతినిధులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు.
తీవ్ర ఆవేశంలో ఉన్నట్లు కనిపించిన ఆయన, తన భార్యతో ఉన్న పదేళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు.
సుజాతా మొండల్ ఖాన్ తన పేరు చివరన ఉన్న ఖాన్‌ను తీసేయాలని ఆయన కోరారు.
“ఖాన్‌ను సర్‌నేమ్‌గా వాడటం, సౌమిత్రాఖాన్ భార్యగా చెప్పుకోవడం ఇక నుంచి ఆపండి.
మీరు మీ ఇష్టమైన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను’’ అని సౌమిత్రఖాన్ తన భార్యకు తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
తన కుటుంబాన్ని నాశనం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు.
“ టీఎంసీ నా భార్యను, ఆమెపట్ల నాకున్న ప్రేమను కూడా దొంగిలించింది’’ అని సౌమిత్రాఖాన్ వ్యాఖ్యానించారు.
“ఇలాంటి రాజకీయ డ్రామాను నేనెప్పుడూ చూడలేదు’’ అని కోల్‌కతాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు.
ఈ రాజకీయ విడాకుల వార్త టీవీలో సంచలనంగా మారింది.

ఫొటో సోర్స్, BAPI BANERJEE
మీడియాలో ఆరోపణల పర్వం
సోమవారంనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ జంట అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ఇందులో వ్యక్తిగత విషయాలతోపాటు, రాజకీయాల గురించి కూడా ఇద్దరూ మాట్లాడారు.
“ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఒక మంచి భార్య. ఆమె నా బలహీనత కూడా. నేను కొంచెం ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. మా వివాహ బంధానికి పదేళ్లు’’అని ఓ జర్నలిస్టుతో అన్నారు సౌమిత్రా ఖాన్.
గత ఏడాది ఎన్నికల్లో తన విజయంలో భార్య పాత్ర గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తనపై క్రిమినల్ కేసుల ఆరోపణలు రావడంతో కోర్టు తనను ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించిందని, ఆ సమయంలో సుజాత నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి తన విజయంలో కీలక పాత్ర పోషించారని సౌమిత్రా ఖాన్ అన్నారు.
“కానీ అదంతా గతం. ఆమెతో నాకు ఇప్పుడు ఎలాంటి అనుబంధం లేదు. ఆమె నాకిక లేరు’’ అన్నారు ఖాన్.
బీజేపీలో తనకు గౌరవం లేదన్న సుజాత మొండల్ వ్యాఖ్యలను మరొక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమిత్రాఖాన్ ఖండించారు.
“ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను తన సోదరి అన్నారు. అంతకన్నా ఏం కావాలి” అని ప్రశ్నించారు ఖాన్.
ఇటు సుజాత మొండల్ కూడా తన బాధలను మీడియా ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు.
గత 10 నెలలుగా తన భర్త తనను పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.
“ఆయనొక బిజీ పొలిటీషియన్. నన్ను పట్టించుకోవడానికి ఆయనకు సమయం కూడా దొరకదు. నేను తిన్నానా, పడుకున్నానా అన్నది కూడా చూడలేరు’’ అన్నారు సుజాత
‘ఆ పార్టీయే కారణం’
తన భర్తను తన నుంచి దూరం చేస్తున్నారంటూ ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు.
"మా వివాహ బంధాన్ని వాళ్లు చెడగొట్టారు'' అని ఆమె ఆరోపించారు.
“సౌమిత్ర నాకు విడాకులిచ్చేలా ప్రోత్సహిస్తున్న దుర్మార్గపు ఆలోచన ఎవరిది’’ అని కన్నీళ్లతో ప్రశ్నించారు.
భారత రాజకీయలలో పార్టీలు మారడం చాలా సర్వసాధారణ విషయం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సౌమిత్రా ఖాన్ పుట్టినప్పటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తేమీకారు.
కాంగ్రెస్ పార్టీతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2013లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండటం కూడా భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ధోరణి ఉంది. వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలా కనిపిస్తాయి.
బెంగాల్‌లో ఒకే కుటుంబం నుంచి వచ్చిన నేతలు వివిధ పార్టీల సిద్ధాంతాలను ఆచరిస్తున్న తీరును సుజాతా మొండల్ గుర్తు చేశారు.“వాళ్లనెవరూ విడిపోవడం లేదు కదా ’’ అన్నారామె.
“ ఇది బీజేపీ కుట్ర. నన్ను వదిలేయని వారే ఆయన్ను బలవంతం చేస్తున్నారు’’ అని సుజాత ఆరోపించారు.
“ నా దృష్టిలో రాజకీయాలు వేరు, కుటుంబం వేరు’’ అన్నారు సుజాత.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్‌లో జేపీ నడ్డాపై దాడి: మోదీ, మమతా ప్రభుత్వాల మధ్య ముదురుతున్న విభేదాలు
- సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను మహాత్మా గాంధీ ప్రధానిని చేశారు ఎందుకు?
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- పోర్న్‌హబ్: యూజర్లు అప్లోడ్ చేసిన వీడియోలను తొలగిస్తున్నామన్న అడల్ట్ వీడియో సైట్
- చైనా, మాల్దీవుల రుణ వివాదం: 'మా తాతల ఆస్తులు అమ్మినా మీ అప్పు తీర్చలేం'
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








