సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడం ఎలా?

- రచయిత, విన్సెంట్ నీ, యాస్టింగ్ వాంగ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్స్
అది అక్టోబర్ నెల. చైనా రాజధాని బీజింగ్‌లో ఓ సోమవారంనాటి బిజీ మధ్యాహ్నం సమయం. మెరుస్తున్న దుస్తులు ధరించిన కొందరు నగరంలోని హ్యాపినెస్ ఎవెన్యూ(ఇది ఒక ప్రాంతం పేరు) దగ్గర నిలబడి ఉన్నారు.
వారు నెమ్మదిగా రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్ మీద అడుగులేస్తున్నారు. కొందరు కొద్దిగా వంగి నడుస్తుంటే, ఇంకొందరు తలలు పూర్తిగా దించి నడుస్తున్నారు. అక్కడున్న కొందరు ఈ దృశ్యాలను ఫొటోలు తీస్తున్నారు.
బీజింగ్ నగరంలో సీసీటీవీ కెమెరాలను తప్పించుకుని వెళ్లడం ఎంత కష్టమో చెప్పేందుకు డెంగ్ యూఫెంగ్ అనే ఆర్టిస్టు ఓ ప్రయోగం ద్వారా నిరూపించడానికి ప్రయత్నించారు.
ప్రభుత్వాలు, సంస్థలు భద్రత కోసం అధిక నిధులు వెచ్చిస్తుండటంతో 2021లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా కోట్ల కొద్దీ సీసీ కెమెరాలను అమర్చే అవకాశం కనిపిస్తోంది.
అందులో అధిక భాగం చైనాలోనే ఉంటాయని ఐహెచ్ఎస్ మార్కిట్ అనే సంస్థ అంచనా వేస్తోంది. 2018 నాటికి చైనాలో 20కోట్ల సీసీ కెమెరాలు ఉన్నట్లు తేలింది.
2021కి ఈ సంఖ్య 56 కోట్లు దాటొచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనా వేసింది. అంటే దాదాపు ప్రతి ఇద్దరికి ఒక కెమెరా చొప్పున ఉంటుందన్నమాట.
నేరాలను తగ్గించడానికి కెమెరా బాగా ఉపయోగపడుతున్నాయని చైనా అంటోంది.
2018లో ప్రపంచవ్యాప్తం జరిగిన హత్యల శాతాలను పరిశీలిస్తే చైనాలో అమెరికాకన్నా పదిరెట్లు తక్కువగా జరిగినట్లు యూఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వెల్లడించింది.
అయితే తమ ప్రైవసీ సంగతేంటని ప్రశ్నించేవారి సంఖ్య చైనాలో పెరుగుతోంది. తమ వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం కూడా ఉందని చాలామంది వాదిస్తున్నారు.

వాలంటీర్ల నియామకం
సీసీ కెమెరాలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేయడం చైనీయులకు బహుశా తొలి అనుభవం కావచ్చు. అంతేకాదు, అది కాస్త ప్రమాదకరమైన వ్యవహారం కూడా.
కానీ, డెంగ్‌లాంటి ఔత్సాహిక కళాకారులు దీన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రదర్శనకు ముందు హ్యాపినెస్ ఎవెన్యూ ప్రాంతాన్ని ఒక రూలర్‌తో కొలిచారు డెంగ్. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న 89 సీసీటీవీ కెమెరా స్తంభాలను, వాటి పరిధులను ఒక మ్యాప్‌లో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత కొందరు వాలంటీర్లను రంగంలోకి దించారు. కెమెరాకు చిక్కకుండా ఎలా నడవాలో సూచించారు. అయితే హ్యాపినెస్ ఎవెన్యూ ప్రాంతంలో 1.1 కి.మీ. నడకకు వారికి దాదాపు 2 గంటల సమయం పట్టింది.
ఈ నడక సాగుతున్న సమయంలో వారంతా తమ ముఖాలు కెమెరాల కంటబడకుండా ఉండేలా ప్రయత్నించారు. కానీ అది దాదాపు అసాధ్యమని డెంగ్ అన్నారు.
“నేను ఊహించిన దానికన్నా ఇది కష్టంగా ఉంది ’’ అన్నారు జోయెస్ జె అనే 19 ఏళ్ల మహిళా వాలంటీర్.
“ఇక్కడ కొన్ని కెమెరాలే ఉన్నాయి, వాటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చని అనుకున్నా. కానీ అస్సలు కుదరలేదు. ఎటు చూసినా కెమెరాలున్నాయి. తప్పించుకోవడం కష్టం’’ అన్నారు జోయెస్.

బ్లాక్ మార్కెట్‌లో డేటా
ఈ డిజిటల్ సెక్యూరిటీ వల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని నిరూపించడానికి చైనాలో గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి.
డెంగ్ వూహన్ నగరంలో బ్లాక్ మార్కెట్ నుంచి దాదాపు 3 లక్షలమంది ప్రజల డేటాను సంపాదించి, డేటా సేకరణ సాధ్యమేనని నిరూపించారు.
తాను సేకరించిన డేటాను ఓ మ్యూజియం ముందు ప్రదర్శనకు కూడా పెట్టారు. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు ఆ ప్రదర్శనను నిలిపేశారు.
ఈ ఏడాది ఆరంభంలో బీజింగ్‌కు వచ్చిన డెంగ్, ఇక్కడ ఎటు చూసిన సీసీ కెమెరాలు ఉండటాన్ని గమనించారు. నగరంలో ప్రతి అపార్ట్‌మెంట్‌కు కెమెరా ఉన్నట్లు ఆయనకు అర్ధమైంది.
“ఈ కెమెరాలు ప్రభుత్వ శక్తికి, అది ప్రజల వ్యక్తిగత జీవితంలోకి చొరబడే తీరుకు నిదర్శనంగా నిలుస్తాయి’’ అని డెంగ్ అన్నారు.
“చాలామంది కెమెరాలను అమర్చారు. నా దృష్టి అంతా వాటి మీదే ఉంటోంది. నాకు తెలియకుండానే వాటి గురించి ఆలోచిస్తున్నాను. వాటికి చిక్కకుండా తిరిగేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే నేనెవరికీ చెడు చేయడం లేదు. ఇది నాలో నాకు జరిగే సంఘర్షణ ’’ అన్నారు డెంగ్.

ఫొటో సోర్స్, Reuters
రోడ్లను డెంగ్ ఐదు రకాలుగా విభజించారు
- లెవెల్ 1 అస్సలు కెమెరాలు లేనివి
- లెవెల్ 3 ముందు, వెనకా కెమెరాలుండేవి
- లెవెల్ 5 అన్ని దిక్కులా కెమెరాలుండేవి.
“ఇక్కడొక ప్రైవేట్ కంపెనీ పక్కనే పెద్ద కార్ పార్కింగ్ ఉంది. అక్కడ ఏకంగా ఐదు కెమెరాలు ఒకే ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి. ఇక చుట్టూ తిరుగుతూ రికార్డు చేసే కెమెరాల సంగతి చెప్పాల్సిన పని లేదు. నేను కొన్నిసార్లు ఒక్కో ప్రాంతంలో కెమెరాలు ఎన్నిసార్లు తిరుగుతున్నాయో గమనించడానికి ఒకటి రెండు గంటలపాటు నిలబడి లెక్కించి చూశాను’’ అని చెప్పారు డెంగ్.

పోలీస్ కార్ల చాటు నుంచి....
కెమెరాల కనబడకుండా తప్పించుకోవడానికి వాలంటీర్లకు డెంగ్ ఒక ఉపాయం చెప్పారు. ఎదురుగా కెమెరా కనబడగానే వాళ్లను నేల మీద ఎండ్రకాయల్లా పాకుతూ పొమ్మన్నారు. ఎత్తుగా కెమెరాలు పెట్టినచోట, గోడలను ఆనుకుంటూ నడవమని సూచించారు.
ఇంకా పెద్ద కెమెరాలు ఏర్పాటు చేసినచోట రోడ్ల పక్కన ఉన్న మొక్కలు, ప్రకటన బోర్డులు, అక్కడే పార్క్ చేసిన పోలీస్ కార్ల చాటు నుంచి నడవాల్సిందిగా సూచించారు. కానీ ఇంత ప్లాన్ చేసి నడిచినా చివరకు హ్యాపినెస్ ఎవెన్యూ దగ్గరికి వచ్చేసరికి వారికి ఇబ్బంది ఎదురైంది.
“నేను ఓ రెండు వారాలపాటు ఇక్కడి రాలేదు అంతే. మళ్లీ వచ్చే సరికి మరో రెండు సీసీ కెమెరాలు కొత్తవి వచ్చాయి. అందుకే మా ప్లాన్‌ను కొంచెం కుదించాం’’ అని డెంగ్ అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కై నెట్‌వర్క్ ప్రణాళికలో భాగంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని చైనా మీడియా చెబుతోంది.
కార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఎకౌంట్లను ప్రొఫైల్స్‌ను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా చైనా పోలీసులు పోల్చి చూడగలుగుతున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత ఏడాది వెల్లడించింది.
నిరసనకారులు, ఉద్యమకారులను గుర్తించడానికి సీసీ కెమెరాలను ప్రభుత్వం విరివిగా వాడుకుంటోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
2018లో హాంకాంగ్‌లో పాప్ సింగర్ జాకీ చూయెంగ్ మ్యూజిక్ షో సందర్భంగా దాదాపు 60 నిందితులను చైనా అధికారులు అక్కడ ఏర్పాటు చేసి సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా గుర్తించారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కెమెరాలను ప్రజలంతా వ్యతిరేకించడం లేదు.ఈ ప్రయోగంలో పాల్గొన్నందుకు తన స్నేహితులు తనను తప్పుబట్టారని జోయెస్ జె వెల్లడించారు.
“ప్రజలు కొన్ని విషయాలలో తమ స్వేచ్ఛను ప్రభుత్వం చేతిలో పెట్టడంలో తప్పులేదని నా స్నేహితురాళ్లు అన్నారు. ఎందుకంటే మన భద్రత చూసేది వారేకదా అంటున్నారు.’’ అని వెల్లడించారామె.
ఈ ప్రయోగంలో పాల్గొన్న కాకా (అసలు పేరు కాదు) డేటా సెక్యురిటీ మీద ఆందోళన వ్యక్తం చేశారు. “ మన వివరాలు సేకరించి కొందరు మనల్ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగవచ్చు’’ అన్నారు కాకా.
ఈ ప్రయోగంలో పాల్గొనడానికి కాకా తన కుమార్తెను కూడా తీసుకువచ్చారు. “ఈ ప్రయోగం కాగానే మా అమ్మాయి నా దగ్గరకు వచ్చి అమ్మా..మనం కెమెరాల మీద విజయం సాధించాం అన్నది’’ అని తెలిపారు కాకా.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఛలో దిల్లీ: ఎలా వెళతారు? ఎక్కడ ధర్నా చేస్తారు?
- చైనా ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందా? వృథా చేయవద్దని జిన్‌పింగ్ ఎందుకంటున్నారు?
- Cyclone Nivar: తుపాన్లకు పేరెందుకు పెడతారు, ఎవరు నిర్ణయిస్తారు?
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: జో బైడెన్ టీమ్‌లో ఎవరెవరు...
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








