వైద్యం కోసం జనం జేబులు గుల్ల.. ప్రజలు దారిద్ర్యంలోకి జారిపోతున్నారు: పార్లమెంటరీ సంఘం నివేదిక - Press Review

పేదరికం

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్‌ మహమ్మారి భారత ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నింటినీ బయటపెట్టిందని.. ప్రజా వైద్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏమాత్రం సరిపోవడం లేదని పార్లమెంటరీ స్థాయీసంఘం ఆక్షేపించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 2020-21లో వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను బట్టి చూస్తే వైద్యం కోసం చేస్తున్న మొత్తం వ్యయంలో ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది కేవలం 27.1% మాత్రమే. ప్రజలు తమ జేబుల్లోంచి 62.4% ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనివల్ల మరింత మంది దారిద్య్రరేఖకు దిగువకు జారిపోతున్నారని స్థాయీ సంఘం పేర్కొంది.

సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ నేతృత్వంలోని వైద్య, ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి నివేదికను అందజేసింది. కోవిడ్‌ నేపథ్యంలో దేశ వైద్య ఆరోగ్య రంగంలో కనిపించిన బలాలు, బలహీనతలను విశ్లేషించి పలు సిఫారసులు చేసింది.

కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపించిందని, అది చివరకు మహమ్మారి నియంత్రణ చర్యలను సంక్లిష్టంగా మార్చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని మెరుగు పరచడానికి పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.

పేదలకు కోవిడ్‌ టీకాలను సబ్సిడీ ధరల్లో అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సమర్థమైన మానవ వనరులను పెంచుకోవాలంటే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఏఐఎస్‌) తరహాలో ఇండియన్‌ హెల్త్‌ సర్వీస్‌(ఐహెచ్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

కీలక సిఫారసులివే..

  • వైద్య పరిశోధనలపై భారత్‌ చేసే ఖర్చు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. ఇందుకోసం జీడీపీలో అమెరికా 2.84%, చైనా 2.19% ఖర్చు చేస్తుంటే భారత్‌ కేవలం 0.68% మాత్రమే వెచ్చిస్తోంది. ఈమేరకు వచ్చే రెండేళ్లలో చేసే ఖర్చును కనీసం ప్రపంచ సగటుకు సమానంగా 1.72%కి పెంచాలి.
  • పరిశోధనలను విస్తృతం చేయడానికి ఐసీఎంఆర్‌కి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి.
  • గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ అజెండా ప్రకారం ప్రతి 2 లక్షల మంది జనాభాకు ఒక సుశిక్షితుడైన అంటువ్యాధుల నిపుణుడు ఉండేలా చూడాలి.
  • ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'గా తీర్చిదిద్దాలి. టెలీ కన్సల్టేషన్‌కు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయాలి.
  • దేశంలో వైద్య పరికరాల తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచాలి.
  • కోవిడ్‌ పరీక్ష కేంద్రాలన్నీ జిల్లా కేంద్రాలు, పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు లేకపోవడం వల్ల అక్కడ కేసులను తక్కువచేసి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వైరల్‌ రీసెర్చి డయోగ్నస్టిక్‌ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలి.
  • కోవిడ్‌ను నియంత్రించడానికి 5టీ (ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌, టెక్నాలజీ) సూత్రం చాలా ప్రధానం. అందుకోసం తగిన ఆర్థిక, మానవ వనరులను సమకూర్చాలి.
  • కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నందున పోస్ట్‌ కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ మోడల్‌/ప్రొటోకాల్‌, ప్లాన్‌ను మరింత మెరుగుపరచాలి.
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ...

పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే, కర్ఫ్యూ ఎప్పటివరకు అనేది స్పష్టం చేయలేదు. రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సహా ఇండోర్‌, గ్వాలియర్‌, విదిశ, రత్లాం జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

మహారాష్ట్రలో ముంబై నగరంలో స్కూళ్లను డిసెంబరు 31 వరకు తెరవొద్దని నిర్ణయించారు. థానె, నవీ ముంబై, పన్వేల్‌లోనూ ఇదే నిర్ణయం అమలుకానుంది. మిగతా ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతిచ్చినా తప్పనిసరి కాదని ప్రకటించారు. ముంబైకి ఢిల్లీ నుంచి విమానాలు, రైళ్ల సర్వీసులు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

పరిస్థితిని బట్టి బడులు తెరవాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలని గుజరాత్‌, హరియాణ, మణిపూర్‌ ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలిచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లో సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌లు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు శుక్రవారం 10.66 లక్షల పరీక్షలతో కలిపి మొత్తం పరీక్షల సంఖ్య 13 కోట్లు దాటింది. దేశంలో కొత్తగా 46,232 మందికి పాజిటివ్‌ రాగా, 564 మంది మృతి చెందారు. 4.39 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 49,715 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది.

యాక్టివ్‌ కేసులు 5 లక్షల దిగువన ఉండటం ఇది వరుసగా 11వ రోజు.

దిల్లీలో కరోనాతో తాజాగా 118 మంది మృతిచెందారు. 6,608 మందికి వైరస్‌ సోకింది.

హరియాణ (3,104)లో తొలిసారి 3 వేల కేసులు వచ్చాయి.

రాజస్థాన్‌ (2,762)లో అత్యధిక పాజిటివ్‌లు నమోదయ్యాయి.

గుజరాత్‌ (1,420)లో సెప్టెంబరు 25 తర్వాత,

మధ్యప్రదేశ్‌ (1,528)లో అక్టోబరు 14 తర్వాత భారీ కేసులు వచ్చాయి.

కరోనాతో అస్వస్థతకు గురైన అసోం మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ (86) పరిస్థితి మరింత విషమించింది. గొగోయ్‌ 20 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్న 33 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు పాజిటివ్‌ వచ్చింది.

ప్రయాణికుల్లో కొందరికి పాజిటివ్‌ రావడంతో ఎయిరిండియా విమానాల రాకను హాంకాంగ్‌ ప్రభుత్వం డిసెంబరు 3వ తేదీ వరకు రద్దు చేసింది.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా?

భారత్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సెరో సర్వేల ద్వారా చాలామందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు స్పష్టమైందని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 60-70 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్‌-19 కారక వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇటీవలే కరోనా బారిన పడ్డవారు. కానీ హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు కలిగి ఉన్నారు.

దీంతో తరచూ కరోనా వైరస్‌ల బారిన పడుతుండటం (కరోనా వైరస్‌ కుటుంబంలో దాదాపు 32 రకాలు ఉన్నాయి. జలుబుకు కారణమైన వైరస్‌ కూడా ఇదే కుటుంబానికి చెందినది. కోవిడ్‌-19 వ్యాధిని కలుగజేసే కరోనా వైరస్‌ మనుషుల్లోకి ప్రవేశించడం వల్లే సమస్య తీవ్రంగా ఉంది) వల్ల వాటి కోసం ఉత్పత్తి అయిన యాంటీబాడీలతో వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుండవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు.

భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం.. ఇతర ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా ఉండటం సహజమేనని, అయితే దేశం మొత్తమ్మీద ఏం జరుగుతోందన్నదే ముఖ్యమని వారు అంటున్నారు.

కాంగోలో పేద పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ముంచుకొస్తున్న ఆకలి సంక్షోభం.. 20 దేశాల్లో కరువు పరిస్థితులు : ఐరాస

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆకలి సంక్షోభం తలెత్తే అవకాశముందని ఐక్యరాజ్యసమితికి చెందిన పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయని 'నవ తెలంగాణ' ఒక కథనంలో చెప్పింది.

ఆ కషథనం ప్రకారం.. అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత, కరోనా వంటి వరుస సంక్షోభాల వల్ల 20 దేశాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ దేశాల్లోని 25 కోట్ల మంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని ఐరాస ఏజెన్సీలు గుర్తించాయి.

యెమన్‌, ఆఫ్ఘానిస్తాన్‌, దక్షిణ సూడాన్‌, ఇథోపియా, నైజీరియా, కాంగో, బుర్కానా ఫాసో దేశాల్లో పరిస్థితులు తీవ్రతరమయ్యాయని, దాంతో ఐరాస మానవతా విభాగం ఆ దేశాలకు అత్యవసర సాయం కింద 100 మిలియన్‌ డాలర్లు (సుమారుగా రూ.742 కోట్లు) విడుదల చేసినట్టు ఐరాస తెలిపింది.

దీనిపై ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్‌ డేవిడ్‌ బీస్లే మాట్లాడుతూ.. ''ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బిలియన్‌ డాలర్లు నిధులు ఖర్చు చేయక తప్పదు. లేదంటే 2021 కల్లా అనేక దేశాల్లో కరువు తీవ్రరూపం దాల్చేట్టు ఉంది'' అని ఆందోళన వ్యక్తంచేశారు.

అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత అనేక దేశాల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ రావటం వల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో పేదరికంలోకి కూరుకుపోయి ఆహారం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఐరాస ఏజెన్సీలు గుర్తించాయి.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)