'చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధానికి మోదీ తేదీలు ఫిక్స్‌ చేశారు' - యూపీ బీజేపీ అధ్యక్షుడు :PressReview

స్వతంత్రదేవ్‌ సింగ్‌

ఫొటో సోర్స్, Swatantra Dev Singh/Twitter

పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని.. ఈ మేరకు తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు తదితర సమయాల్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే వేగంగా నిర్ణయాలు ఉంటాయని స్వతంత్రదేవ్‌ చెప్పుకొచ్చారు.

''రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న మాదిరిగానే పాకిస్థాన్‌, చైనాలతో ఎప్పుడు యుద్ధం జరుగుతుందో మోదీ నిర్ణయించారు'' అంటూ ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

భాజపా ఎమ్మెల్యే సంజయ్‌ యాదవ్‌ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వతంత్ర దేవ్‌ వెళ్లి ఈ వ్యాఖ్యలు చేయగా.. సంబంధిత వీడియోను ఆ ఎమ్మెల్యే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అంతే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నట్లు స్వతంత్రసింగ్ వీడియోలో పేర్కొన్నారు.

మరోవైపు సిక్కిం పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, శాంతిని స్థాపించాలని భారత్‌ కోరుకుంటోందని చెప్పారు. అలాగని అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు భారత్‌ సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దేవ్‌ సింగ్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కర్రల సమరంపై ఉత్కంఠ.. కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌

దసరా వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి కర్నూలు జిల్లా వైపే ఉంటుందని.. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం తలపిస్తుందని 'సాక్షి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఈ ఉత్సవంలో కర్రలతో ఒకరినొకరు బాదుకుంటూ ఆ ప్రాంతం రక్తసిక్తమవుతుంది. అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే, ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది.

అయితే కరోనా మహమ్మారి విజృంభణ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బన్నీ ఉత్సవాలను పోలీసులు నిషేదించారు. అయితే స్వామి వారి పూజా కార్యక్రమాలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా పండుగను కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టండి: ఉద్ధవ్ సవాల్

ఎవరికైనా దమ్ము, ధైర్యం ఉంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరినట్లు 'నమస్తే తెలంగాణ' ఒక వార్తను ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ప్రతి ఏటా దసరా సందర్భంగా శివసేన నిర్వహించే వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా పదవి చేపట్టి ఏడాది అయ్యిందని అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచి తమ ప్రభుత్వం పడిపోతుందని కొందరు పదే పదే చెబుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు.

'ఇప్పుడు నేను సవాల్ చేసి చెబుతున్నా.. మీకు దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించండి' అని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల వల్ల ఆలయాలను తెరిచేందుకు అనుమతించకపోవడంపై కొందరు మా హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. నా హిందుత్వ, బాలాసాహెబ్ హిందుత్వ వేరు అని అంటున్నారని ఉద్ధవ్ తెలిపారు. అయితే గంటలు, పాత్రలు మోగించడమే మీ హిందుత్వం అని, తమ హిందుత్వం అలాంటిది కాదని ఆయన స్పష్టం చేశారు.

చంద్రశేఖర్ ఆజాద్

భీమ్ ఆర్మీ చీఫ్ కాన్వాయ్‌పై కాల్పులు

భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ తన కాన్వాయ్‌పై ఇవాళ కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్పారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టడంతో ప్రత్యర్థి పార్టీలకు దడపుడుతోందని.. అందువల్లే ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ట్విటర్లో ఆరోపించారు.

''ఇవాళ జరిగిన ర్యాలీతో వాళ్ల గుండెల్లో దడపట్టుకుంది. అందుకే పిరికిపందల్లాగా నా కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడ్డారు...'' అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. వారు ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆజాద్ కన్వాయ్‌పై జరిగిన కాల్పులను జిల్లా సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ ఇంకా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబడుతున్నట్టు ఎస్ఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)