‘పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేశారు’: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్

కాళేశ్వరం ప్రాజెక్టు

ఫొటో సోర్స్, FB/KTRTRS

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాళేశ్వరం సాగునీటి పథకం నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండానే తెలంగాణ మొదలుపెట్టిందని నిర్ధారించింది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్.

కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే చాలా పనిచేసేశారనీ, ఇది నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించింది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు కట్టడం పూర్తయినందున, దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఏడుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఎన్జీటీ ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు రాకుండానే ప్రారంభించారంటూ ఎన్జీటీలో కేసు వేశారు సిద్ధిపేటకు చెందిన మహమ్మద్ హయత్ ఉద్దీన్ అనే వ్యక్తి. నిజానికి ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం 2017 జనవరిలో దరఖాస్తు చేయగా, 2017 డిసెంబరులో తీర్పు వచ్చింది. ఆలోపు, అంటే పర్యావరణ అనుమతులు వచ్చే వరకూ ఆగకుండా తెలంగాణ పనులు చేపట్టింది.

దీనిపై విచారించిన ఎన్జీటీ, ప్రభుత్వం పర్యావరణ ప్రభావం నివేదిక (ఈఐఏ)లో తప్పుడు వివరాలు ఇచ్చిందని వ్యాఖ్యానించింది. టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నిబంధనలు పాటించలేదనీ వ్యాఖ్యానించింది. అలాగే ఆ నివేదిక ప్రజలకు అందుబాటులో ఉంచలేదని గుర్తు చేసింది. కీలకమైన నిర్మాణాలకు పది కిలోమీటర్ల పరిధిలో రక్షిత ప్రాంతాలున్నాయన్న విషయాన్నీ దాచారని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఈసీ (పర్యావరణ అనుమతులు) లేనప్పుడు కేవలం, ఈసీ అవసరం లేని పనులే చేపట్టామనీ, ఈసీ వచ్చిన తరువాతే, ప్రధానమైన సాగునీటికి సంబంధించిన పనులు ప్రారంభించామనీ తెలంగాణ వాదించింది. కానీ ట్రిబ్యునల్ ఈ వాదనను కొట్టి పారేసింది. ఇది మొదట్లో సాగునీటి ప్రాజెక్టు కాదనీ, తరువాతే సాగునీటి ప్రాజెక్టుగా మార్చామన్న తెలంగాణ వాదనను కూడా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.

అదే సందర్భంలో ఇప్పటికే చాలా ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేశారన్న విషయాన్నీ అంగీకరించాలని ట్రిబ్యునల్ అంది.

ఇక ప్రాజెక్టు ప్రభావాన్ని పరిశీలించడానికీ, నెల రోజుల లోపు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక యాక్షన్ కమిటీని వేయాలని ఎన్జీటీ ఆదేశించింది. వారు ఆరు నెలల్లో పని పూర్తి చేయాలని చెప్పింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ బృందంలో లేని వారిని కమిటీలో ఉండేలా చూడాలని చెప్పింది.

కాళేశ్వరం ప్రాజెక్టు

ఫొటో సోర్స్, MEILTEAM.IN/FACEBOOK

పర్యావరణ అనుమతులు రాకుండానే కాళేశ్వరం నిర్మించడం వల్ల, పర్యావరణంపై పడే నష్టం, ప్రభావాన్ని అంచనా వేయడం ఆ కమిటి బాధ్యత. సహాయ, పునరావాస చర్యలు ఎంత చేశారన్నది కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ పనిని కేంద్ర అటవీ, పర్యావరణ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పర్యవేక్షిస్తారు. ఎవరైనా అభ్యంతరాలున్న వారు ఆ కార్యదర్శికి తమ వినతులు ఇచ్చుకోవచ్చు.

కాళేశ్వరంలో రోజుకు 2 టీఎంసీల బదులు 3 టీఎంసీల నీరు ఎత్తిపోసే విధంగా సామర్థ్యం పెంచినప్పటికీ, మౌలిక వసతులు పెంచనవసరం లేదనీ, దానివల్ల పర్యావరణంపై అదనపు ప్రభావం ఉండదన్న తెలంగాణ వాదనతో కూడా ఎన్జీటీ ఏకీభవించలేదు.

అటు కాళేశ్వరం డీపీఆర్‌ను గోదావరి నది నిర్వహణ బోర్డుకు ఇవ్వాలన్న కేంద్ర సూచనను కూడా తెలంగాణ పట్టించుకోలేదనీ, ఇలాంటి విషయాల్లో, కేంద్రం చెప్పిన సూచనలు పాటించాలనీ వ్యాఖ్యానించింది.

ఇలా జరగకుండా చూడాలి: ఎన్జీటీ

పర్యావరణ అనుమతులు రాకముందే తెలంగాణ కాళేశ్వరం మొదలుపెట్టిన విషయాన్ని ధృవీకరించిన ఎన్జీటీ, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. అవసరమైతే అనుమతులు ఇచ్చేప్పుడు భౌతికంగా వెళ్లి పరిశీలించాలని సూచించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANA CMO

ఇంతకీ ఇప్పుడు ఎవరికి నష్టం?

పర్యావరణ అనుమతులు రాకముందే నిర్మాణం మొదలుపెట్టారన్న విషయాన్ని ట్రిబ్యునల్ ధృవీకరించింది. దీంతో పాటూ పలు ఉల్లంఘనలను ఎత్తి చూపింది. అదే సందర్భంలో ప్రాజెక్టు కట్టేశారు కాబట్టి ఇప్పుడేం చేయగలమని అదే కోర్టు పిటిషన్ తరపు లాయర్‌ను ప్రశ్నించింది. ప్రభావం తగ్గించేలా చూడాలని ఆయన చెప్పారు.

దీనిపై స్పందించిన కోర్టు, ఈ యాక్షన్ కమిటీని వేసింది.

ఇప్పటికిప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన సమస్య లేదు. కాకపోతే ఆ యాక్షన్ కమిటీ బృందం పర్యటించి, పర్యావరణ రక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకోమనీ, సహాయ, పునరావసం మరిన్ని ఏర్పాట్లు చేయమనీ సూచించే అవకాశం ఉంది.

''2.10.2020 న ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర జలశక్తి శాఖ వారు పరిశీలించి ఒక నిర్ణయం వెలువరించాల్సి ఉంది. ఆ నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి అని తీర్పులో చెప్పారు. ఇంకా కేంద్ర నిర్ణయం రాలేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం పనులు కొనసాగించడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. అలాగే ఎన్జీటీ నియమించబోయే యాక్షన్ కమిటీ రావచ్చు. పర్యటించవచ్చు. ఇక్కడ అంతా బహిరంగమే'' అని బీబీసీతో అన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)