తుని వద్ద తాండవ నది రైల్వే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోందా? - BBC FactCheck

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహించే తాండవ నదిపై తుని- పాయకరావుపేట మధ్యలో రైల్వే వంతెన ఉంది.
2012 నవంబర్ 4వ తేదీన వచ్చిన వరదలతో సుమారు రెండు గంటల పాటు బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించింది.
రైల్వే ట్రాక్ పై వరద నీరు చేరడంతో అప్పట్లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.
ఆ తర్వాత బ్రిడ్జిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి నష్టం వాటిల్లలేదని నిర్ధరించుకుని మళ్లీ రాకపోకలు ప్రారంభించారు. అప్పట్లో 8 గంటల పాటు విశాఖ- విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం హఠాత్తుగా ఆ బ్రిడ్జిపై నీరు పారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వాట్సాప్ ద్వారా వైరల్ అయ్యాయి.
పాతవి అయిన ఈ దృశ్యాలను ఎన్టీవీలో తొలుత ప్రసారం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి టీవీ9, టీవీ5 వంటి తెలుగు చానెళ్లతో పాటుగా టైమ్స్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనూ ఈ వీడియో దర్శనమిచ్చింది. ఇక మిగిలిన అన్ని చానెళ్లు దాదాపుగా ఈ వార్తను ప్రసారం చేశాయి.

దీంతో రైల్వే అధికారులు స్పందించారు. తుని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘‘తాండవ వద్ద ఎటువంటి ప్రమాదం లేదు.. ప్రస్తుతం తాండవలో వరద ప్రవాహం కూడా లేదు. వరద నీరు లేనప్పుడు వంతెన పై నుంచి ప్రవహిస్తుందనే కథనాలు ఎవరూ విశ్వసించవద్దు. రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి’’ అని ఆయన వివరణ ఇచ్చారు.
తాండవ ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్‌తో బీబీసీ మాట్లాడింది. ఇటీవల కురిసిన వర్షాలతో తాండవలో నీటిమట్టం పెరిగింది. అయితే వరదల స్థాయిలో ప్రవాహం లేదు. దాంతో ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయలేదని ఆయన వివరించారు.

అయితే, సాయంత్రానికి వార్త మారింది. ఆ రైల్వే బ్రిడ్జి తాండవ వంతెనపై తుని వద్ద నిర్మించినది కాదని, రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అని కొందరు ప్రసారం చేశారు. ఏబీఎన్, వీ6 వంటి న్యూస్ చానెళ్లలో ఈ మేరకు కథనాలు వచ్చాయి.
వాస్తవానికి రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని ఇప్పటి వరకూ వరద తాకిన దాఖలాలు లేవు. ఆ స్థాయికి వరద వస్తే రాజమహేంద్రవరం నగరంలోని సగం ప్రాంతాలు జలమయమవుతాయి.
ఈ వంతెన నిర్మాణం తర్వాత అతి పెద్ద వరద 1986లో రాగా అప్పుడు కూడా బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించిన ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ తాండవ వంతెన పాత వీడియోను గోదావరి రైల్వే బ్రిడ్జి చూపిస్తూ కథనాలు వచ్చేశాయి.
టీవీ చానెళ్లు, వివిధ వెబ్ సైట్లు, యూ ట్యూబ్ కథనాలకు తోడుగా డెక్కన్ క్రానికల్ పత్రిక ఒక వార్తను కూడా ప్రచురించింది.
వాస్తవానికి తాండవ నదిపై తుని వద్ద ఉన్న రైల్వే వంతెనకు చాలా కిందినుంచి నీరు ప్రవహిస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.
ఇవి కూడా చదవండి:
- పొలంలో తిరుగుతూ మొక్కల్ని పరిశీలించే రోబోలను తయారు చేసిన గూగుల్
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- అంటువ్యాధులు, మహమ్మారి రోగాలు ఎలా అంతమవుతాయి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- హాంకాంగ్‌పై చట్టం చేసిన అమెరికా, చైనా కన్నెర్ర
- విప్లవ వధూవరుల విషాద ప్రేమ గాథ @ సిరియా జైలు
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- సిరియాలో కుర్దు సేనలకు అమెరికా వెన్నుపోటు పొడిచిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









