హాథ్‌రస్ కేసు: అత్యాచారం జరిగిందంటున్న రోజు ‘రాము’ ఎక్కడున్నారు

హాథ్‌రస్, Hathras

ఫొటో సోర్స్, Hindustan Times/getty images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి, హాథ్‌రస్ నుంచి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌‌లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న ఆరోపణలతో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. రాజకీయాలకు కూడా ఈ కేసు కేంద్ర బిందువుగా మారింది.

సెప్టెంబర్ 14న ఆ యువతిపై దాడి జరిగింది. మొదట హత్యాయత్నంగా నమోదైన ఈ కేసు, కొన్ని రోజుల తర్వాత బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో గ్యాంగ్ రేప్ కేసుగా మారింది. సెప్టెంబర్ 28న బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

అనంతరం యూపీ పోలీసులు ఆమెకు త్వరత్వరగా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇక ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేస్తోందని అన్నారు యూపీ పోలీసులు.

ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు ప్రచారం అవుతున్నాయి. బాధితురాలి కుటుంబం వైపు నుంచి, నిందితుల వైపు నుంచి వస్తున్న వాదనలపై.. పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అలాంటివాటిలో సమాధానం దొరకాల్సి ఉన్న కొన్ని ప్రధాన ప్రశ్నలు ఇవి...

హాథ్‌రస్, Hathras

1. ఘటన జరిగినప్పుడు బాధితురాలి తమ్ముడు ఎక్కడున్నారు?

ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు సందీప్. ఇటు బాధితురాలి తమ్ముడి పేరు కూడా సందీపే.

సోషల్ మీడియా, వార్తా ఛానెళ్లలో బాధిత యువతి మాట్లాడిన వీడియో ఒకటి బాగా ప్రచారమైంది. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని వారి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినప్పడు తీసిన వీడియో ఇది.

‘‘సందీప్ నా గొంతు నొక్కాడు’’ అని బాధితురాలు ఆ వీడియోలో చెప్పారు. ఎందుకు అలా చేశాడని ప్రశ్నించినప్పుడు... ‘‘బలవంతం చేస్తుంటే, నేను అంగీకరించలేదు’’ అని ఆమె అన్నారు.

అయితే, ఈ వీడియోలో బాధితురాలు సందీప్ అంటూ ప్రస్తావించింది తన తమ్ముడి గురించేనని కొందరు సందేహం వ్యక్తం చేశారు.

అయితే, బాధితురాలి తమ్ముడు సందీప్ బీబీసీతో మాట్లాడుతూ... ఘటన జరిగినప్పుడు తాను నోయిడాలో ఉన్నానని, ఆ తర్వాత రెండు వారాల పాటు ఆసుపత్రిలో తన అక్క వెంటే ఉన్నానని చెప్పారు. తమ ఊరికి తాను తిరిగివచ్చింది తన అక్క మృత దేహాన్ని తీసుకువచ్చినప్పుడేనని అన్నారు.

బాధితురాలు చెప్పింది తన తమ్ముడి పేరేనని ఆ గ్రామంలోని కొందరు కూడా అన్నారు. అయితే, ఘటన జరిగిన రోజు ఊరిలో ఆయన్ను చూసినట్లు మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.

ఇక ప్రధాన నిందితుడు సందీప్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

హాథ్‌రస్, Hathras

2. మొదటి ఎఫ్ఐఆర్‌లో అత్యాచారం సెక్షన్లు ఎందుకు లేవు?

బాధితురాలి అన్న మొదట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో అత్యాచారం జరిగినట్లు ప్రస్తావించలేదు. ప్రధాన నిందితుడు సందీప్ గొంతు నొక్కి, తన చెల్లెలిని చంపాలని ప్రయత్నించినట్లు మాత్రమే ఆరోపించారు. ఆ ఫిర్యాదు ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదైంది.

బాధితురాలి కుటుంబం మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అత్యాచారం గురించి ఎందుకు ప్రస్తావించలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితురాలి తల్లిని ఈ విషయం గురించి బీబీసీ ప్రశ్నించింది.

‘‘నా కూతురు అప్పుడు సరిగ్గా స్పృహలో లేదు. అందుకే మొత్తం విషయం చెప్పలేకపోయింది. స్పృహలోకి వచ్చాక జరిగిందంతా వివరించింది’’ అని ఆమె చెప్పారు.

జనాలు ఏమనుకుంటారోనని మొదట తాము భయపడ్డామని కూడా ఆమె అనధికారికంగా మాతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు.

తమ కూతురు జొన్న చేసులో స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు, ఆమె శరీరంపై దుస్తులు కూడా సరిగ్గా లేవని అన్నారు.

హాథ్‌రస్, Hathras

ఫొటో సోర్స్, PAWAN SHARMA/getty images

3. వెంటనే వైద్య పరీక్షలు ఎందుకు చేయలేదు?

అత్యాచార నిర్ధారణ కోసం బాధితురాలి నుంచి సెప్టెంబర్ 22న శాంపిల్స్ తీసుకున్నారు. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు అప్పుడే వెల్లడించారు. ఆగ్రాలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సెప్టెంబర్ 25న శాంపిల్స్ అందాయి.

బాధితురాలిని మొదటిసారి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినప్పుడే అత్యాచార కోణంలో పోలీసులు ఎందుకు విచారణ చేయలేదు?

ఈ విషయం గురించి అప్పుడు జిల్లా ఎస్పీగా ఉన్న విక్రాంత్ వీర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఆ తర్వాత బాధితురాలు స్పృహలోకి వచ్చి తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు చెప్పారు. దీంతో సెప్టెంబర్ 22న గ్యాంగ్ రేప్ సెక్షన్లు జోడించాం. వెంటనే నిందితులను అరెస్టు చేశాం. ఫిర్యాదు అందగానే నిబంధనల ప్రకారం పోలీసులు సరిగ్గానే వ్యవహించారు. నేరానికి సంబంధించి సాక్ష్యాలను సేకరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు’’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం విక్రాంత్‌ సస్పెన్షన్‌లో ఉన్నారు.

బాధితురాలు మొదట పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తనను బలవంతం చేసే ప్రయత్నం జరిగినట్లు కూడా ఆమె చెప్పారు.

మరి, పోలీసులు లైంగిక దాడి కోణంలో ఈ కేసును ఎందుకు చూడలేదు?

హాథ్‌రస్, Hathras

ఫొటో సోర్స్, PAWAN SHARMA/getty images

4. వైద్య, పోస్ట్‌మార్టం నివేదికలు ఎందుకు ఇవ్వలేదు?

పోలీసులు వైద్య నివేదిక గానీ, పోస్ట్‌మార్టం నివేదిక గానీ తమకు ఇవ్వలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఈ విషయం గురించి ఇదివరకు ప్రశ్నించినప్పుడు... ‘‘ఈ నివేదికలు ప్రస్తుతానికి రహస్యంగా ఉంచాల్సినవి. దర్యాప్తులో అవి భాగం’’ అని విక్రాంత్ చెప్పారు.

బాధితురాలికి సంబంధించి వైద్య, పోస్ట్‌మార్టం నివేదికలు పొందే అధికారం ఆమె కుటంబానికి ఉంది. అలాంటి పక్షంలో అవి వారి కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదన్నదానికి పోలీసుల నుంచి సరైన సమాధానం లేదు.

మరోవైపు అత్యాచారం జరిగినట్లుగా ఫోరెన్సిక్ సాక్ష్యాలు నిరూపించడం లేదని ఈ వైద్య నివేదిక ఆధారంగానే పోలీసులు వ్యాఖ్యానించారు. అయితే, ఈ నివేదికలో బలవంతంగా అంగప్రవేశం కోసం నిందితులు ప్రయత్నించినట్లు కూడా ఉంది. దీని గురించి మాత్రం పోలీసులు ప్రస్తావించలేదు.

ఈ విషయం గురించి ఎస్పీని ప్రశ్నించినప్పుడు... ‘‘విచారణ ఇంకా జరుగుతోంది. ఇప్పుడే పూర్తి ఘటనాక్రమాన్ని మేం చెప్పలేం’’ అని అన్నారు.

హాథ్‌రస్, Hathras

ఫొటో సోర్స్, Hindustan Times/getty images

5. బాధితురాలి శవాన్ని ఎందుకు దహనం చేశారు?

ఓవైపు పరిస్థితులు చేయి దాటేలా ఉండటం, మరోవైపు బాధితురాలి శవం పాడైపోకూడదన్న ఉద్దేశంతో అంత్యక్రియలు త్వరగా నిర్వహించినట్లు పోలీసులు, అధికారులు అంటున్నారు.

అయితే, పోలీసులు కావాలనే కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని, త్వరత్వరగా శవాన్ని దహనం చేయడానికి ఇదే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

శవాన్ని దహనం చేసి, పోలీసులు సాక్షాధారాలు లేకుండా చేశారని బాధితురాలి వదిన బీబీసీతో అన్నారు.

బాధితురాలికి అంత్యక్రియలు నిర్వహించడంతో ఇప్పుడు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది.

హాథ్‌రస్, Hathras

ఫొటో సోర్స్, Getty Images

6. ఆ రోజు రాము ఎక్కడున్నారు?

నిందితుల్లో ఒకరైన రాము ఘటన జరిగినప్పుడు డెయిరీ ఫామ్‌లో పనిచేస్తూ ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనికి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉంటాయని వారు అంటున్నారు.

అయితే, అలాంటి ఆధారాలేవీ వారు చూపించలేదు.

మరోవైపు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే రామును అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని, నిర్దోషులకు మాత్రం శిక్ష పడనివ్వమని అన్నారు.

ఇటు నేరంలో రాము పాత్ర ఉన్నట్లు బాధితురాలు చెప్పారని, ఆయనకు ఉరి శిక్ష పడాల్సిందేనని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

రాము పనిచేస్తున్న డెయిరీ ఫామ్ యజమాని ఆయన నిర్దోషి అని చెబుతున్నారు. అయితే, రాము డెయిరీ ఫామ్‌లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీని మాత్రం ఇంకా బయటపెట్టలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)