ఆనంద్ తేల్‌తుంబ్డే : జైలులో ఉన్న మేధావికి శుభాకాంక్షల వెల్లువ

ఫొటో సోర్స్, సిద్ధేశ్ గౌతమ్
ప్రముఖ విద్యావేత్త, మానవహక్కుల కార్యకర్త ఆనంద్ తేల్‌తుంబ్డే 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ఓ జైలులో ఉన్నారు.
తేల్‌తుంబ్డేను విడుదల చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నేపథ్యంలో బీబీసీ దిల్లీ ప్రతినిధి గీతాపాండే అందిస్తున్న కథనం.
"వాళ్లు నాకోసం వచ్చారు. కానీ నాతో మాట్లాడటానికి ఎవరూ లేరు''.. ప్రొఫెసర్ తేల్‌తుంబ్డే తన పుస్తకాలలో జర్మన్ లూథనరన్ పాస్టర్ మార్టిన్ నీమొల్లర్ చేసిన ఈ వ్యాఖ్యలను తరచూ ప్రస్తావిస్తుంటారు. చెడుతో తలపడుతున్నప్పుడు మౌనం మంచికాదని ఆయన అంటుంటారు.
గత 90 రోజులుగా ముంబయి జైలులో ఉన్న తేల్‌తుంబ్డే బుధవారం 70వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబీకులు, స్నేహితులు ఆయనకు మౌనంగా శుభాకాంక్షలు తెలపాలని కోరుకోవడం లేదు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద సంఖ్యలో ఉత్తరాలు, గ్రీటింగ్‌కార్డులు ఆయన ఉంటున్న తలోజా జైలుకు వెల్లువెత్తే అవకాశం ఉంది. "ఆనంద్ తేల్‌తుంబ్డే ఒక గౌరవనీయుడైన మేధావి. ఆయన్ను నిరాధార ఆరోపణలతో జైలుపాలు చేశారు'' అని న్యూజెర్సీలోని విలియం పీటర్సన్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బాలమురళి నటరాజన్ బీబీసీతో అన్నారు. తేల్‌తుంబ్డేకు లేఖ రాస్తున్న వారిలో ఆయన కూడా ఉన్నారు.
"మీ పుస్తకాలను చదువుతూ, మిమ్మల్ని నిత్యం గుర్తు చేసుకుంటున్నామని ఆయనకు చెప్పాలని మేం భావిస్తున్నాం'' అని నటరాజన్ అన్నారు.
ప్రొఫెసర్ తేల్‌తుంబ్డే 30 పుస్తకాలు రాశారు. అందులో ఎక్కువగా భారతదేశంలోని కుల వ్యవస్థను విమర్శిస్తూ ఎక్కువ పుస్తకాలు రచించారు.
దళిత కుటుంబంలో పుట్టిన తేల్‌తుంబ్డే, భారతదేశంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలలో ఉన్నత పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విద్యాబోధనవైపు మళ్లారు. ప్రస్తుతం గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో డేటా ప్రోగ్రామ్‌కు హెడ్‌గా పని చేస్తున్నారు.
ప్రభుత్వ విధానాలను తరచూ విమర్శించే తేల్‌తుంబ్డే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని హిట్లర్, ముస్సోలినీలకన్నా ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణిస్తారు. తన గురించి తాను అతిగా ఊహించుకునే వ్యక్తని మోదీని విమర్శిస్తారు.

ఫొటో సోర్స్, సిద్ధేశ్ గౌతమ్
ఏప్రిల్ 14న విచారణ సంస్థలు ఆయన్ను అరెస్టు చేయడంతో భీమాకోరెగావ్ కేసులో అరెస్టయిన పదిమందికి ఆయన తోడయ్యారు. వీరందరూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, బెయిల్‌కు వీలుకాని యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు.
2018 జనవరి 1 న మహారాష్ట్రలోని భీమాకోరెగావ్ గ్రామంలో జరిగిన దళిత ర్యాలీలో హింసకు కారకులుగా వీరిపై పోలీసులు అభియోగాలు మోపారు. అయితే హింస జరిగిన రోజు వీరు ఆ గ్రామంలో లేకపోయినా, వీరి ప్రసంగాల వల్లే ర్యాలీలో హింసాకాండ చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, దేశంలో అరాచకం సృష్టించే కుట్రలో వీరంతా నక్సలైట్లకు సహకరించారని అభియోగాలు మోపారు.
కానీ దేశవ్యాప్తంగా వీరి మద్దతుదారులు, ఉద్యమకారులు ఈ అరెస్టులను విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వీరిని జైలులో పెట్టారని ఆరోపించారు. "దళిత, గిరిజన, వెనకబడిన వర్గాల హక్కుల కోసం ఈ 11మంది పోరాటం జరిపారు'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. వీరందరినీ విడుదల చేయాలని ఆ సంస్థ గత కొద్దికాలంగా డిమాండ్ చేస్తోంది.
ఈ అరెస్టులు అక్రమమని, రాజకీయ ప్రేరేపితమని హ్యూమన్‌రైట్స్ వాచ్ ఆరోపించింది. భీమా కోరెగావ్ హింసాకాండలో హిందూ జాతీయవాదుల పాత్ర లేదా అని ఆ సంస్థ ప్రశ్నించింది.
మానవ హక్కులపై ఏర్పాటు చేసిన యూరోపియన్ యూనియన్ సబ్‌కమిటీ భారత హోం మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాసింది. మానవహక్కుల కార్యకర్తలను ప్రభుత్వాదికారులు హింసిస్తున్నారని, వేధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది.
కరోనావైరస్ ఉద్ధృతంగా ఉందని, జైలుపాలైన వారిలో చాలామంది ఆరోగ్యం బాగాలేదని, వారికి వైరస్‌సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకే వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో సబ్‌కమిటీ కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం ఆలోచనల పుట్ట అన్నారు ప్రొఫెసర్ నటరాజన్. భారతీయులు చర్చకు ప్రాధాన్యమిస్తారన్న నోబెల్ బహుమతిగ్రహీత అమర్త్యసేన్ మాటలను గుర్తుచేసిన నటరాజన్, గత ఎనిమిదేళ్లుగా దేశంలో చర్చ, వాదనలకు స్థానం లేకుండా పోయిందన్నారు.
దేశంలో కుల, మతతత్వాలు, గ్లోబలైజేషన్ అంశాల మీద ప్రొఫెసర్ తేల్‌తుంబ్డే గత 30 సంవత్సరాలుగా అనేకవాదనలను లేవదీశారని నటరాజన్ గుర్తు చేశారు.
"ఆయన కులతత్వాన్ని, హిందూ ఆధిక్యవాదాన్ని నిరసిస్తారు. సమాజంలో అత్యున్నత వర్గాల వారిని ఆయన ప్రశ్నించారు, మీరు పనుల వల్ల మెజారిటీ భారతీయలు ఇబ్బందుల్లో పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాదనలే ఆయన్ను ప్రమాదకారిని చేశాయి'' అన్నారు నటరాజన్.
రెండెళ్ల కిందట భీమా కోరెగావ్ కేసు నిందితుల జాబితాలో నా భర్త పేరును చూసి షాక్‌కు గురయ్యానని తేల్తుంబ్డే భార్య రమ అన్నారు. "ఇలాంటి పీడకల ఒకటి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు'' అని ముంబయిలో ఉంటున్న రమ ఫోన్‌లో నాతో అన్నారు.
"నా భర్త నేరస్తుడు కారు'' అని ఆమె ఉద్వేగభరితమైన స్వరంతో చెప్పారు. ''ఆయన కష్టపడి పని చేస్తారు. రోజుకు 14-15 గంటలు చదువుతూ, రాస్తూ, బోధిస్తూ సమయం గడుపుతారు'' అని రమ అన్నారు.
అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన పేదలకు, బలహీనవర్గాల వారికి సాయం చేస్తుంటారని రమ వివరించారు. "ఆయన్ను జైలుకు పంపించడం ద్వారా వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది'' అని ఆమె అన్నారు.
జైలులో ఉన్న తేల్తుంబ్డేతో వారానికి రెండు నిమిషాలసేపు మాట్లాడానికి ఆమెకు అవకాశం ఉంది. "ఫోన్ చేసినప్పుడల్లా ఆయన ఆరోగ్యం ఎలా ఉందో, అక్కడి ఆహారం ఎలా ఉందో అడుగుతాను. అక్కడ ఆహారం బాగుండదని నాకు తెలుసు. కానీ మమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక ఇక్కడంతా బాగుందని చెబుతారు, తన తల్లి, పిల్లల గురించి వాకబు చేస్తారు'' అని రమ తెలిపారు.
తేల్తుంబ్డే సతీమణి రమ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనుమరాలు. ఈ రోజుల్లో తన తాతకు సరైన గుర్తింపులేదని ఆమె అంటారు.
"తమ మనసులోని భావాలను చెప్పినందుకే అరెస్టు చేస్తారని మా తాతయ్య ఊహించి ఉండరు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్చ ఉన్న సమాజంలో మనం జీవిస్తున్నాం'' అన్నారామె.
దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని విమర్శకులు కూడా అభిప్రాయాపడుతున్నారు.
మోదీ విమర్శకులపై జాతీయవాదులుగా చెప్పుకుంటున్నవారు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే విద్యార్ధులు, ఉద్యమకారులను జైలుకు పంపుతున్నారు. వీరిలో చాలామందిపై బెయిల్‌కు వీలుకాని యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించిన అనేకమంది విద్యార్ధులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిందరూ జాతి వ్యతిరేకులని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా ప్రచారం చేసింది.
మహిళా ఉద్యమకారులను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.
ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో మూడు నెలల గర్భవతి అయిన సఫూరా జర్గార్ అనే మహిళను జైలు నుంచి విడుదల చేశారు.

"అక్రమ అరెస్టుల ద్వారా మానవ హక్కులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది'' అన్నారు తేల్తుంబ్డే న్యాయవాది మిహిర్ దేశాయ్. "నక్సలైట్లతో చేయికలిపారని, రిక్రూటింగ్‌కు సహకరిస్తున్నారని, వారి ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారనేది తేల్తుంబ్డే మీదున్న ప్రధాన అభియోగం'' అని మిహిర్ దేశాయి అన్నారు.
కానీ ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు వారికి ఆయుధాలుగానీ, డబ్బుగానీ దొరకలేదు.
వారు తమకు దొరికినట్లు చెబుతున్న ఒకేఒక్క ఆధారం నాలుగు లేఖలు. వాటిని మీడియా సమావేశంలో అందరికీ చూపించారు.
"అవి టైప్ చేసి ఉన్నాయి. సంతకాలు లేవు. అడ్రస్‌గానీ, ఈమెయిల్ అడ్రస్‌గానీ వాటి మీద లేవు'' అని దేశాయ్ అన్నారు.
"అవి తేల్తుంబ్డే రాసినవి కావు. ఆయనకు ఎవరో రాసినవి కూడా కావు. వాటి మీద ఉన్న ఒకే ఒక్క ఆధారం 'ఆనంద్' అన్న పేరు. ఆనంద్ భారతదేశంలో ఎవరైనా కావచ్చు'' అన్నారు దేశాయ్.
"ఈ లేఖ నిజమైనది కాదని, పుట్టించిందని అర్ధమైపోతోంది'' అని మిహిర్ దేశాయ్ స్పష్టం చేశారు. ఒకవేళ అవి నిజమే అయినా, ఆనంద్ అని రాసినంత మాత్రాన అవి ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే అని ఎలా అనుకుంటారు ? ఎవరో ఏదో రాయగానే అది ప్రూఫ్ అవుతుందా ? వాటిని సాక్ష్యాధారాలుగా భావించ వచ్చా'' అని మిహిర్ ప్రశ్నించారు.
సాక్ష్యాలు కోర్టులో నిలవకపోవచ్చు. కానీ విచారణే పెద్ద శిక్షలా ఉంటుందన్నారు మిహిర్ దేశాయ్. "విచారణ పేరుతో ఒక వ్యక్తిని పదేళ్లు జైలులో ఉంచితే, అతని జీవితం నాశనమైనట్లే'' అన్నారాయన.
ప్రస్తుతం జైల్లో మూడు నెలలు పూర్తి చేశారు తేల్‌తుంబ్డే. ఆయనకు బెయిల్ ఇవ్వాలని, విచారణ త్వరగా పూర్తి చేస్తే ఆయన నిర్దోషిగా తేలుతారని ఆయన భార్య రమ అంటున్నారు.
అరెస్టు కావడానికి ముందు రోజు తాను గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి అవమానాలను, వేధింపులను ఎదుర్కొన్నది బహిరంగ లేఖలో వెల్లడించారు తేల్తుంబ్డే. తన వికీపీడియా ఎకౌంట్‌ను చెడగొట్టారని, ఇజ్రాయెల్ స్పైవేర్ సాయంతో తన ఫోన్‌పై నిఘా పెట్టారని తేల్తుంబ్డే ఆరోపించారు.
"నా ఇండియా పతనమైపోతోంది. ఈ బాధాకర క్షణాల్లో నేను మీతో మాట్లాడుతున్నాను. మళ్లీ మీతో నేను ఎప్పటికైనా మాట్లాడగలనో లేదో తెలియదు'' అని తన లేఖలో పేర్కొన్నారాయన.
"మీ వంతు వచ్చేలోపు మీరైనా గొంతు విప్పుతారని ఆశిస్తున్నాను'' అని ఆ లేఖలో రాశారు.

"ఆయనను జైలుపాలు చేయడం ద్వారా ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం తొక్కిపడుతోంది'' అని ప్రొఫెసర్ నటరాజన్ అన్నారు." కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఆనంద్‌ను ఎవరూ అణచివేయలేరు. జైలులో పెట్టగలరు, హింసించగలరు. కానీ ఆలోచనలను మాత్రం అణగదొక్క లేరు'' అన్నారు నటరాజన్.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








