తెలంగాణ: కరోనావైరస్ నుంచి కోలుకున్నా... ప్రైవేటు ఆస్పత్రులిచ్చే షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి జులై 5న డిశ్చార్జ్ అయిన ఓ డాక్టర్ (అక్కడి డాక్టరు కాదు. వైద్యం కోసం వెళ్లారు) తనకు ఆసుపత్రి ఇచ్చిన బిల్లు చూసి ఆశ్చర్యపోయారు.
బిల్లులో ఉన్న లక్షల గురించి కాదు, దానికి వారు చూపిన కారణాల గురించి. అడిషినల్ సెక్యూరిటీ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్ కోసం రోజుకు 2,140 రూపాయలూ, లాండ్రీ చార్జీల కింద రోజుకు 2,440 రూపాయలు ఆయన బిల్లులో వేశారు.
మొత్తానికి మూడు రోజులకు లక్షా 80 వేలు వసూలు చేశారు.
* ఆ మరుసటి రోజు.. అంటే జులై 6న హైదరాబాద్ వాట్సాప్ గ్రూపుల్లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మరో కేసుకు సంబంధించింది.
ఓ పెద్ద వయసు మహిళ తనను ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు నిర్బంధించారని చెబుతూ తల్లడిల్లడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఆమెకు కోవిడ్ చికిత్స చేసిన ఆ ఆసుపత్రి బిల్లు చెల్లింపు విషయంలో వివాదం రావడంతో ఆమెను డిశ్చార్జి చేయలేదు.
రూ. 1,15,000 బిల్లు వేయగా అందులో రూ. లక్షకు పైగా చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వివాదం వచ్చింది.
తనకు ఇన్సులిన్, ఆహారం ఇవ్వడంలో కూడా ఇబ్బంది పెట్టారని ఆమె ఆరోపించారు. ఏడుస్తూ మాట్లాడిన ఆ వీడియో బయటకు వచ్చాక ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆమెను డిశ్చార్జి చేయించారు.
ఆ వీడియోలో కనిపించిన మహిళ పేరు సుల్తానా, ఒక ప్రభుత్వ డాక్టర్. అంతకుముందు వరకు ఆమె కూడా ఎందరో కోవిడ్ రోగులకు వైద్యం అందించారు. తాను ఆ వైరస్ బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఇలాంటి అనుభవం ఎదురైందని ఆమె చెప్పుకొచ్చారు.
* మరో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఒక వ్యక్తికి చేయని చికిత్సకు బిల్లు వేశారని ఆయన కుమార్తె ఆరోపించారు.
దానిపై ప్రశ్నిస్తే డిశ్చార్జి చేసే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో విడుదల చేశారు విజయ కేసరి అనే మహిళ.
*అంతకుముందు దాదాపు వారం ముందు, నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి బిల్లు కాపీ బయటకు వచ్చింది.
అందులో పీపీఈ కిట్ల కోసం రోజుకు సగటున రూ.15 వేలు వసూలు చేసినట్టు ఉంది.
దానిపై ఆగ్రహం వ్యక్తం అయ్యాక, సదరు రోగి బంధువులతో ఆ ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇప్పించింది.
ఇవన్నీ హైదరాబాద్ నగరంలో బయటకు తెలిసిన కొన్ని సంఘటనలు మాత్రమే. వీటితో పాటూ చేయని చికిత్సకు, వాడని కిట్లకు బిల్లులు వేశారంటూ ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి.
ఒకవైపు ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు వైద్యం అందుతుందో లేదోనన్న భయం, అడ్మిషన్ దొరుకుతుందో లేదోనన్న టెన్షన్ ఉండగా, అదృష్టం బావుండి పడక దొరికినా, ఆస్తులమ్ముకునే స్థాయిలో బిల్లులు వసూలు చేస్తున్నారంటూ ఎందరో బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, PA
ప్రభుత్వం ప్రకటించిన చార్జీలెంత?
జూన్ 15వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 248 (వైద్య ఆరోగ్య) ద్వారా ప్రైవేటులో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించింది.
రొటీన్ వార్డు, ఐసోలేషన్‌కి రూ.4 వేలు, ఐసియు వెంటిలేటర్ లేకుండా రూ.7,500, ఐసీయూ వెంటిలేటర్‌తో రూ.9 వేలు నిర్ణయించారు.
సీబీసీ, యూరిన్ రొటీన్, హెచ్ఐవి స్పాట్, క్రియాటిన్, ఈసీజీ, టూడీ ఎకో, కన్సల్టేషన్, మందులు, బెడ్, భోజనం వంటి పది రకాల పైన పరీక్షలు, కొన్ని సౌకర్యాలను కలిపే ఈ ధరలు నిర్ణయించింది. అంటే వాటికి అదనంగా వసూలు చేయకూడదు.
అయితే పీపీఈ కిట్లు, కొన్ని రకాల ఇంటర్వెన్షనల్ ప్రక్రియలు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్ ఇంకా కొన్ని పరీక్షలకు 2019 డిసెంబరు 31 నాటి ధరల ప్రకారం వసూలు చేసుకోవచ్చు.
ఇక కోవిడ్ నిర్ధరణ పరీక్షకు ధర రూ.2,200గా నిర్ణయించారు.
ప్రతి ప్రైవేటు ఆసుపత్రీ ఈ ధరలను బోర్డుపై రాసి అందరికీ కనిపించేలా ఉంచాలి. పేషెంట్ల సంఖ్య వంటివాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్లో అప్లోడ్ చేస్తుండాలని కూడా ప్రభుత్వం తన ఆదేశాల్లో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరుగుతోంది?
ప్రభుత్వ ధరల సంగతి పక్కన పెట్టి, ప్రైవేటు ఆసుపత్రులు తమ సొంత లెక్కలతో అధిక ధరలు వసూలు చేస్తున్నాయనేది ఒక ఆరోపణ.
చేయని చికిత్స, పరీక్షలకు డబ్బు వసూలు చేస్తున్నారన్నది మరో ఆరోపణ.
సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పెద్ద పరీక్షలు, పీపీఈ కిట్ల ఖరీదు వంటి చిన్న విషయాలూ ఇందులో ఉంటాయి. వీటికి ప్రభుత్వం ధర నిర్ణయించలేదు. దీంతో ప్రభుత్వం చెప్పిన వాటి విషయంలో చెప్పినట్టుగానే చేసి, చెప్పని వాటి విషయంలో మాత్రం, తమకు నచ్చినంత వసూలు చేస్తున్నారన్నది ఇంకో ఆరోపణ.
''ప్రభుత్వం నిబంధనలు ఇచ్చిన మరునాడే ఒక ఆసుపత్రి వారు కోవిడ్ చికిత్సకు రోజుకు లక్ష రూపాయల చొప్పున అడిగారు. నా దగ్గర కాల్ ఎవిడెన్స్ ఉంది. ఇక బంజారాహిల్స్‌లోని ఒక ఆసుపత్రిలో మూడు రోజులకు రూ.1,80,000 బిల్లు వేశారు.
అందులోనే బట్టల ఇస్త్రీకి రూ. 7 వేలు, సోషల్ డిస్టెన్సింగ్ చార్జీలు రూ.6 వేలు అని వేశారు. నిజానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చికిత్స చేయలేమని ప్రైవేటు ఆసుపత్రులు అప్పుడే చెప్పేశాయి. దానిపై ప్రభుత్వం స్పందించాలి. వారు విచ్చలవిడిగా వివిధ పేర్లతో దోచుకుంటన్నారు.
మార్గదర్శకాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించడంలేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని వ్యాఖ్యానించారు జగన్. జగన్ కొంతకాలంగా హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల బాధితుల పక్షాన పోరాడుతున్నారు.
పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే, ఓవైపు ప్రభుత్వం ధరలు నిర్ణయించగా వాటి అమలు విషయంలో స్వయంగా గవర్నర్, హైకోర్టులే రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
డబ్బున్నా బెడ్ లేదు
మరోవైపు డబ్బు ఎంత కావాలన్న కడతాం అనుకునే వారూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. అసలు కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ముందు ఎవరి దగ్గరకు వెళ్లాలి? పరీక్ష ఫలితం వచ్చే వరకూ చికిత్స ఎక్కడ వంటి విషయాల్లో కన్ఫూజన్ ఉంది. స్వయంగా మంత్రులు జోక్యం చేసుకుంటే తప్ప బెడ్ దొరకని పరిస్థితి.
రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి అర్థరాత్రి మంత్రి ఈటెల రాజే౦దర్‌కి ఫోన్ చేస్తే ఆయన బెడ్ ఇప్పించారు.
తాజాగా మరో సీనియర్ విలేకరి తన పరిస్థితి బాలేదంటూ హరీశ్ రావుకు వీడియో తీసి పంపిస్తే, ఆయన మరో ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిషన్ ఇప్పించారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం 92 శాతం కోవిడ్ పడకలు ఖాళీగానే ఉన్నాయని చెబుతోంది.

ఫొటో సోర్స్, facebook/Tamilisai Soundararajan
గవర్నర్ జోక్యం
హైదరాబాద్ నగరంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించాలనుకున్నారు.
సీఎస్‌కి కబురు పంపించినా, మొదటి రోజు వారు హాజరు కాలేదు. రెండో రోజు గవర్నర్‌ను కలిసి వివరాలు అందించారు.
ఇక ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యాలతో గవర్నర్ స్వయంగా సమీక్ష నిర్వహించారు.
బిల్లుల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. చేర్చుకునేటప్పుడే ఖర్చులన్నీ చెప్పాలన్నారు.

ఫొటో సోర్స్, TS high court
హైకోర్టు జోక్యం
శ్రీకిషన్ శర్మ అనే లాయర్ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఖర్చుల విషయంలో కోర్టుకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘిస్తోన్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మార్గదర్శకాలు విడుదల చేయాలని హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో అభ్యర్థించారు.
ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు, బిల్లుల వసూలుపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా చార్జీల విషయంలో ప్రభుత్వ జీవోను ఆసుపత్రులు పట్టించుకోకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించింది. అలా ఉల్లంఘించిన వారిపై ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయి ఉంటే, ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.
వైద్యురాలు సుల్తానా కేసును ప్రత్యేకంగా ప్రస్తావించారు న్యాయమూర్తులు. జులై 14 వరకు గడువు ఇచ్చింది హైకోర్టు.

ప్రైవేటు ఆసుపత్రులు ఏమంటున్నాయి?
ఈ ఆరోపణలపై బీబీసీ ఆయా ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించింది. వారి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
అదే సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు సమంజసంగా లేవని వ్యాఖ్యానించారు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులు సంఘం ప్రతినిధి భాస్కర రావు. ప్రాక్టికల్ సమస్యలు చూడకుండా ధరల నిర్ణయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
''ప్రతీ ప్రైవేటు ఆసుపత్రిలోనూ అన్ని పడకలూ కోవిడ్ కోసం కేటాయించలేం. కొన్నిటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అక్కడ అదనపు ఏర్పాట్లు, అదనపు సిబ్బంది, వారికి పరికరాలూ కావాలి. వాటికి అదనపు ఖర్చు అవుతుంది. ఇక కోవిడ్‌తో వచ్చేవారు కేవలం కోవిడ్‌కి మాత్రమే చికిత్స తీసుకోరు. వారు వేరే ఏ ఇతర వ్యాధితో అయినా బాధ పడుతుండొచ్చు.
దాంతో ఆయా వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయాలి. చికిత్స చేయాలి. వీటికి ఖర్చు అవుతుంది. అందువల్ల కొందరి బిల్లు పెరిగి ఉండొచ్చు. మేం అడ్డగోలుగా వసూలు చేస్తున్నాం అన్న వాదన సరికాదు. కొన్నిసందర్భాల్లో పేషెంట్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ పీపీఈ కిట్ మార్చాల్సి రావచ్చు. అందుకు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇవన్నిటి గురించీ మేం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాం'' అన్నారాయన.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








