కరోనావైరస్ బెంగళూరు: ప్రాణాలు పోతున్నాయని చెప్పినా 18 ఆస్పత్రులు చేర్చుకోలేదు.. 9 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
దినేశ్ సుజానీ ఏదో మాట చెబుతూ ఒక్కసారిగా బోరుమన్నారు.
‘ఏమైంది?’
కొద్దిక్షణాల పాటు అలాగే రోదించిన ఆయన ఆ తరువాత కొంచెం తేరుకుని ‘‘వాళ్లలా చెప్పొచ్చా’’ అన్నారు.
దినేశ్ పెద్దన్న భవర్‌లాల్ సుజానీ(52)కి కరోనా వైరస్ సోకిందని చనిపోయాక తెలిసింది.
భవర్‌లాల్‌ను 18 ఆసుపత్రులకు తిప్పినా కూడా ఆయన్ను ఎక్కడా ఎవరూ చేర్చుకోలేదు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఆదివారం జరిగింది ఇదంతా.
మొదట దినేశ్ తన అన్నను ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
లాక్ డౌన్ వల్ల ఆటోలు, కార్లు దొరక్కపోవడంతో స్కూటరుపైనే తీసుకెళ్లారు. తన అన్నకు పల్స్ 40-50కి పడిపోయిందని.. ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని చెప్పారు.
దాంతో ఆసుపత్రిలో ఎక్స్ రే తీశారు.. ఎక్స్ రేతో పాటు ఒక కాగితంపై ఇంగ్లిష్‌లో ఏదో రాసిచ్చారు.
‘‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ తరిమేశారు’’ ఈ మాట చెబుతూ దినేశ్ బోరున ఏడ్చారు. ఆ తరువాత అక్కడి నుంచి ఒక అంబులెన్సు మాట్లాడుకుని సమీపంలోని మరో ఆసుపత్రికి వెళ్లారు.
అక్కడా చేర్చుకోలేదు.. అలా ఒకదాని తరువాత ఒకటి 18 ఆసుపత్రులు తిప్పారు. దినేశ్ తన అన్నను తీసుకెళ్లిన 18 ఆసుపత్రుల్లో కొన్ని ప్రయివేటువి, మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులూ ఉన్నాయి.
‘‘వారు గేటు దగ్గర నుంచి మమ్మల్ని బయటకు పంపించేశార’’ని చెప్పారు దినేశ్. ఏ ఆసుపత్రీ చేర్చుకోకపోవడంతో భన్వర్‌లాల్ మరణించారు.
భవర్‌లాల్‌కు భార్య, నలుగురు పిల్లలున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలకు పెళ్లయింది. ఆ కుటుంబం ఒక చిన్న ప్రాంతంలో రెడీ మేడ్ దుస్తులు అమ్మే వ్యాపారం చేస్తోంది. ఆసుపత్రులకు వ్యతిరేకంగా కేసు పెట్టే ఆలోచనేమీ లేదని దినేశ్ చెప్పారు.
దేశమంతా ఇదే పరిస్థితి
కరోనా వైరస్ కారణంగా ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులను చేర్చుకోని కేసుల్లో ఇదే మొదటిది కాదు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో హాస్పిటళ్లు ఇలాగే చేయడం వల్ల ఎందరో చనిపోయారు.
మార్చి మూడో వారంలో లాక్‌డౌన్ విధించిన తరువాత మొట్టమొదట దేశ రాజధాని దిల్లీ నుంచి ఇలాంటి వార్తలొచ్చాయి. ఆ తరువాత దేశ తూర్పు ప్రాంతంలోని కోల్‌కతా, పశ్చిమాన ఉన్న ముంబయి, దక్షిణాన ఉన్న తెలంగాణ, కర్నాటకల్లోనూ ఇలా ఆసుపత్రులు చేర్చుకోకపోవడం వల్ల మరణించిన కోవిడ్ పేషెంట్ల ఉదంతాలు వెలుగు చూశాయి.
దేశంలో కరోనా వల్ల మరణించిన మొట్టమొదటి వ్యక్తికీ ఇదే అనుభవం ఎదురైంది. తెలంగాణలోను, తన స్వస్థలమైన కర్నాటకలోని కలబురిగిలోనూ ఆయన్ను పలు ఆసుపత్రులు చేర్చుకోలేదు.

ఫొటో సోర్స్, getty images
ఆసుపత్రులు ఏం చెబుతున్నాయి?
రోగులను చేర్చుకోకుండా వెనక్కు పంపడంపై చాలా ఆసుపత్రులు ఒకేలాంటి కథ చెబుతున్నాయి. ఆసుపత్రిలోని బెడ్లన్నీ నిండిపోయాయని.. అలాంటి చోట కరోనా ఇంకా నిర్ధరణ కాని రోగిని చేర్చుకోలేమని చెబుతున్నాయి.
తాజా ఘటనలో మరణించిన భవర్‌లాల్ విషయంలో కూడా ఆసుపత్రి నుంచి అదే సమాధానం వచ్చింది. ‘‘మా ఆసుపత్రిలోని 360 పడకల్లో 45 కోవిడ్ రోగులకు కేటాయించాం. అవన్నీ నిండిపోయాయి. కోవిడ్ రోగుల మధ్య ఒక కోవిడ్ అనమానిత రోగిని ఉంచలేం. ఒకవేళ ఆయనకు టెస్టులో నెగటివ్ వస్తే.. కరోనా సోకని రోగిని కరోనా వార్డులో ఉంచినందుకు మేం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే అనుమానిత రోగులను మేం చేర్చుకోవడం లేదు’’ అని భగవాన్ మహవీర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడిసన్, ట్రామా విభాగ నోడల్ అధికారి డాక్టర్ నిశాంత్ హిరేమత్ ‘బీబీసీ’తో చెప్పారు. భవర్‌లాల్‌ను చేర్చుకోలేదని ఆయన కుటుంబం చేస్తున్న ఆరోపణ తప్పని డాక్టర్ నిశాంత్ అన్నారు.
తమ హాస్పిటల్‌లో భవర్‌లాల్‌కు ఆక్సిజన్ అందించినట్లు ఆయన చెప్పారు. తమ ఆసుపత్రిలో స్వాబ్ టెస్ట్ సదుపాయం లేకపోవడంతో గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్లి చేయించుకోమని సూచించామన్నారు.
అయితే.. డాక్టర్ నిశాంత్ వంటివారు చేసిన సూచనలు తమ తండ్రి ప్రాణాలు కాపాడలేకపోయాయని భవర్ లాల్ కుమారుడు విక్రమ్ ఆరోపించారు.
బెంగళూరులోని 18 ఆసుపత్రులకు నేరుగా వెళ్లామని.. మరో 32 హాస్పిటల్స్‌కు ఫోన్ చేశామని.. కానీ, ఎవరూ చేర్చుకోలేదని.. చివరకు తమ తండ్రి ఒక హాస్పిటల్ ఎదురుగా తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఇది జరిగిన ఒక రోజు తరువాత కర్నాటక ప్రభుత్వం 9 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది. నోటీసులందుకున్నవాటిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది.
‘‘ప్రయివేటు ఆసుపత్రులు కోవిడ్ రోగులను కానీ, కోవిడ్ అనుమానితులన కానీ, ఆ లక్షణాలున్నవారిని కానీ చేర్చుకోకుండా తిప్పి పంపించడం, చికిత్సకు నిరాకరించడం వంటివి చేయడానికి వీల్లేదని కర్నాటక ఆరోగ్య శాఖ కమిషనర్ పంకజ్ కుమార్ పాండే ఒక ప్రకటనలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం లేదా?
కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా పడకలు కేటాయించేందుకు వీలుగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రయివేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుంటోంది.
కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం సబ్సిడీపై చర్చలు ముగించి పడకల లభ్యతకు వీలుగా నిర్ణయాలు తీసుకుంది.
దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులతో పోల్చితే కర్నాటక లాక్‌డౌన్ సమయంలో కరోనాను గణనీయంగా నియంత్రించింది. కేరళ తరువాత ఆ స్థాయిలో నియంత్రించింది కర్నాటకే.
అయితే, జూన్ 8 నుంచి లాక్ డౌన్ సడలించిన తరువాత మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం రావడంతో కేసులు మళ్లీ పెరిగిపోయాయి.
జూన్ 8 నాటికి 308 పాజిటివ్ కేసులు 64 మరణాలు ఉండగా జులై 1 నాటికి అది 1272 కేసులు, 253 మరణాలకు పెరిగింది. ఒక్క బెంగళూరులోనే జూన్ 8న 18గా ఉన్న కేసులు జులై 1కి 632కి పెరిగాయి.
‘10 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయి’
‘‘ప్రయివేటు మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో కలిపి 7,000 నుంచి 7,500 పడకలు అందుబాటులోకి వస్తాయి. మరో నెల రోజుల్లో కేసులు పెరిగినా అందుకు రాష్ట్రం సిద్దంగా ఉంటుంది’’ అని ఫెడరేషన్స్ ఆఫ్ హెల్త్ అసోసియేషన్స్ ఆఫ్ కర్నాటక ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ నాగేంద్ర స్వామి చెప్పారు.
అంటే ప్రభుత్వ ఆసుపత్రులతో కలిపితే 10 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉంటాయి.
అయితే, జులై, ఆగస్టులో పీక్ వస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చాలకపోవచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌లో న్యూరోవైరాలజీ ప్రొఫెసర్ వి.రవి చెప్పారు.
‘వీలైతే హోం ఐసోలేషన్’
కేసులు పెరిగాక ఎవరిని హాస్పిటల్‌లో ఉంచాలనేది కరెక్టుగా నిర్ణయించాలని.. లక్షణాలు లేని కేసులు, స్వల్ప లక్షణాలున్నవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచొచ్చని.. ఇంట్లో ప్రత్యేకంగా గది సదుపాయం లేనివారిని హాస్పిటల్‌లో చేర్చాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎపిడమాలజిస్ట్ డాక్టర్ గిరిధర్ బాబు అన్నారు.
ఎక్కువ మంది హోం ఐసోలేషన్లో ఉంటే ఆసుపత్రులలో పడకల కొరత తగ్గుతుందని అన్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోని కోవిడ్ బెడ్ల అందుబాటు వివరాలు హాట్‌లైన్లలో తెలుసుకోగలిగే ఏర్పాటు ఉంటే రోగులు ఆసుపత్రులకు వెళ్లకుండానే బెడ్లు ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని నాగేంద్ర స్వామి అన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?
- ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు
- అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








