ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్: చనిపోతున్నవారు ఎవరు.. వారి నేపథ్యం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన వారం రోజుల్లో 350కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కారణంగా మరణించినవారిలో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు.
మిగిలిన వారిలో కరోనావైరస్‌తో పాటుగా ఇతర కారణాలు కూడా మరణాలకు దారి తీస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలతో ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక దృష్టి పెడుతున్నామంటున్నారు.
దక్షిణాదిలోనే అత్యధికంగా
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 13 జిల్లాలకు గానూ 12 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క విజయనగరం జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ యాక్టివ్ కేసులున్నాయి.
ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలో మొత్తం 1,259 కేసులు ఉండగా అందులో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి 800కి పైగా కేసులున్నాయి.
తొలుత కర్నూలు జిల్లాలో కేసులు వేగంగా పెరిగాయి. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా అదే స్థాయిలో పెరుగుదల ఆందోళనకరంగా మారుతోంది.
రాజ్ భవన్, పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వైరస్ సోకడం కలకలం రేపింది. గత 24 గంటల్లో ఈ మూడు జిల్లాల్లో మొత్తం 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య గుంటూరులో 254, కృష్ణాలో 223, కర్నూలులో 332కు చేరింది.
అదే సమయంలో మరణించిన వారి వివరాలు పరిశీలిస్తే, కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే అవి మరణాలు నమోదు కావడం గమనార్హం.
అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కరోనా సోకినవారు మరణించినట్టు నమోదయ్యింది. అత్యధికంగా కర్నూలులో 9 మంది, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 8 మంది చొప్పున మరణించారు.
మృతుల్లో కూడా 80.6 శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు మరణించినట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
మరణాల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణాలో 26, తమిళనాడులో 21, కర్ణాటకలో 18 మంది, కేరళలో నలుగురు చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మృతుల్లో వారే అధికం
ఏపీలో మరణించిన 31 మందికి గానూ ప్రభుత్వం ప్రకటించిన 16 కేసుల వివరాలను పరిశీలిస్తే పలు అంశాలు అర్థమవుతాయి. ఈ 16 మందిలో ముగ్గురు మాత్రమే 50 ఏళ్లలోపు వారు ఉన్నారు.
వారిలో ఇద్దరు 45 ఏళ్ల వయసు వారు కాగా, మరొకరు 47 ఏళ్ల వ్యక్తి. 70 ఏళ్ల వయసు పైబడిన వారు ముగ్గురున్నారు. వారిలో ఒకరు మహిళ. మిగిలిన వారు 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారే.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?

దాదాపుగా అందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండగా ఎక్కువ మంది మధుమేహం బాధితులున్నారు. దాంతో పాటుగా హైపర్ టెన్షన్, శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు.
కరోనావైరస్ సోకినట్లు గుర్తించడంలో ఆలస్యం కూడా మరణాలకు మరో కారణంగా కనిపిస్తోంది. 16 కేసులను పరిశీలిస్తే అందులో ఆరుగురికి మరణించిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధరణ జరగడం దానికి నిదర్శనం.

ఫొటో సోర్స్, Getty Images
వెల్లడైన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. అనంతపురం జిల్లాకు చెందిన 66 ఏళ్ల పేషెంట్‌ను, మక్కా నుంచి వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్ కేసుగా నిర్ధారించారు. ఆయనకు సీఓపీడీ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు.
2. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల బాధితుడు. ఒడిశాలోని బరంపురం నుంచి రైలులో చేసిన ప్రయాణం వల్ల కరోనా బారిన పడినట్టు వెల్లడైంది. ఆయనకు గతంలో ఉబ్బసం, బ్రాంకైటిస్ సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు.
3. కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల పేషెంట్ టైప్ 2 మధుమేహం బాధితుడిగా తెలిసింది. ఆయనకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా బారిన పడ్డారు.
4. అనంతపురం జిల్లా మనురేవుకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత పాజిటివ్ కేసుగా నిర్ధరించారు.
5. గుంటూరు జిల్లా ఎస్‌ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల మృతుడికి చాలాకాలంగా టీబీ ఉన్నట్టు గుర్తించారు.
6. గుంటూరు జిల్లా దాచేపల్లికి మృతుడి వయసు 52 ఏళ్లు. కరోనావైరస్ ప్రభావానికి ముందుగా టీబీ సంబంధిత వ్యాధిగ్రస్తుడిగా నిర్ధరించారు.
7. విజయవాడకు చెందిన మృతుడి వయసు 55 ఏళ్లు. డయాబెటిక్, ఆస్తమా బాధితుడు కూడా. పంజాబ్‌లోని జలంధర్ నుంచి వచ్చిన పేషెంట్‌కి కాంటాక్ట్‌గా నిర్ధరించారు.
8. నెల్లూరుకు చెందిన ప్రైవేటు వైద్యుడు. వయసు 56 ఏళ్లు. దిల్లీ నుంచి వచ్చిన పేషెంట్‌కి కాంటాక్ట్‌గా నిర్ధరించారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నట్టు నిర్ధరణ చేశారు.
9. గుంటూరు జిల్లా కుమ్మరి బజార్‌కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి. కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. డయాబెటిస్‌తో పాటుగా గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టు ప్రకటించారు.
10. గుంటూరు జిల్లా కుమ్మరి బజార్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి. కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. శ్వాససంబంధిత సమస్యలతో పాటుగా డయాబెటిస్ కూడా ఉందని నిర్ధారించారు.
11. దిల్లీకి చెందిన 56 ఏళ్ల వ్యక్తి నెల్లూరు వచ్చారు. మరణించిన తర్వాత పాజిటివ్ కేసుగా నిర్ధరించారు.
12. కర్నూలుకు చెందిన 76 ఏళ్ల అల్లోపతి డాక్టర్. కరోనా సోకడానికి ముందుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్‌తో పాటుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
13. విజయవాడ గాంధీనగర్‌కి చెందిన స్త్రీ. 74 ఏళ్ల వయసు. డయాబెటిస్‌తో పాటుగా టీబీ సమస్యతోనూ సతమతం అవుతున్నారు. మరణించిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధరణ చేశారు.
14. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి మరణించారు. వయసు 47. మక్కా యాత్రికుడి కాంటాక్ట్‌గా, ఆస్తమా బాధితుడిగా నిర్ధారణ చేశారు.
15. కృష్ణా జిల్లాలో మరణించిన ఓ వ్యక్తి వయసు 56 ఏళ్లు. డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాల సమస్యలున్నట్టు ప్రకటించారు.
16. కర్నూలు జిల్లాలో నమోదైన ఓ మృతి కేసులోని వ్యక్తి వయసు 51 ఏళ్లు. దిల్లీ ప్రయాణీకుడిగా ప్రకటించారు. బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలతో ఉన్నారు.
ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వం మృతుల వివరాలను సైతం వెల్లడించడం లేదు. అప్పటి వరకూ అందించిన వివరాలను విశ్లేషిస్తే ఇద్దరు తప్ప మిగిలిన అందరూ దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారే మృతుల జాబితాలో ఉండడం గమనార్హం.

ఫొటో సోర్స్, Getty Images
దీర్ఘకాలిక సమస్యలున్న వారిపై దృష్టి
ఏపీలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ఏపీలో సోమవారం ఉదయానికి 74,551 మందికి టెస్టులు చేశాము. ఇది దక్షిణాది రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం సగటు కన్నా చాలా ఎక్కువ. ఇప్పటి వరకు 1,177 కేసులు పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. అందులో 31 మంది మరణించగా 235 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశాము. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత బాధితుల కేసు హిస్టరీని బట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఇప్పటి వరకూ మరణించిన వారిలో దీర్ఘకాలిక సమస్యలకు తోడుగా కరోనా వైరస్ ప్రభావం చూపడంతో మరణించినట్టు భావించాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టుగా అలాంటి సమస్యలున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం'' అంటూ వివరించారు.

ఈ మూడు జిల్లాలపై దృష్టి
ఏపీలో కరోనా విస్తృతి ఎక్కువగా కనిపిస్తున్న మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో కరోనా కొన్ని జోన్లకే పరిమితమైంది. వాటిపై దృష్టి సారించాం. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పటిష్ఠంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. కాంటాక్టులను గుర్తించి విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ర్యాపిడ్ టెస్టుల ఫలితం కూడా కూడా కనిపిస్తోంది. అందరికీ తగిన వైద్య సదుపాయాలు అందిస్తున్నాం'' అంటూ తెలిపారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








