కరోనావైరస్: హరియాణా సీఎం రిలీఫ్ ఫండ్‌కు గ్రామ పంచాయతీ రూ.10.5 కోట్ల విరాళం

హర్యానా సీఎంకు గ్రామం భారీ విరాళం
ఫొటో క్యాప్షన్, హర్యానా సీఎంకు గ్రామం భారీ విరాళం
    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనాతో పోరాటం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు అందించి సహకరించాలని కోరిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పిలుపునకు పానిపత్ జిల్లాలోని బాల్ జట్టన్ గ్రామ పంచాయతీ స్పందించింది.

దిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదిన్నర కోట్ల రూపాయల భూరి విరాళం అందించింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసిన గ్రామ సర్పంచ్ సరితా దేవి, మిగతా పంచాయతీ సభ్యులు ఆయన చేతికి పదిన్నర కోట్ల రూపాయల చెక్కును అందించారు.

ఈ విరాళానికి సంబంధించి గ్రామ సర్పంచ్ సరితా దేవి, గ్రామస్థులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని వారితో చర్చించారు.

తర్వాత, గ్రామ పంచాయతీ పేరుతో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా ఉన్న మొత్తం నుంచి పదిన్నర కోట్ల రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా అందించాలనే ఒక తీర్మానం ఆమోదించామని సరితా దేవి చెప్పారు.

“కోవిడ్-19ని రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారిగా ప్రకటించగానే, మా గ్రామం నుంచి వెళ్లే రహదారులను పూర్తిగా దిగ్బంధించాం. గ్రామంలో ఉన్న వారికి వైరస్ వ్యాపించకుండా, బయటివారు ఎవరూ లోపలికి రాకుండా నిఘా పెట్టాం” అని ఆమె చెప్పారు.

గ్రామం శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని, వైరస్ వ్యాపించే అవకాశమే లేకుండా రోజుకు కనీసం నాలుగుసార్లు ఊళ్లో మారు మూల ప్రాంతాలను కూడా శుభ్రం చేస్తున్నారని చెప్పారు.

గ్రామ పంచాయతీ ఇచ్చిన విరాళం చెక్
ఫొటో క్యాప్షన్, గ్రామ పంచాయతీ ఇచ్చిన విరాళం చెక్

ఈ డబ్బు ఎక్కడనుంచి వచ్చింది

“ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ పానిపట్ తమ రీఫైనరీ ఏర్పాటు చేయడం కోసం మా గ్రామంలో ఉన్న 1,200 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూములకు గ్రామానికి 125 కోట్ల మొత్తం చెల్లించింది. అది ప్రస్తుతం గ్రామ పంచాయతీ పేరుతో బ్యాంకులో ఎఫ్.డి.గా ఉంది” అని గ్రామ పంచాయతీ సభ్యుడు విజయ్ రాఠీ బీబీసీతో చెప్పారు.

అంతేకాదు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతుల కోసం 400 ఎకరాల పంచాయతీ భూమి లీజుకు ఇవ్వడంతో గ్రామ పంచాయతీకి ఏటా వారి నుంచి కూడా ఆదాయం అందుతోంది.

“పంచాయతీ స్థాయిలో చేసిన తీర్మానాన్ని లాంఛనంగా ఆమోదించిన తర్వాత ఆ ఎఫ్.డి. అకౌంట్ నుంచి తీసిన డబ్బును ముఖ్యమంత్రి కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఇచ్చాం” అని రాఠీ చెప్పారు.

కోవిడ్-19తో పోరాటానికి అండగా నిలవడానికి పంచాయతీ తీసుకున్న నిర్ణయానికి అవసరమైన అనుమతుల కోసం తాము చేసిన తీర్మానం కాపీని వారు బ్లాక్ డెవలప్‌మెంట్ పంచాయతీ అధికారికి, జిల్లా కలెక్టర్‌కు పంపించారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

“అన్ని లాంఛనాలూ పూర్తైన తర్వాత మాజీ మంత్రి కిషన్ లాల్ పవార్ సాయంతో శనివారం చండీగఢ్ చేరుకున్న సర్పంచ్, పంచాయతీ సభ్యులు విరాళం చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌కు అందించాం” అని రాఠీ చెప్పారు.

గ్రామ పంచాయతీ సభ్యుల భూరి విరాళానికి సంతోషించిన సీఎం తన అధికారిక ట్విటర్‌లో ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. బాల్ జట్టన్ గ్రామం సాయానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన రాష్ట్రం త్వరలో కరోనాపై విజయ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

బాల్ జట్టన్ గ్రామ పంచాయతీ సభ్యులు ఒక తీర్మానం చేసిన తర్వాత సీఎంకు 10.5 కోట్ల రూపాయల విరాళం అందించారని పానిపట్ డిప్యూటీ కమిషనర్ హేమ శర్మ ధ్రువీకరించారు.

ఐఓసీ పానిపట్ రీఫైనరీ
ఫొటో క్యాప్షన్, ఐఓసీ పానిపట్ రీఫైనరీ

అందరూ సంతోషంగా లేరు

గ్రామ పంచాయతీలోని మరో సభ్యుడు సుఖ్విందర్ కుమార్ మాత్రం గ్రామస్థుల అందరి ఆమోదం లేకుండానే సర్పంచ్ అంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించారని చెప్పారు.

“మా ఊళ్లో రోడ్లు, తాగునీరు, మెరుగైన స్కూళ్లు, పరిశుభ్రత లాంటి కనీస సౌకర్యాలు కూడా లేక గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. కానీ రాజకీయ నాయకుల దగ్గర మెప్పు పొందడానికి సర్పంచ్ అంత పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చేశారు. మేం విరాళం ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఈ డబ్బుకు అసలైన హక్కుదారులైన గ్రామస్థులకు కనీస సౌకర్యాలైనా కల్పించాలి కదా?” అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)