ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణాలేంటి... దిల్లీ క్యాపిటల్స్‌కు నెక్స్ట్ ఏంటి?

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, TWITTER/ RISHABH PANT

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్
    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
    • హోదా, బీబీసీ కోసం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్ జట్టు విజయం సాధించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ కేపిటల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇప్పుడిక దిల్లీ ఫైనల్‌కు చేరాలంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ జట్టు.. పృథ్వీ షా 56 పరుగులు, రిషబ్ పంత్ 49 పరుగులతో రాణించడంతో 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అయితే, విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడింది. అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనని స్టేడియంలోని ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు.

రషీద్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రషీద్ ఖాన్

మ్యాచ్‌ను మలుపుతిప్పిన రషీద్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ఓ దశలో హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని దిల్లీ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించేలానే కనబడింది. 14 ఓవర్లలో 111/3 స్కోరుతో నిలిచింది. అప్పటికి క్రీజులో ఉన్న రిషబ్ పంత్, కొలిన్ మున్రో ధాటిగా ఆడుతున్నారు.

ఆ సమయంలో 15వ ఓవర్ వేయడానికి హైదరాబాద్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వచ్చాడు. అది అతనికి చివరి, నాలుగో ఓవర్. రషీద్ వేసిన మొదటి బంతికే మున్రో బౌల్డ్ అయ్యాడు. దీంతో విజయంపై హైదరాబాద్ జట్టుకు కొద్దిగా ఆశలు చిగురించాయి.

ఇదే ఓవర్లో నాలుగో బంతికి కొత్త బ్యాట్స్‌మన్ అక్షర్ పటేల్ మెలికలు తిరుగుతూ వచ్చిన బంతిని అర్థం చేసుకోలేక వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక్క పరుగు కూడా రాకుండానే దిల్లీ జట్టు ఈ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో హైదరాబాద్ మళ్లీ పోటీలోకొచ్చింది.

15 ఓవర్లకు దిల్లీ స్కోరు 111/5.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రిషభ్ పంత్

ప్రతాపం చూపిన పంత్

మరోవైపు క్రీజులో ఉన్న రిషబ్ పంత్ 18వ ఓవర్లో ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. థంపి వేసిన ఆ ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 22 పరుగులు బాది మ్యాచ్‌ను మళ్లీ దిల్లీ చేతుల్లోకి తీసుకొచ్చాడు. అంతకు ముందు మూడు ఓవర్లు వేసి 19 పరుగులిచ్చిన థంపి, ఈ ఒక్క ఓవర్లోనే 22 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో దిల్లీ స్కోరు 18 ఓవర్లకు 155/5 కు చేరింది.

దిల్లీ విజయానికి 12 బంతుల్లో 8 పరుగులు కావాలి. చేతిలో ఇంకా 5 వికెట్లున్నాయి. దిల్లీ సునాయాసంగా గెలుస్తుందనిపించింది.

ఇక్కడే మ్యాచ్‌లో మరోసారి ఉత్కంఠ రేగింది.

19వ ఓవర్ వేయడానికి వచ్చిన భువనేశ్వర్ కుమార్ దిల్లీ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఊపుమీదున్న రిషబ్ పంత్‌ను ఔట్ చేసి స్టేడియంలో ఉన్న దిల్లీ జట్టు అభిమానులను నిశ్చేష్టులను చేశాడు. పంత్ కేవలం 21 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 49 పరుగులు చేశాడు.

అప్పటికి ఇంకా దిల్లీ జట్టుకు ఏడు బంతుల్లో ఐదు పరుగులు కావాలి.

శిఖర్ ధవన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిఖర్ ధవన్

ఆసక్తి రేపిన చివరి ఓవర్

క్రీజులో అమిత్ మిశ్రా, కీమో పాల్ ఉన్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌కు వచ్చాడు.

మొదటి బంతి వైడ్.

ఇంకా నాలుగు పరుగులు సాధిస్తే దిల్లీ గెలుస్తుంది.

తర్వాత బంతికి మిశ్రా సింగిల్ తీశాడు. రెండో బంతికి పాల్ పరుగులేమీ చేయలేదు. మూడో బంతికి సింగిల్.

ఇక దిల్లీకి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం.

ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అమిత్ మిశ్రా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమిత్ మిశ్రా

బంతికి అడ్డు పడి ఔటైన అమిత్ మిశ్రా

ఖలీల్ వేసిన బంతి బ్యాట్‌కు తగలకపోయినా మిశ్రా పరుగు తీశాడు. అయితే ఖలీల్ వేసిన త్రోకు ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలాడంటూ థర్డ్ అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించాడు.

కీపర్ సాహా బంతిని ఖలీల్‌కు అందించగా, ఖలీల్ వికెట్లవైపు విసిరాడు. దీన్ని గమనించిన మిశ్రా ఒక్కసారిగా తను పరిగెత్తే మార్గాన్ని కొద్దిగా మార్చుకుని బంతికి అడ్డం తగిలాడు. దీనిపై ఖలీల్ సమీక్షను కోరాడు. రీప్లేలో మిశ్రా కావాలనే బంతికి అడ్డం వచ్చాడని నిర్థరించి, అతడిని 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' కింద రనౌట్‌గా ప్రకటించారు.

దీంతో దిల్లీ జట్టు సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కానీ అదృష్టం ఆ జట్టునే వరించింది. తర్వాత బంతిని కీమో పాల్ బౌండరీకి తరలించాడు. 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచి దిల్లీకి విజయాన్నందించాడు. దీంతో దిల్లీ జట్టు శుక్రవారం నాడు చెన్నైతో జరిగే రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది.

మార్టిన్ గప్తిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్టిన్ గప్తిల్

ఐపీఎల్ నుంచి హైదరాబాద్ ఔట్

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది.

ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 19 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లున్నాయి. ట్రెంట్ బోల్ట్ వేసిన రెండో ఓవర్లో గప్తిల్ రెండు వరుస సిక్సులు బాదాడు. ఆ ఊపు చూస్తే భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అమిత్ మిశ్రా స్పిన్‌కు దొరికిపోయిన గప్తిల్ కీమో పాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 9 బంతుల్లో 8 పరుగులే చేసి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

కేన్ విలియమ్‌సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేన్ విలియమ్‌సన్

దిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ బౌలింగ్‌లో తరచూ మార్పులు చేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. దీంతో కొత్తగా వచ్చిన మనీష్ పాండే, కేన్ విలియమ్‌సన్ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. 36 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసిన మనీష్ పాండేను కీమో పాల్ అవుట్ చేశాడు. అప్పటికి హైదరాబాద్ స్కోరు 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు.

హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 27 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు.

మనీష్ పాండే

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మనీష్ పాండే

ఆ తర్వాత క్రీజులోకొచ్చిన విజయ్ శంకర్, మహ్మద్ నబీ ధాటిగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. విజయ్ శంకర్ 11 బంతుల్లో 25 పరుగులు, నబీ 13 బంతుల్లో 20 పరుగులు చేశారు.

దిల్లీ బౌలర్లు కీమో పాల్ 32 పరుగులిచ్చి మూడు వికెట్లు, ఇషాంత్ శర్మ 34 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు.

ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.

ఇక దిల్లీ, చెన్నైల మధ్య జరిగే క్వాలిఫయర్‌లో గెలిచే జట్టు ఫైనల్లో ముంబయితో తలపడుతుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)