IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్త
- హోదా, బీబీసీ కోసం
సోమవారం ఐపీఎల్-12 మ్యాచ్‌లో ముంబయి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండో సారి బౌలింగ్‌కు దిగాడు.
అతడు 18వ ఓవర్ వేస్తున్నప్పుడు కవర్స్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గరకు ఒక షాట్ వచ్చింది. దాన్ని ఆపే ప్రయత్నంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది.
చిరాకుపడ్డ విరాట్ కోహ్లీ..దాన్ని ఎలాగోలా ఆపగలిగాడు. తర్వాత కోపంగా కాలితో తన్నాడు.
విరాట్ కోహ్లీ తన జట్టు ప్రదర్శనకు ఎంత నైరాశ్యంలో పడిపోయాడో ఆ దృశ్యమే చెబుతుంది.
ఇక డగవుట్‌లో కోహ్లీ టీమ్ కోచ్ ఆశిష్ నెహ్రా ముఖం కూడా వాడిపోయి కనిపించింది.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ విజయం కోసం ఆఖరి రెండు ఓవర్లలో 22 రన్స్ చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Bcci
పవన్ నేగీకి బంతి ఇచ్చిన విరాట్
నేగీని ఎదురుగా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తను ఒంటరిగా ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాడు.
నేగీ మొదటి బంతికి ఎలాంటి రన్ రాలేదు. కానీ తర్వాత బంతికి హార్దిక్ పాండ్యా బ్యాట్ కొట్టిన షాట్‌ను బెంగళూరు ఫీల్డర్ల కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.
నేగీ రెండో బంతికి పాండ్యా లాంగాఫ్‌పై అద్భుతమైన సిక్స్ కొట్టాడు.
మూడో బంతిని పాండ్యా ఎక్స్‌ట్రా కవర్ బౌండ్రీ లైన్ బయటకు ఫోర్ కోసం పంపించాడు.
నాలుగో బంతిని కూడా పాండ్యా ఫోర్‌గా మలిచాడు.
ఐదో బంతిని బలంగా బాదిన పాండ్యా లాంగాన్‌పై స్టాండ్స్‌లోకి పంపాడు.

ఫొటో సోర్స్, TWITTER/ HARDIK PANDYA
ఆ తర్వాత గెలుపు లాంఛనమే అయ్యింది.
ఆఖరి బంతికి ఒక పరుగు తీయడంతో ముంబై ఈ మ్యాచ్‌ను 19వ ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి గెలుచుకుంది.
హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ 40, కెప్టెన్ రోహిత్ శర్మ 28, సూర్యకుమార్ యాదవ్ 29, ఇషాన్ కిషన్ కూడా 21 పరుగుల భాగస్వామ్యం అందించారు.
బెంగళూరు బౌలర్ యజువేంద్ర చహల్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ఇద్దరిపై బ్యాటింగ్ భారం
అంతకు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఏబీ డివిలియర్స్ 75, మొయిన్ అలీ 50 పరుగులు చేయడంతో నిర్ధారిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది.
డివిలియర్స్, మొయిన్ అలీతోపాటు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ 28 పరుగులు చేశాడు.
కెప్టెన్ కోహ్లీ 8, ఆకాశ్‌దీప్ నాథ్ 2 పరుగులు చేసి అవుటవగా, మార్కస్ స్టొయినిస్, పవన్ నేగీ బ్యాట్ నుంచి ఒక్క పరుగు కూడా రాలేదు.
ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ తన పాత జోష్ చూపిస్తూ 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఫొటో సోర్స్, AFP
విరాట్ సేనకు ఏమైంది
బెంగళూరు టీమ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏపీ డివిలియర్స్, స్టొయినిస్, మొయిన్ అలీ, యజువేంద్ర చహల్ లాంటి ఆటగాళ్లు ఉన్నా ఎందుకు విజయాల బాట పట్టలేకపోతోంది.
ఈ ప్రశ్నకు సమాధానంగా క్రికెట్ విశ్లేషకులు విజయ్ లోక్‌పల్లీ "మొదట ముంబైతో జరిగిన మ్యాచ్ గురించి చెప్పుకుంటే హార్దిక్ చెలరేగిపోయిన ఆ ఓవర్‌ను పవన్ నేగీకి ఇచ్చుండకూడదు" అన్నారు.
హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌ను కూడా తీసిపారేయలేం. కానీ తనున్న పరిస్థితుల్లో బ్యాట్‌కు కచ్చితంగా పనిచేప్పితీరాల్సిందే. బలంగా షాట్లు కొట్టేందుకు పాండ్యా తెలివిగా వికెట్ల నుంచి కాస్త వెనక్కు వచ్చేవాడు.
కానీ బయట నిలబడ్డ కోచ్ ఆశిష్ నెహ్రా చెప్పడంతో పవన్ నేగీని బౌలింగ్‌కు దింపారు. అతడి బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. నేగీ పాండ్యా రేంజ్‌లోనే బంతులు వేశాడు.
దానితోపాటూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా మ్యాచ్ ఓడిపోవడం తమ నుంచే నేర్చుకోవాలని ఆర్సీబీ మరోసారి చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
కోహ్లీ చెత్త ఫీల్డింగ్
ఇక చెత్త ఫీల్డింగ్‌పై కోహ్లీ ఆగ్రహం గురించి మాట్లాడిన విజయ్ లోక్‌పల్లీ " జట్టులో ఆటగాళ్లు డైవ్ చేస్తారని, పరుగులు సేవ్ చేస్తారని, అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శిస్తారని కోహ్లీ మిగతావారిపై ఆశలు పెట్టుకుంటాడు. కానీ నేరుగా వచ్చే బంతిని తనే స్వయంగా పట్టుకోక ఆ కోపం తనమీదే చూపిస్తాడు" అన్నారు..
విషయం తిరిగి తిరిగి అక్కడికే వస్తుంది. కోహ్లీ దగ్గర మంచి బౌలర్లు లేకుండా, మంచి ఫీల్డర్లు లేకుండా 200 లేదా 220 పరుగులు చేయకపోతే ఆ జట్టు ఎలా గెలుస్తుంది.
ఇప్పుడు ఈ ఐపీఎల్‌లో 8లో 7 మ్యాచ్‌లు ఓడిపోయిన బెంగళూరు జర్నీ ముగిసిపోయే దశకు చేరుకుంది.
దీని గురించి విజయ్ లోక్‌పల్లి "ఇక బెంగళూరు మిగిలిన ఆరు మ్యాచుల్లో అన్నీ గెలవాలంటే చాలా కష్టం. అది కూడా మనోధైర్యం పూర్తిగా అడుగంటి, చెత్త ఫాంలో ఉన్న జట్టుకు అది అసాధ్యం అనే చెప్పచ్చు" అన్నారు.
"అయినా 25వ తేదీ ఇంకా చాలా దూరంలో ఉంది. అప్పటికి బెంగళూరు జట్టులోని కొందరు విదేశీ ఆటగాళ్లను కూడా కోల్పోతుంది. ఎందుకంటే ప్రపంచకప్ సన్నాహాల కోసం వాళ్లు తిరిగివెళ్లాల్సి ఉంటుంది" అని చెప్పారు.
అలాంటప్పుడు ఏదో అద్భుతం జరిగితే బెంగళూరుకు చివరి నాలుగులో చోటు దక్కవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
డివిలియర్స్ అవుట్ దెబ్బకొట్టింది
అంటే స్వయంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ జోరు చూపించకపోవడం వల్లే బెంగళూరు ఇలాంటి పరిస్థితుల్లో పడిందా?
దీనికి విజయ్ "కచ్చితంగా అందుకే, అందులో వేరే అభిప్రాయం లేదు. ఈ టీమ్ ఈసారీ కేవలం విరాట్, డివిలియర్స్‌నే నమ్ముకుంది" అన్నారు.
సోమవారం కూడా డివిలియర్స్ ముంబైతో మ్యాచ్‌లో కాకూడని సమయంలో అవుటయ్యాడు. చివరి ఓవర్లో మూడు వికెట్లు పడ్డాయి.
"ఆకాశ్‌దీప్ నాథ్ వల్ల డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. డివిలియర్స్ రన్ తీస్తున్నప్పుడు ఆకాశ్ అతడిని తిరిగి పంపించి ఉండకూడదు. డివిలియర్స్ స్ట్రైక్‌లో ఉండుంటే కనీసం మరో 15 రన్స్ వచ్చుండేవి. అవి పనికొచ్చేవి" అన్నారు విజయ్.
అక్కడ బెంగళూరు ఆటగాళ్లు చాలా బలహీనమైన తమ క్రికెట్ జ్ఞానాన్ని బయటపెట్టారు.
ఇక ఈ మ్యాచ్‌లో మిగిలిన ఆశలను పవన్ నేగీ ఓవర్ ఆవిరి చేసింది. ఇంత పోటాపోటీ మ్యాచ్‌లో అతడు బౌలింగ్ సరిగా చేయలేదు.
టెక్నికల్‌గా చూస్తే బెంగళూరు ఇప్పుడు మరో మ్యాచ్ ఓడిపోతే, అది సూపర్ ఫోర్ నుంచి బయటుండిపోతుంది.
"అయినా కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్లనే నమ్ముకున్న జట్టు 8లో 7 మ్యాచ్‌లు ఓడిపోతే, అది ఇలాంటి పరిస్థితిలోనే పడుతుంది" అని విజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...
- భారతదేశం ఎన్నికలు... ఆరు వారాల పెళ్ళి సంబరాలు
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: సముద్రం మధ్యలో పోలింగ్..
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- 'అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా': కల్యాణదుర్గం సభలో రాహుల్ గాంధీ
- పవన్ కల్యాణ్, రాహుల్ గాంధీల తరహాలో రెండు స్థానాల్లో పోటీ చేసిన నేతలెవరు?
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- రెండు స్థానాల నుంచి రాహుల్ గాంధీ పోటీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








