మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, ఉమెన్ అఫైర్స్ రిపోర్టర్, బీబీసీ వరల్డ్ సర్వీస్
మసీదుల్లో మహిళలు ప్రవేశించేలా, పురుషులతో కలిసి ఒకేచోట నమాజు చదివేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ముస్లిం దంపతుల జంట వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది.
ఈ పిటిషన్‌పై కేంద్రం, జాతీయ మహిళా కమిషన్, సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ముస్లిం మహిళలు మసీదులో ప్రవేశించడానికి, నమాజు చేయడానికి అనుమతించాలంటూ వేసిన పుణె దంపతుల పిటిషన్‌పై దిశానిర్దేశం చేయాలని కోరింది.
దేశంలోని మసీదుల్లో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని, మహిళలు, పురుషులు ఒకే చోట నమాజు చేసేందుకు అనుమతించాలని పుణె దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించింది.
"మీ వాదనలు వినడానికి కారణం శబరిమల ఆలయ ప్రవేశంపై మేం తీర్పు ఇవ్వడమే" అని సుప్రీంకోర్టు పేర్కొంది.
పుణెకు చెందిన ఈ దంపతులను ఒక మసీదులో నమాజు చదవడానికి వెళ్లినపుడు కొందరు వారిని అడ్డుకున్నారు.
దాంతో ఈ ముస్లిం జంట సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు మసీదులో ప్రవేశించడం, పురుషులతో కలిసి నమాజు చదవడం గురించి ప్రస్తుతం ఈ మతం ఏం చెబుతోంది.
మహిళలు మసీదులో ప్రవేశించవచ్చా
మసీదులో మహిళలు ప్రవేశంపై ఖురాన్‌లో ఎలాంటి ఆంక్షలూ లేవు.
షియా, బొహ్రా, ఖోజా మతాల మసీదుల్లోకి మహిళలు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు.
మహిళలు మసీదులోకి వెళ్లడం సరికాదని ఇస్లాంలో సున్నీ మతాన్ని విశ్వసించే చాలా మంది భావిస్తారు. అందుకే మహిళలు సున్నీ మసీదుల్లోకి కూడా వెళ్లరు.
అయితే దక్షిణ భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సున్నీ మసీదుల్లోకి మహిళలు వెళ్లడం సాధారణ విషయం.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు, పురుషులతో నమాజు చదవవచ్చా
ఖురాన్, అరబీ భాషను తరచూ మసీదుల్లోనే బోధిస్తుంటారు. ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ పాల్గొంటారు.
మహిళలు నమాజు చదవడం, వజూ చేయడంపై ఎలాంటి ఆటంకాలూ లేవు. కానీ పురుషులు, మహిళలు విడివిడిగా చేయడానికి వేరువేరు స్థలాలు ఉంటాయి.
చాలా మసీదులు మతాల ప్రకారం ఉండవు. అలాంటప్పుడు షియా-సున్నీ వారు ఒకే ఇమామ్ వెనుక నమాజు చదువుతారు.
ఎవరైనా ఒక మహిళ మసీదులో నమాజు చదవాలని అనుకుంటే, ఇమామ్‌కు అది చెప్పవచ్చు. ఆయన నమాజు చేసేందుకు ఆమెకు వేరే చోటు కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
శబరిమల ప్రస్తావన
కేరళ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పిటిషనర్లు ప్రస్తావించారు.
"మక్కాలో కూడా మహిళలు, పురుషులు కలిసి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని, అలాంటప్పుడు మసీదుల్లో మహిళలను పురుషుల నుంచి వేరుగా ఉంచడం తప్పని" దంపతులు తమ పిటిషన్‌లో తెలిపారు.
అయితే పురుషులు, మహిళలు నమాజు చదవడం, వజూ చేయడం కోసం మక్కా మసీదులో కూడా వేరు వేరు ప్రాంతాలు ఏర్పాటుచేశారు.
ప్రపంచంలోని అన్ని మసీదుల్లో దానినే అనుసరిస్తున్నారు.
"ఇది భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని" పిటిషనర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








