ఐపీఎల్ 2019: ఫైనల్లో ముంబై, సొంతగడ్డపై ధోనీసేనకు పరాజయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ కోసం
ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత మైదానంలోనే ఓడించి ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది.
చెన్నై నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని సూర్యకుమార్ యాదవ్ 71 పరుగుల అజేయ ఇన్నింగ్స్ సాయంతో ముంబై జట్టు 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇషాన్ కిషన్ 28 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 (నాటౌట్) పరుగులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
రాణించిన కొత్త ఆటగాళ్లు
అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ జట్టు 20 ఓవర్లలో కేవలం 131 పరుగులే చేయగలిగింది.
అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ముంబై జట్టులో కొత్త ఆటగాళ్లు రాణించడం. ఎవరికీ పెద్దగా అంచనాల్లేని ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు.
4 పరుగులకే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా తక్కువ స్కోరుకే హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 8 బంతుల్లో 12 పరుగులు చేసిన డికాక్ జట్టు స్కోరు 21 వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఆ తరువాత క్రీజులో పాతుకుపోయిన సూర్యకుమార్ జట్టును గెలిపించాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞుల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డాడు. ఇషాన్ కిషన్ రూపంలో మరో ఎండ్ నుంచి సూర్యకుమార్‌కు మంచి సహకారం లభించింది. 31 బంతుల్లో 28 పరుగులు చేసిన ఇషాన్ తరచూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సూర్యకుమార్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు.

ఫొటో సోర్స్, Getty Images
వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. చివరికి 101 పరుగుల స్కోరు వద్ద ఇమ్రాన్ తాహిర్ ఇషాన్‌ను ఔట్ చేసి ఈ జంటను విడగొట్టాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కృనాల్ పాండ్య పరుగులేమీ చేయకుండానే ఇమ్రాన్ తాహిర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో చెన్నై పుంజుకుంటున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత బరిలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. 54 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసిన సూర్యకుమార్, 13 పరుగులతో అజేయంగా నిలిచి హార్దిక్ పాండ్యా తమ జట్టును ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చారు.
మూడు, నాలుగు స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్ మ్యాచ్ ముగిసే వరకూ క్రీజులో ఉంటే విజయం సాధించొచ్చని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఈ పరాజయంపై ధోనీ ఏమన్నాడు?
"ఆరేడు మ్యాచ్‌లు సొంతగడ్డపై ఆడిన మా టీమ్‌కు పిచ్ గురించి బాగా తెలుసు. ఎంత స్కోరు చేస్తే పోరాడవచ్చో అవగాహన ఉంది. కానీ ఈసారి అవేమీ జరగలేదు. టాప్ ఆర్డర్ విఫలం కావడం వల్లే ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. తర్వాత మ్యాచ్‌లో ఇలా జరగకుండా చూసుకోవాల్సి ఉంది" అని మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అన్నాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐపీఎల్ ప్రారంభంలో కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ ముంబై జట్టు చివరికి ప్రస్తుత సీజన్‌లో ఫైనల్ చేరింది.

ఫొటో సోర్స్, dibyangshu sarkar/ getty images
చెన్నై జట్టు పేలవ బ్యాటింగ్ మరో కారణం
బాగా తెలిసిన పిచ్‌పై టాస్ గెలిచిన ధోనీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయం తప్పు అని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ముంబై జట్టు బౌలర్లు ఆరు ఓవర్లలో కేవలం 32 పరుగులకే ముగ్గురు చెన్నై బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపారు.
మొదటి వికెట్ పతనం తర్వాత మరో వికెట్ పడకుండా చూడాల్సిన బాధ్యత మురళీ విజయ్‌పై పడింది. దీంతో పరుగుల వేగం తగ్గింది. మురళీ 26 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మురళీ ఔటయ్యే సమయానికి చెన్నై స్కోరు 12.1 ఓవర్లలో 65 పరుగులు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటి వరకూ ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తన బౌలర్లను చాలా తెలివిగా ఉపయోగించాడు. మురళీ తర్వాత అంబటి రాయుడు, ధోనీ మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు కానీ వేగంగా పరుగులు తీయలేకపోయారు.
ఇన్నింగ్స్ ముగిసేసరికి ధోనీ 29 బంతుల్లో మూడు సిక్స్‌ల సాయంతో 37 పరుగులు, రాయుడు 37 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
వీరిద్దరూ కలసి ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. లసిత్ మలింగ వేసిన 19వ ఓవర్లో ధోనీ తనదైన శైలిలో రెండు వరుస సిక్స్‌లు కొట్టాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.
కానీ చివరి ఓవర్లో బుమ్రా.. ధోనీ, రాయుడులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ ఓవర్లో కేవలం 9 పరుగులే వచ్చాయి.
ముంబై బౌలర్ రాహుల్ చాహర్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా 21 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

ఫొటో సోర్స్, AFP
చెన్నైకి మరో చాన్స్
ఈ విజయంతో ముంబై జట్టు ఫైనల్ చేరింది.
ఈ మ్యాచ్‌లో ఓడినా చెన్నై ఇప్పటికీ ఫైనల్ రేసులో ఉంది.
బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై తలపడుతుంది.
బుధవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ కేపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢీకొంటాయి. ఇందులో ఓడిన జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది.
ఇవి కూడా చదవండి.
- ఐపీఎల్ 2019: చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు సక్సెస్ సీక్రెట్ చెప్పిన ధోనీ
- ఐపీఎల్ 2019: కేఎల్ రాహుల్‌కు చెడ్డపేరు రాకుండా అశ్విన్ కాపాడాడా
- రసెల్: మూడు పరుగులు తప్ప మిగతావన్నీ సిక్సర్లు, ఫోర్లే
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- "ఆ మహిళలకు ఇప్పటికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది"
- వారణాసిలో ముస్లింల ఇళ్లు కూల్చేస్తే.. హిందూ ఆలయాలు బయటపడ్డాయా
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








