ఇజ్రాయెల్ ప్రజలకు నెతన్యాహు క్షమాపణ

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
    • రచయిత, జాక్ బర్గెస్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలో శనివారం ఆరుగురు బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఆయన.. బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు క్షమాపణలు కోరారు.

కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే మరింతమంది బందీలను ఇలాగే పంపుతామని హమాస్ హెచ్చరించింది.

మరోవైపు నెతన్యాహు చర్చలు కొనసాగిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు.

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రమాదం ఉందన్న కారణంతో ఇజ్రాయెల్‌కు కొన్ని ఆయుధాల విక్రయాన్నియూకే ఇప్పటికే నిలిపివేసింది.

గాజాలో వ్యూహాత్మక భూభాగమైన ఫిలడెల్ఫి కారిడార్‌పై తమ బలగాల నియంత్రణ కొనసాగాలని ఇజ్రాయెల్ ప్రధాని పట్టుపడుతున్నారు.

హమాస్‌తో చర్చలలో ఈ విషయం సమస్యాత్మకంగా మారింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెలీల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనలు

ప్రజల నిరసన

తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ బందీల కుటుంబాలు నిరసనకు పిలుపునివ్వడంతో సోమవారం వేలాదిమంది ఇజ్రాయెలీలు వీధుల్లోకి వచ్చారు.

జెరూసలేంలో ప్రధాని ఇంటిముందు నిరసన తెలుపుతున్నవారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ రిపోర్ట్ చేసింది.

ఓ పోలీస్.. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్టర్ గొంతు నులిమినట్టు ఆ పత్రిక పేర్కొంది.

టెల్ అవీవ్‌లో ఆదివారం లక్షల మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి, ప్రధాన రహదారిని దిగ్బంధించిన తరువాత ఆందోళన తీవ్రమైంది.

ఆందోళనకారులు ఇజ్రాయెల్ జెండాలను చేతపట్టి, పసుపు రిబ్బన్లతో బందీలకు సంఘీభావం తెలిపారు.

నిరుడు అక్టోబర్7న హమాస్ కిడ్నాప్ చేసినవారిలో 97మంది జాడ ఇప్పటికీ తెలియడంలేదు.

ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడిని కొనసాగిస్తే బందీలను శవపేటికలలో పంపుతామని హమాస్ సోమవారం చెప్పింది.

బందీలకు కాపలాగా ఉన్న మిలిటెంట్ల వద్దకు ఇజ్రాయెలీ బలగాలు సమీపిస్తే ఏం చేయాలో ‘కొత్త సూచనలు’ జారీ చేసినట్టు తెలిపింది.

హమాస్ గ్రూపు అధికారప్రతినిధి ఒకరు ఈ ‘కొత్త సూచనలు’ ఏమిటో వివరించకుండా, ‘‘నెతన్యాహు బందీలను ఒప్పందం ద్వారా కాకుండా, సైనిక ఒత్తిడి ద్వారా విడిపించుకోవాలని చూస్తున్నారని, బందీల కుటుంబాలు తమ వారు బతకాలో, చనిపోవాలో తేల్చుకోవాలని’’ హెచ్చరించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జో బైడెన్

‘నెతన్యాహు తగినంత పనిచేయడం లేదు’

హమాస్‌తో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద కార్మిక సంఘం తెలిపింది.

మరోవైపు నిరసనల కారణంగా టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం తమ కార్యకలాపాలకు పరిమితంగా అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది.

అనేక రెస్టారెంట్లు, ఆస్పత్రులు యథావిధిగా నడిచాయి.

హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనీయులపై పెరుగుతున్న దాడులు

నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసమే ఒప్పందాన్ని అడ్డుకుంటున్నారని అనేకమంది ఆరోపిస్తున్నారు. కానీ నెతన్యాహు ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.

హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టకుండా నెతన్యాహు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగుతామని ఫార్ రైట్ పార్టీలు హెచ్చరించాయి.

ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని (వీరిలో 33మంది చనిపోయారని భావిస్తున్నారు) విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)