పాకిస్తాన్‌లో హరిఘర్ ఉంటుందా అని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

అలీఘర్ ముస్లీం యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలీఘర్ ముస్లీం యూనివర్సిటీ

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ పేరు హరిఘర్ గా మార్చే తీర్మానానికి భారతీయ జనతాపార్టీ పాలనలో ఉన్న నగర మున్సిపల్ బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ తీర్మానాన్ని తుది ఆమోదం కోసం రాష్ట్రప్రభుత్వానికి పంపనున్నారు.

గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేక ముస్లిం నగరాల పేర్లను మార్చింది.

‘‘అలీఘర్ పేరును హరిఘర్ గా మార్పు చేయాలని కోరుతూ ఓ సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానానిన ఏకగీవ్రంగా ఆమోదించాం’’ అని తీర్మాన ఆమోదానంతరం మేయర్ ప్రశాంత్ సింఘాల్ తెలిపారు.

అలీఘర్ పేరును హరిఘర్‌గా మార్చాలనే డిమాండ్ దీర్ఘకాలంగా ఉందని ఆయన తెలిపారు.

‘‘పురాతన నాగరికత, సంస్కృతి, హిందూ ప్రాంత సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళేందుకు అలీఘర్ పేరును హరిఘర్ గా మార్పు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని’’ చెప్పారు.

త్వరలోనే ఈ నగరం హరిఘర్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అలీఘర్ పేరును హరిఘర్ గా మార్చాలంటూ దీర్ఘకాలంగా నీరజ్‌శర్మ అనే బీజేపీ నేత ప్రచారం చేస్తున్నారు.

హరి ఓ చారిత్రక నామం. ఈ పేరు ఇక్కడి నాగరికత, సంస్కృతి, హిందూ సంప్రదాయంతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు.

‘‘అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో స్థాపించారు. అంతకుముందు ఈ నగరం లేదా? అంతకుమందు హరిఘర్ తన సంస్కృతి, వారసత్వంతో కొనసాగింది. అందుకే దీనికంటే గొప్ప విషయం ఏముంటుంది? హరి పిల్లలు హరిఘర్‌ను పొందలేకపోతే సౌదీ అరేబియా, కజికస్తాన్, పాకిస్తాన్ పిల్లలు పొందుతారా ? ’’ అని నీరజ్ శర్మ ప్రశ్నించారు.

నీరజ్ శర్మ
ఫొటో క్యాప్షన్, నీరజ్ శర్మ

మనోభావాలను రెచ్చగొట్టే కుట్ర

అలీఘర్ పేరు మార్చాలంటూ మున్సిపల్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఆ నగరంలో ని హైదర్‌ఖాన్ అనే యువకుడు అసంతృప్తిగా ఉన్నారు.

‘‘నాకీ నగరం పేరు హరిఘర్‌గా మారడం ఇష్టం లేదు. అలీఘర్ పుట్టినప్పటి నుంచి దానికాపేరు ఉందా లేదా అని బీజేపీవారిని అడిగితే బావుంటుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇంతకుముందు కూడా అలీఘర్ పేరు ఉంది.’’ హైదర్ ఖాన్ చెప్పారు.

‘‘పేరు మార్పు వలన సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే ఆ పనే చేయండి. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి తమ పేర్లు మార్చుకున్నారని చెపుతుంటారు. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తారా’’? అని అయన ప్రశ్నించారు.

ప్రతిపక్షాలు లేనప్పుడు బీజేపీ ఈ తీర్మానాన్ని మోసపూరితంగా ఆమోదించుకుందని అలీఘర్ ముస్లీం బోర్డుసభ్యుడు, ప్రతిపక్ష సమాజ్ ‌వాదీ పార్టీకి చెందిన ముష్రాఫ్ హుస్సేన్ మెహ్జర్ చెప్పారు.

‘‘ఇది బీజేపీ బలవంతంగా పేర్లు మార్చే విధానంలో భాగం. పదిహేనేళ్ళుగా అలీఘర్ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా పార్టీ మున్సిపల్ బోర్డులో ప్రతిపక్షంగా ఉన్నంతకాలం అలీఘర్ పేరు అలీఘర్‌గానే ఉంటుంది. అలాగే ఉంటుంది కూడా’’ అని తెలిపారు.

అలీఘర్ నగరంలోని వృద్ధుడు, మున్సిపల్ మాజీ మెంబరు ముజఫర్ సయీద్ మాట్లాడుతూ పేరు మార్పు తీర్మానం ఓ కుట్ర అని చెప్పారు.

‘‘అలీఘర్ పేరును హరిఘర్‌గా మార్చినంత మాత్రానా సమస్యలు తీరిపోతాయా? ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా? 2024 ఎన్నికల ముందు మనోభావాలను రెచ్చగొట్టేందుకు జరుగుతున్న కుట్ర’’ అని తెలిపారు.

గతంలో ఏయే నగరాల పేర్లు మార్చారు

అలీఘర్ పేరును హరిఘర్‌గా మార్చాలనే ప్రతిపాదన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే అలీఘర్ పేరు మారిపోతుంది.

ఇంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, మొఘల్‌సరాయ్‌ను దీనదయాళ్ ఉపాధ్యాయ నగర్‌గానూ, ఫైజాబాద్‌ను అయోధ్యగానూ మార్చారు.

ఇంకా అనేక నగరాలు, పట్టణాల పేర్లు మార్చాలనే సూచనలు చాలానే ఉన్నాయి.

ఇతర రాష్ట్రాలలో కూడా ముస్లింల పేరుతో ఉన్నవాటిని మార్పుచేసే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇటీవల హరియాణాలోని కొన్ని గ్రామాల పేర్లు కూడా మర్చారు.

మహారాష్ట్రలో ఔరంగజేబు అనంతరం ఔరంగాబాద్‌ అయిన నగరాన్ని ఛత్రపతి శంభాజీ నగర్ గానూ, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గానూ మార్చారు.

దిల్లీలో ఔరంగజేబు పేరుమీదున్న ఓ రోడ్డుకు కూడా పేరు మార్చారు.

ముస్లింల ఆక్రమణకు గురైన నగరాలు, పట్ణణాలకు వారి పేర్లు ఉండకూడదనేది బీజేపీ వ్యూహం.

అలీఘర్ ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమభాగంలోని ఓ నగరం.

ఈ నగరం తాళాల పరిశ్రమకు, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి ప్రసిద్ధిగాంచింది.

కాలక్రమంలో తాళాల పరిశ్రమ బలహీనపడినా, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం మాత్రం వృద్ధి చెందుతూనే ఉంది.

అలీఘర్ వర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం(సెంట్రల్ యూనివర్సిటీ). దీనికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంటుంది. అలీఘర్ సిటీ పేరుతోనే ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది.

అలీఘర్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలీఘర్ యూనివర్సిటీలో ఒకనాటి స్నాతకోత్సవం

అలీఘర్ యూనివర్సిటీ చరిత్ర ఏంటి?

ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పేరు అలీఘర్ యూనివర్సిటీగానే ఉంటుందా లేక అలీఘర్ నగరం హరిఘర్ గా మారితే యూనివర్సిటీ పేరు కూడా మార్చుతారా అనేది చెప్పలేం.

ఈ యూనివర్సిటీని ప్రసిద్ధ ముస్లిం సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 19వ శతాబ్దంలో స్థాపించారు.

1857 తిరుగుబాటు తరువాత భారతదేశ పరిపాలనపై పూర్తి పట్టుసాధించిన బ్రిటీషువారు ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, పరిసరప్రాంతాలలోని వేలాదిమంది ముస్లింలను తిరుగుబాటు తదితర కారణాలపై ఉరితీశారు.

ఆధునిక విద్యను ముస్లింలు తిరస్కరిస్తున్న కాలమది.

ఆధునిక విద్యవైపు ముస్లింలను నడిపించడానికి, ఇస్లాంలోని హేతుబద్ధతను ప్రమోట్ చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఓ ఉద్యమమే నడిపారు.

ఈ ఉద్యమం కింద ఆయన 1875లో అంగ్లో మహ్మడన్ ఓరియంటల్ కళాశాలను అలీఘర్ లో నెలకొల్పారు.

ముస్లింలలోని మధ్యతరగతి వర్గానికి విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన ఈ కళాశాల తరువాత కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది.

భారత స్వతంత్ర పోరాటంలో ఈ వర్సిటీ జాతీయవాద రాజకీయాలకు ఓ ఇరుసులా పనిచేసింది.

మరోపక్క కమ్యూనిస్టు భావాలనూ ప్రశంసించేది. ప్రగతిశీల సిద్ధాంతాలకు ఈ యూనివర్సిటీ కేంద్రంగా ఉంది.

అలీఘర్ ముస్లీం యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని సవాల్ చేస్తూ, ఇతర కేంద్రీయ యూనివర్సిటీల కోవలోకే దీనిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి.

అలీఘర్ చరిత్రకు సంబంధించి 18వ శతాబ్దానికి మునుపు ఈ నగరం పేరు కాల్, లేదా కోలీ అని, ప్రస్తుత విస్తీర్ణమే కాక, పరిసరప్రాంతాలు కూడా ఈ నగరంలో భాగంగా ఉండేవని ఉత్తరప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ తెలుపుతోంది.

ఈ వెబ్‌సైట్ ప్రకారం ఈ నగరం వివిధ కాలాల్లో వివిధ పాలకుల పరిపాలనలో ఉంది. 19వ శతాబ్దంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఓ ముఖ్యమైన నగరంగా ఎదిగింది.

అలీఘర్ నగరంతోపాటు, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ముస్లిం రాజకీయాలకు, సంస్కృతికి గడిచిన శతాబ్దంలో కేంద్రంగా ఉంది.

బహుశా ఇందుకే భారత మత రాజకీయాలకు ఈ యూనివర్సిటీ బలవుతోందని ఓ కొంతమంది నిపుణులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)