మియన్మార్: పెను భూకంపం వచ్చినా తిరుగుబాటుదారులపై బాంబు దాడులు ఆపని సైనిక ప్రభుత్వం

- రచయిత, రెబెకా హెన్ష్‌కె
- హోదా, బీబీసీ ప్రతినిధి
మియన్మార్‌లో భూకంపం వచ్చి వందలమంది చనిపోయినా, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలపై బాంబు దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది అక్కడి సైనిక జుంటా ప్రభుత్వం.
ఈ దాడులను అత్యంత అమానవీయమైన, ఆమోదయోగ్యంకాని దాడులుగా అభివర్ణించింది ఐక్యరాజ్య సమితి.
భూకంపం తర్వాత ప్రజలను రక్షించే పనులు కొనసాగుతుండగానే, తిరుగుబాటుదారులపై దాడులు కొనసాగించడం దారుణమని, నమ్మలేని విషయమని బీబీసీతో అన్నారు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్.
దాదాపు నాలుగు సంవత్సరాల కిందట తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంది సైన్యం.
ప్రస్తుత పరిస్థితులలో అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆండ్రూస్ పిలుపునిచ్చారు.
"సైనిక ప్రభుత్వాన్ని ఒప్పించగల వారెవరైనా దానిపై ఒత్తిడి తెచ్చి, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పాలి" అని టామ్ ఆండ్రూస్ అన్నారు.
ఉత్తరాన షాన్ రాష్ట్రంలోని నౌంగ్చోలో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు మరణించారని బీబీసీ బర్మీస్ ధ్రువీకరించింది. భూకంపం వచ్చిన మూడు గంటల తర్వాతే ఈ దాడి జరిగింది.


ఫొటో సోర్స్, BBC Burmese Service
వాయువ్యాన ఉన్న సగైంగ్ ప్రాంతం భూకంప కేంద్రం. ఇక్కడి చాంగ్-యు టౌన్‌షిప్‌లో కూడా వైమానిక బాంబు దాడులు జరిగాయని సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు గ్రూపులు వెల్లడించాయి. థాయిలాండ్ సరిహద్దుల సమీపంలో కూడా వైమానిక దాడులు జరిగినట్లు నివేదికలు ఉన్నాయి.
సగైంగ్‌ను 7.7 తీవ్రతతో తాకిన భూకంపం పొరుగు దేశాలకు కూడా పాకింది. దాని తర్వాత సమీపంలోనే మాండలే నగరం భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైంది.
అలాగే అక్కడికి సుమారు 250 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న రాజధాని నైపీడాలో విధ్వంసం ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి.
ఇప్పటి వరకు 1644 మంది మరణించారని, ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నట్లు సైనికాధికారులు చెబుతున్నారు.
2021లో సైన్యం తిరుగుబాటు తర్వాత మియన్మార్‌లో నాలుగు సంవత్సరాలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ తిరుగుబాటు భారీ నిరసనలకు దారితీసింది.
రోజూ వేలమంది వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్య అనుకూల వాదుల ఉద్యమంగా మొదలైన ఆందోళనలు చివరకు జాతుల మధ్య ఘర్షణలతో పూర్తిస్థాయి అంతర్యుద్ధానికి దారితీసింది.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు సంవత్సరాల తరువాత కూడా సైన్యం, మరోవైపు వివిధ తెగల సైన్యాలు, సాయుధ గ్రూపుల మధ్య హింసాత్మక పోరాటం కొనసాగుతోంది.
అనేక పరాజయాలను చవిచూసిన సైన్యం, ప్రతిఘటనను అణచివేయడానికి వైమానిక దాడులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
భూకంపానికి కేంద్రంగా ఉన్న సగైంగ్‌లోని చాలా ప్రాంతాలు ప్రజాస్వామ్య అనుకూల గ్రూపుల ఆధీనంలో ఉన్నాయి.
తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, సైన్యం ఇప్పుడు దేశంలో పావువంతు కంటే తక్కువ ప్రాంతంపై నియంత్రణను సాధించగలిగిందని బీబీసీ పరిశీలనలో తేలింది.
తిరుగుబాటు వర్గాలు దేశంలోని దాదాపు 42% భూభాగాన్ని నియంత్రిస్తున్నాయని, మిగిలిన ప్రాంతంలోని ఎక్కువ భాగంలో ఆధిపత్యం కోసం వివిధ వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతున్నట్లు తేలింది.
వైమానిక పోరాటంలో సైనిక పాలకులు పైచేయి సాధించారు. సాయుధ ప్రతిఘటన దళాలకు వైమానిక దాడులు చేసేంత సామర్థ్యం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పాఠశాలలు, మఠాలు, చర్చిలు, ఆసుపత్రులపై బాంబులు వేసి వాటిని నాశనం చేసిన చరిత్ర సైన్యానికి ఉంది. అత్యంత ఘోరమైన వైమానిక దాడులలో ఒకటిగా చెప్పే ఓ దాడిలో మహిళలు, పిల్లలు సహా 170 మందికి పైగా మరణించారు.
దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ సైనిక జుంటా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై యుద్ధ నేరాలకు పాల్పడుతోందని హెచ్చరించింది.
రష్యా, చైనాల మద్ధతుతో సైన్యం వైమానిక దాడులను కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు సైనిక సైనిక దళాల అధునాతన జెట్‌లను విక్రయించాయి. వాటి వినియోగానికి ట్రైనింగ్ కూడా ఇచ్చాయి.
భూకంపం తర్వాత రష్యా, చైనాలు రెస్క్యూ టీమ్‌లను మియన్మార్‌కు పంపాయి. ‘‘అవి సైనిక ప్రభుత్వానికి ఆయుధాలు అందించే దేశాలు. ఇప్పుడు వారి సానుభూతిని నమ్మడం కష్టం'' అని యూకేకు చెందిన బర్మీస్ హక్కుల కార్యకర్త జూలీ ఖైన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెస్క్యూ ఆపరేషన్లను కూడా సైన్యం తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆందోళన ఉంది. ప్రతిఘటన గ్రూపులకు పట్టున్న ప్రాంతాలలో సహాయాన్ని నిరాకరించిన చరిత్ర సైనిక పాలకులకు ఉంది. ఇది చాలా ఏళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం.
గతంలో సహాయ చర్యలను సైన్యం అడ్డుకుందని, రెస్క్యూ సిబ్బందిని అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని బీబీసీతో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి టామ్ ఆండ్రూస్ అన్నారు.
"గత మానవతా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుంచి మనకు తెలిసిన విషయం ఏంటంటే, సైన్యం నిజాలను చెప్పదు, మానవతా సహాయం అవసరమైన చోటికి చేరకుండా నిరోధించే అలవాటు కూడా దీనికి ఉంది" అని టామ్ ఆండ్రూస్ అన్నారు.
"ఈ విపత్తు విషయంలో కూడా అదే జరుగుతుందనుకుంటున్నాను." అన్నారు ఆండ్రూస్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














