కంబోడియా క్యాసినోలో చెలరేగిన మంటలు... 19 మంది మంది మృతి

కంబోడియా క్యాసినోలో అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ భవంతిలో సుమారు 400 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు

కంబోడియాలో ఒక క్యాసినో-హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

థాయిలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రాండ్ డైమండ్ సిటీ భవనంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక మంటలు చెలరేగినప్పుడు వందలాది మంది ఉన్నారు.

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హోటల్‌ పై అంతస్తుల నుంచి కొందరు కింద పడిపోయారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి దూకడం కూడా వీడియోల్లో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

హోటల్ క్యాసినోలో 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది థాయ్‌ దేశస్థులు.

చాలా మంది బాధితులు భవంతి పై అంతస్తుల్లోనే చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారు అసలు ప్రాణాలతో బయటపడతారని తాము అనుకోలేదని థాయ్ స్వచ్ఛంద సంస్థ రౌమకాటన్యూ ఫౌండేషన్ చెప్పింది.

19 మంది చనిపోయారని, వారి మృతదేహాలను, ఎముకలను చూసినట్లు కంబోడియా స్థానిక సమాచార విభాగం తెలిపింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈ విభాగం పేర్కొంది.

దట్టమైన పొగ వ్యాపించడంతో భవంతి లోపలున్న ప్రజలను చేరుకునేందుకు సహాయక బృందాలకు కష్టమైంది. మంటల్లో చిక్కుకుని ఉన్న వారి గురించి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

కంబోడియా, థాయిలాండ్ దేశాలను దాటేందుకు మధ్యలో ఉన్న ప్రాంతమే పోయ్‌పెట్‌. క్యాసినోలతో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ అక్రమం కావడంతో, చాలా మంది థాయ్ దేశస్తులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు.

ఈ భవనం థాయ్ సరిహద్దుకు వెనుకాలే ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన చాలా మందిని చికిత్స కోసం సరిహద్దు అవతలి ప్రాంతాలకు తరలించారు. కొందర్ని సమీపంలో ఉన్న అరణ్యప్రతేట్ పట్టణ ఆసుపత్రుల్లో చేర్చారు.

అయితే, ఎంత మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారో స్పష్టంగా తెలియలేదు. స్థానిక అధికారులు, మీడియాలో వస్తున్న వార్తా కథనాల్లో గాయపడిన వారి సంఖ్య భిన్నంగా ఉంది.

ఈ అగ్నిప్రమాదానికి కారణమేంటనే దాన్ని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)