దిల్లీలో ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమా, ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి?

రాహుల్ గాంధీ, కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బీజేపీకి 45.56 శాతం, ఆప్‌కు 43.57 శాతం, కాంగ్రెస్‌కు 6.34 శాతం ఓట్లు వచ్చాయి
    • రచయిత, మానసీ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

70 సీట్లు ఉన్న దిల్లీలో బీజేపీ 48 సీట్లతో మెజారిటీ సాధించగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకు పడిపోయింది.

ఓట్ల శాతం గురించి మాట్లాడుకుంటే, బీజేపీకి 45.56 శాతం ఓట్లు రాగా, ఆప్‌కు 43.57 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక్కడ మూడో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఆ పార్టీ ఓట్ల శాతం 6.34కి పెరిగింది.

2020 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.63 శాతం ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కాంగ్రెస్ ఓట్ల కంటే తక్కువ. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీచేశాయి. కానీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేరు వేరుగా పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే, ఓట్లు చీలిపోకుండా ఫలితాలు కొంత భిన్నంగా ఉండేవన్న విశ్లేషణలు వస్తున్నాయి.

మొత్తం బీజేపీ గెలిచిన 48 సీట్లలో 14 చోట్ల విజేతల ఆధిక్యం కంటే కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజల సుఖసంతోషాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని ఓటమి తర్వాత కేజ్రీవాల్ చెప్పారు.

న్యూ దిల్లీ

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన బీజేపీకి చెందిన ప్రవేశ్ సింగ్ వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2013లో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను ఓడించి కేజ్రీవాల్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు.

షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆయనకు మొత్తం 4,568 ఓట్లు వచ్చాయి.

బీజేపీ ఆధిక్యం కన్నా 479 ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్‌కు వచ్చాయి.

మనీశ్ సిసోడియా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మనీశ్ సిసోదియా

జంగ్‌పుర

ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పోటీ చేశారు. ఆయన 675 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

బీజేపీకి చెందిన తర్విందర్ సింగ్ మార్వా ఇక్కడి నుంచి గెలిచారు.

ఈ స్థానంలో ఆప్ ఓటమిలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించింది. ఆ పార్టీ అభ్యర్థి ఫర్హాద్ సూరికి 7,350 ఓట్లు వచ్చాయి.

మనీశ్ సిసోదియా 2013 నుంచి వరుసగా మూడుసార్లు పట్పడ్‌గంజ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సారి ఆయన తన సీటు మార్చుకున్నారు.

2024లో పార్టీలో చేరిన అవధ్ ఓజాకు పట్పడ్‌గంజ్ నుంచి టికెట్ ఇచ్చారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఈ ప్రయోగం అటు అవధ్ ఓజాకు కానీ ఇటు మనీశ్ సిసోదియాకి కానీ ప్రయోజనం కలిగించలేదు.

గత మూడు సార్లనుంచి, జంగ్‌పురా అసెంబ్లీ స్థానంలో ఆప్ గెలుస్తోంది. ఈసారి కోల్పోయింది.

గ్రేటర్ కైలాశ్

బీజేపీకి చెందిన శిఖా రాయ్ ఇక్కడ గెలిచారు. ఆమె తన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను 3,188 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి మొత్తం 6,711 ఓట్లు వచ్చాయి.

సౌరభ్ భరద్వాజ్ ఇక్కడి నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకు ముందు, అంటే 2008లో బీజేపీ ఇక్కడ గెలిచింది.

మాలవీయ నగర్

ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమనాథ్ భారతి ఈ సీటును కోల్పోయారు. ఆయన బీజేపీకి చెందిన సతీశ్ ఉపాధ్యాయ్ చేతిలో 2,131 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సతీశ్ ఉపాధ్యాయ్ 2014, 2016లో దిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర కుమార్ కొచ్చర్‌కు 6,770 ఓట్లు వచ్చాయి.

మదిపుర్

ఇక్కడా బీజేపీ గెలిచింది. కైలాశ్ గంగ్వాల్‌కు 52019 ఓట్లు వచ్చాయి. ఆయన ఆప్ అభ్యర్థిపై 10,899 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఖీ బిర్లాన్‌కు 41,120 ఓట్లు వచ్చాయి.. కాంగ్రెస్ అభ్యర్థి జెపి పన్వర్‌కు 17,958 ఓట్లు వచ్చాయి.

1998, 2003, 2008లలో వరుసగా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని 2013లో ఆప్ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన గిరీశ్ సోనీ ఈ స్థానాన్ని మూడుసార్లు గెలుచుకున్నారు. కానీ ఈసారి పార్టీ తన అభ్యర్థిని మార్చి రాఖీ బిర్లాన్‌కు టికెట్ ఇచ్చింది. రాఖీ బిర్లాన్ మంగోల్‌పురి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఛతర్‌పుర్

ఈ సీటు 6,239 ఓట్ల తేడాతో బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.

ఇక్కడ బీజేపీకి చెందిన కర్తార్ సింగ్ తన్వర్‌కు 80,469 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బ్రహ్మ్ సింగ్ తన్వర్ 6,239 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర సింగ్ తన్వర్‌కు 6,601 ఓట్లు వచ్చాయి.

దేవేంద్ర యాదవ్‌

ఫొటో సోర్స్, Devender Yadav @Fb

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర యాదవ్‌కు 41,017 ఓట్లు వచ్చాయి.

బద్లీ

బద్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అహిర్ దీపక్ చౌధరీ తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అజేశ్ యాదవ్‌ను 15,163 తేడాతో ఓడించారు. అజేశ్‌కు 46029 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీచేసిన దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌కు 41,017 ఓట్లు వచ్చాయి. అజేశ్ కంటే 4,958 ఓట్లు మాత్రమే తక్కువ.

త్రిలోక్‌పురి

బీజేపీ ఆధిక్యం చాలా తక్కువగా ఉన్న సీట్లలో సంగం విహార్‌తో పాటు త్రిలోక్‌పురి ఒకటి.

ఈ స్థానంలో బీజేపీకి చెందిన రవికాంత్ ఆప్ అభ్యర్థి అంజనా పార్చాను 392 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అమర్‌దీప్‌కు 6,147 ఓట్లు వచ్చాయి.

కస్తూర్బా నగర్

ఈ స్థానాన్ని బీజేపీకి చెందిన నీరజ్ బసోయా 11,048 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఇక్కడ, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ దత్‌కు 27,019 ఓట్లు, ఆప్ అభ్యర్థి రమేశ్ పహిల్వాన్‌కు 18,617 ఓట్లు వచ్చాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మదన్ లాల్ 2013, 2015, 2020లలో ఇక్కడి నుంచి గెలిచారు. కానీ ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేర్వేరుగా పోటీచేయడం వల్ల కాంగ్రెస్,ఆప్‌ రెండూ నష్టపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నాంగ్‌లోయి జాట్

పశ్చిమ దిల్లీలోని ఈ స్థానాన్ని బీజేపీకి చెందిన మనోజ్ కుమార్ షోకీన్ 26,251 ఓట్ల ఆధిక్యతతో గెలుచుకున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రఘువీందర్ షోకీన్‌ను ఓడించారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చౌదరికి 32,028 ఓట్లు రావడం బీజేపీ విజయానికి ప్రధాన కారణం.

గత రెండు సార్లు రఘువీందర్ షోకీన్ ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న 32వేల ఓట్లు ఆప్ ఓడిపోయేలా చేశాయి.

మెహరౌలీ

దక్షిణ దిల్లీలోని ఈ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ యాదవ్ 1,782 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహేంద్ర చౌధరీని ఓడించారు.

ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పుష్ప సింగ్, స్వతంత్ర అభ్యర్థి బాలయోగి బాబా బాలక్‌నాథ్ కీలక పాత్ర పోషించారు. బాలక్‌నాథ్‌కు 9,731 ఓట్లు రాగా, నాల్గవ స్థానంలో నిలిచిన పుష్పసింగ్‌కు 9,338 ఓట్లు వచ్చాయి.

ఆప్‌కు చెందిన నరేష్ యాదవ్ 2015, 2020లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈసారి, ఎన్నికలకు ముందు, 2025 జనవరి 31న, ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

కేజ్రీవాల్, దిల్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్

తిమార్‌పుర్

ఈ సీటులో చాలా గట్టి పోటీ కనిపించింది. బీజేపీ 1,168 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. బీజేపీకి చెందిన సూర్య ప్రకాష్ కాత్రి మొత్తం 55,941 ఓట్లు పొంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేందర్ పాల్ సింగ్ (బిట్టూ)ను ఓడించారు. బిట్టూకు 54,773 ఓట్లు వచ్చాయి. వీరి మధ్య తేడా కేవలం 1,168 ఓట్లు కాగా, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లోకేంద్ర కళ్యాణ్ సింగ్ 8,361 ఓట్లు పొందారు.

రాజేందర్ నగర్

ఈ స్థానంలో బీజేపీ గెలుపు తేడా 1,231 ఓట్లు మాత్రమే.

ఇక్కడి నుంచి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌, బీజేపీకి చెందిన ఉమాంగ్ బజాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను ఓడించారు.

కాంగ్రెస్ తరపున తొలిసారి పోటీ చేసిన వినీత్ యాదవ్ ఈ స్థానంలో మొత్తం 4,015 ఓట్లు పొందారు.

సంగం విహార్

ఈ సీటుపై పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ గెలుపు తేడా చాలా తక్కువ... అంటే కేవలం 344 ఓట్లు మాత్రమే.

బీజేపీకి చెందిన చందన్ కుమార్ చౌధరీకి మొత్తం 54,049 ఓట్లు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దినేశ్ మోహానియా ఆయన కంటే 344 ఓట్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు.

దినేశ్ గత మూడు సార్లుగా ఈ సీటును గెలుచుకుంటున్నారు కానీ ఈసారి ఆయన ఓడిపోయారు.

ఈ స్థానంలో గెలుపోటముల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీకి చెందిన హర్ష్ చౌధరి 15,863 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు.

సంజయ్ రౌత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేసి ఉండాలని ఇండియా కూటమి నేతలు అన్నారు.

ఇండియా కూటమి నేతలు ఏమన్నారు?

ఇండియా కూటమిలో భాగమైన కొన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీచేయడంపై విమర్శలు గుప్పించారు.

''ఆప్, కాంగ్రెస్‌లకు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ. రెండూ కలిసి ఉంటే, కౌంటింగ్ మొదటి గంటలోనే బీజేపీ ఓటమిపై స్పష్టతవచ్చేది''అని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు.

''ఇండియా కూటమి పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఇది జరిగింది.దిల్లీ ఎన్నికల ఫలితాలు గుణపాఠం చెబుతున్నాయి'' అని కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన డి.రాజా అన్నారు.

''కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కూటమిని ఎలా బలోపేతం చేయాలో చూడాలి. ఇది అందరికీ పెద్ద సవాలు'' అని ఆయనన్నారు.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఈ ఫలితాలపై తీవ్రంగా కలత చెందారు.

''మీలో మీరు ఎక్కువగా తన్నుకోండి" అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ''ఒకరినొకరు అంతం చేసుకోండి'' అని వీడియోలో రాసిఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)