దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి కేంద్ర బడ్జెట్ కలిసొచ్చిందా?

దిల్లీ ఎన్నికలు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ వ్యతిరేకత, పాలనా అలసత్వం, బీజేపీ అలుపులేని పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాయి.

దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న తర్వాత, ప్రజల్లో ఆప్ మీద ఆకర్షణ తగ్గిపోయింది. ప్రత్యేకంగా మధ్య తరగతి వర్గాలలో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా కేజ్రీవాల్‌కున్న ప్రతిష్ఠ మసకబారింది. ఒకప్పుడు మధ్య తరగతి ప్రజల నాయకత్వంలో మొదలైన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన చాంపియన్. అదే ఆయన స్థాపించిన పార్టీని పేదల్లోకి తీసుకెళ్లింది. అయితే పేదలు, కార్మిక వర్గం ఆయనను ఎప్పుడు వదిలేసిందో స్పష్టంగా తెలియదు.

అవినీతి ఆరోపణలు, కీలక నేతలు జైలుకు వెళ్లడం, కేజ్రీవాల్ అరెస్ట్ లాంటివి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని దెబ్బ తీశాయి. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఏర్పడిన శూన్యతను బీజేపీ చాలా త్వరగా తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది.

భారతీయ జనతాపార్టీకి ఉన్న విస్తృత వనరులు, ప్రభావ వంతమైన ఎన్నికల యంత్రాంగం, డబుల్ ఇంజిన్ అనే ప్రచారాస్త్రంలాంటివి దిల్లీ ప్రజలను ఆకర్షించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి చరిత్రాత్మక విజయం

బీజేపీకి ఇది చరిత్రాత్మక విజయం. 30 ఏళ్లలో బీజేపీ ఇన్ని సీట్లు సాధించడం ఇదే తొలిసారి. మార్పు అనే ఆ పార్టీ సందేశం ప్రజల్లో భావోద్వేగాన్ని రాజేసింది. బీజేపీకున్న రాజకీయ ఆర్థిక బలం ఈ భావోద్వేగానికి కలగలసి విజయాన్ని తీసుకువచ్చింది.

గతేడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీకి జరిగిన నష్టం నుంచి హరియాణా, మహారాష్ట్ర, తాజాగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో ఆ పార్టీ పుంజుకుంది. దిల్లీ చేజారి పోవడంతో ఇప్పటికే చిన్నాభిన్నమైన ఇండియా కూటమి ఇప్పుడు మరింత గందరగోళంలో పడింది. తర్వాతి ఎన్నికను ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో ఉంది

దిల్లీకి ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ ఉంది. ప్రజా పాలన, పోలీసు, భూములకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర శాసన వ్యవస్థ విద్య, ఆరోగ్యం, ప్రజా సేవలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

రాష్ట్రంలో ఒకరు, కేంద్రంలో ఒకరు అధికారంలో ఉండటంతో పాలనా పరమైన వ్యవహారాల్లో తరచుగా ఘర్షణ కనిపిస్తోంది.

కేజ్రీవాల్

దిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు రాజకీయ, ప్రాంతీయ అంశాల కంటే సంక్షేమం మీద దృష్టి పెట్టడానికి కారణం దిల్లీకున్న ప్రత్యేకమైన అధికారిక వ్యవస్థ. ఇదే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని దేశంలో మిగతా ప్రాంతాల కంటే భిన్నమైనదిగా మార్చింది.

మహిళలకు నగదు పంపిణీ, ఆరోగ్యం, ప్రభుత్వ విద్యలాంటి అంశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పోటీ పడి వాగ్దానాలు చేశాయి.

హామీలివ్వడంతో పాటు బీజేపీ గత వారం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ను కూడా ఈ ఎన్నికలకు అనుకూలంగా మలచుకుంది. మధ్య తరగతిలో ఉద్యోగ వర్గాలను సంతృప్తి పరిచేలా ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో వీరి ఓట్లు బాగానే ఉన్నాయి.

దిల్లీ ప్రజలకు సంక్షేమం, సౌకర్యాలు కల్పిస్తామంటూ వారాల తరబడి సాగిన ప్రచారం విజయం సాధించినా, ఒక విషయాన్ని మాత్రం పార్టీలేవీ పట్టించుకోలేదు. అదే దిల్లీలో కాలుష్యం. ధనిక, పేద అనే తేడా లేకుండా దిల్లీలోని మూడు కోట్ల మందిని ఈ సమస్య బాధిస్తోంది.

తాము గెలిస్తే దిల్లీ కాలుష్యాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 2030 నాటికి సగానికిపైగా తగ్గిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇతర పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశం గురించి ప్రస్తావించాయి. అయితే ఎన్నికల ప్రచారంలో కానీ, చర్చల్లో కానీ ఎక్కడా ఈ అంశానికి అవసరమైనంత ప్రాధాన్యం దక్కలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)