ఆయనా? ఆమెనా? దిల్లీ సీఎం ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది.
27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ దిల్లీలో అధికారం చేపడుతోంది.
అంతకుముందు, 1993 అసెంబ్లీ ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ 70 సీట్లకు 49 సీట్లు గెలుచుకుంది.
ఇప్పుడు బీజేపీకి 48 సీట్లు వచ్చాయి. 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో 22 సీట్లు వచ్చాయి.
అయితే, ఎన్నికలకు ముందు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు.
దీంతో ఫలితాల తరువాత ఇప్పుడు దిల్లీ సీఎం ఎవరనే చర్చ మొదలైంది?


ఫొటో సోర్స్, ANI
ప్రవేశ్ వర్మ రాజకీయ నేపథ్యం ఏంటి?
మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.
న్యూదిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవేశ్ వర్మ, అరవింద్ కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ప్రవేశ్ వర్మ భారతీయ జనతా పార్టీలో పంజాబీ జాట్ నేత. ఆయన 'రాష్ట్రీయ స్వయం' అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
ప్రవేశ్ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ దిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. దిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో ఈ కుటుంబం ఒకటి.
ప్రవేశ్ వర్మ మామ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. 2013లో ముండ్కా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.
ప్రవేశ్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. ప్రవేశ్ వర్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రవేశ్ వర్మ 2013లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి మెహ్రౌలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ దిల్లీ నుంచి వర్మ ఐదు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
ఆయన్ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయించింది. ఇప్పుడు ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, ANI
జాట్ కోటాలో ప్రవేశ్ వర్మ ఎంపికవుతారా?
ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలను ప్రవేశ్ వర్మ తీవ్రంగా విమర్శించారు. కాలుష్య సమస్య, మౌలిక సదుపాయాలు సహా అనేక అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎన్నికల్లో వనరుల దుర్వినియోగం, యమునా నది కాలుష్యం, ముఖ్యమంత్రి అధికారిక నివాసం 'శీష్ మహల్' ఆరోపణలపై కూడా ఆయన కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రవేశ్ వర్మ 1977లో జన్మించారు. దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు.
కిరోడిమల్ కళాశాల నుంచి బీఏ డిగ్రీ, ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
బీజేపీకి చెందిన కోటీశ్వరులైన ఎమ్మెల్యేలలో ప్రవేశ్ వర్మ ఒకరు.
ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం, ఆయన మొత్తం ఆస్తులు రూ.115 కోట్లకు పైగా ఉన్నాయి.
తన దూకుడు ప్రకటనల కారణంగా ఆయనను అనేకసార్లు వివాదాలు చుట్టుముట్టాయి. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. దీంతో ఎన్నికల సంఘం 24 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించింది.
2025 ఎన్నికల సమయంలో కూడా, ప్రవేశ్ వర్మ మహిళా ఓటర్లకు బూట్లు పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద ఆయనపై కేసు నమోదైంది.
''బీజేపీ తన తదుపరి ఎన్నికలకు మొదటి రోజు నుంచే సన్నాహాలు ప్రారంభిస్తుంది. తదుపరి ఎన్నికలు ఆ రాష్ట్ర ఎన్నికలు మాత్రమే కాదు, వేరే రాష్ట్ర ఎన్నికలు కూడా. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ ఓట్లు బీజేపీకి పడలేదని భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో, జాట్ నేతకు అవకాశం కల్పించడానికి బీజేపీకి ఇది ఒక అవకాశం. హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశ్ వర్మ వారికి ఉపయోగకరంగా ఉండవచ్చు" అని రాజకీయ విశ్లేషకుడు జై మృగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
వీరేంద్ర సచ్‌దేవా
వీరేంద్ర సచ్‌దేవా భారతీయ జనతా పార్టీ దిల్లీ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు.
1988 నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సచ్‌దేవా, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి, కోశాధికారిగా కూడా ఉన్నారు.
2009లో ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు, 2017లో రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే వీరేంద్ర సచ్‌దేవా దూకుడు వ్యూహంపై పని చేస్తున్నారు.
వీరేంద్ర సచ్‌దేవాను ఒక సంస్థాగత వ్యక్తిగా పరిగణిస్తారు.
ఆయన నాయకత్వంలోనే బీజేపీ దిల్లీ ఎన్నికలను ఎదుర్కొంది. దీంతో వీరేంద్ర సచ్‌దేవా కూడా ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు.
అయితే, సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా మాట్లాడుతూ, "సాధారణంగా ఏదైనా విజయానికి క్రెడిట్ అధ్యక్షుడికే చెందుతుంది, కానీ బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే విజయం క్రెడిట్ దక్కుతుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సిక్కు నాయకుడు మన్‌జిందర్ సింగ్ సిర్సాకు అవకాశముందా?
సిక్కు సమాజంలో ప్రభావవంతమైన బీజేపీ నాయకుడు మన్‌జిందర్ సింగ్ సిర్సాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పార్టీ పరిశీలించవచ్చు. సిక్కు సమాజం నుంచి బీజేపీకి ప్రముఖ నేత లేరు.
సిర్సా దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షునిగా కూడా ఉన్నారు.
రాజౌరి గార్డెన్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచిన మంజిందర్ సింగ్ సిర్సా, గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దిల్లీ ముఖ్యమంత్రి పదవికి సిర్సా కూడా బలమైన పోటీదారుడని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా ఆయన సహాయంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కు ఓటర్లను ఆకర్షించడానికి వారు సన్నాహాలు ప్రారంభించవచ్చు.
సిర్సా అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు కూడా చాలా సన్నిహితుడు.

ఫొటో సోర్స్, ANI
విజేంద్ర గుప్తాను పదవి వరిస్తుందా?
దిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని చెబుతున్నారు.
ఆయన వైశ్య సమాజం నుంచి వచ్చారు. దిల్లీలో వైశ్య సమాజం పెద్ద సంఖ్యలో ఉంది.
కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజేంద్ర గుప్తా పోరాడారు.
ఆయన రోహిణి స్థానం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈసారి ఆయన దాదాపు 38 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కూడా.
విజేంద్ర గుప్తా రాజకీయ ప్రయాణం 1997లో ప్రారంభమైంది. ఆయన మొదటిసారి దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
రేఖా గుప్తా ముఖ్యమంత్రి అవుతారా?
ఈ జాబితాలో రేఖా గుప్తా పేరు కూడా ఉందని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ మహిళను ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తే, ఆమె పోటీలో మొదటి వరుసలో ఉంటారు.
రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి దాదాపు 30 వేల ఓట్ల తేడాతో గెలిచారు.
2020 ఎన్నికల్లో ఆమె అదే సీటును స్వల్ప తేడాతో ఓడిపోయారు.
రేఖా గుప్తా దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు.
"రేఖా గుప్తా ద్వారా మహిళలు, వైశ్య సమాజం ఇద్దరికీ ప్రాతినిధ్యం వహించవచ్చ" అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అన్నారు.
అయితే బీజేపీ నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో పెద్దగా చర్చకు రాని వారిని ముఖ్యమంత్రులుగా చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














