దిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ బీజేపీకి లాభించిందా, ముస్తాఫాబాద్‌లో ఆప్ ఓటమికి ఎంఐఎం కారణమా?

ముస్తఫాబాద్‌, తాహిర్ హుస్సేన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముస్తఫాబాద్‌లో ప్రచారం చేస్తున్న తాహిర్ హుస్సేన్ (ఫైల్ ఫోటో)

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎంఐఎం రెండు స్థానాలలో పోటీ చేసింది. ముస్తాఫాబాద్, ఓక్లా నియోజకవర్గాలలో ఆ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ రెండు చోట్లా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కీలకమైన ముస్తాఫాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఆప్ ఓట్లను చీల్చిందని, తద్వారా బీజేపీ విజయం సాధ్యమైందనే చర్చ జరుగుతోంది.

ఎంఐఎం ముస్తాఫాబాద్‌లో దిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్‌ను బరిలోకి దించిననప్పుడే ఈ చర్చ మొదలైంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాక అది నిజమేనని సంగతి చాలావరకు రుజువైంది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ECI

ఫొటో సోర్స్, ECI

తాహిర్ హుస్సేన్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయి?

ముస్తఫాబాద్ బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్ పై 17,578 ఓట్ల తేడాతో విజయం సాధించారు.తాహిర్ హుస్సేన్ 33,474 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అలీ మెహందీకి కేవలం 11,763 ఓట్లు మాత్రమే వచ్చాయి.

బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్‌కు 42.36 శాతం ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్ కు 33.62 శాతం, ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్ కు 16.64 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ ఆయనకు మంచి ఓట్లు వచ్చాయి.

ఓట్ల చీలిక ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కలిగించిందని దిల్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ వినీత్ వాహి అన్నారు. దీంతో ఆప్ ముస్తఫాబాద్ వంటి స్థానాలను కోల్పోయింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో తాహిర్ హుస్సేన్ పోటీ తర్వాత ఓట్లు చీలిపోయి బీజేపీ గెలిచిందన్నారు.

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM), అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, @AIMIM_NATIONAL

ఫొటో క్యాప్షన్, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో తాహిర్ హుస్సేన్

పెరోల్‌పై వచ్చి ప్రచారం

దిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్ పెరోల్ పై వచ్చి ముస్తఫాబాద్ లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో సాయుధ దిల్లీ పోలీసులు అతని చుట్టూ ఉన్నారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా తాహిర్ హుస్సేన్ కోసం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు.

ఐదేళ్లుగా జైల్లో ఉన్న తాహిర్ హుస్సేన్ కు కోర్టు న్యాయం చేస్తుందని ఓటర్లకు చెబుతూనే ఉన్నారు. మీ ఓటుతో తాహిర్ హుస్సేన్ కు న్యాయం చేయాలి... తాహిర్ హుస్సేన్ గెలవకపోతే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు అని చెప్పారు.

ఎన్నికల ప్రచారం కోసం దాఖలైన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాహిర్ హుస్సేన్ కు ఆరు రోజుల కస్టడీ పెరోల్ మంజూరు చేసింది.

ముస్తఫాబాద్ ఓటర్లతో 'పోస్టర్లు, బ్యానర్లకు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. గాలిపటం గుర్తును మరచిపోవద్దు అని ఆయన ప్రచారం చేశారు.

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

2020లో ఆప్ గెలుపు

ఈశాన్య దిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ స్థానం 2008 డీలిమిటేషన్ తర్వాత ఉనికిలోకి వచ్చింది. గతంలో ఇది కరవాల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2020లో ఇక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హాజీ యూనస్ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ ఆదిల్ అహ్మద్ ఖాన్ ను బరిలోకి దింపింది.

మాజీ ఎమ్మెల్యే హసన్ మెహదీ కుమారుడు అలీ మెహదీకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా, భారతీయ జనతా పార్టీ ఈ స్థానం నుంచి కరవల్ నగర్ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ కు టికెట్ ఇచ్చింది.

2020 మతకలహాలకు కేంద్ర బిందువుగా ఉన్న ముస్తఫాబాద్‌లో 2.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముస్తఫాబాద్ లో 40 శాతం ముస్లింలు, 60 శాతం మంది హిందువులు ఉన్నారు.ఎంఐఎం తరపున తాహిర్ హుస్సేన్ బరిలోకి దిగడంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. తాహిర్ హుస్సేన్, ఎంఐఎంలు ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చాయని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపించాయి.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓట్ల చీలికపై బీబీసీ తాహిర్ హుస్సేన్ తో మాట్లాడినప్పుడు, తమ పార్టీ ఓటు బ్యాంకు అయితే కాంగ్రెస్, ఆప్ ఎందుకు రాజీపడలేదని ప్రశ్నించారు. ఇక్కడ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే నేను ఓట్లు చీల్చానని చెప్పడంలో అర్ధముంది. ఈసారి రెండు పార్టీలు (కాంగ్రెస్, ఆప్) తమను ఎలా తప్పుదోవ పట్టించాయో ప్రజలకు అర్థమైందన్నారు.

తాహిర్ హుస్సేన్ ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. చాలా మంది ఓటర్లు ఆయనపై సానుభూతి వ్యక్తం చేసి మంచి వ్యక్తి అని, అల్లర్ల సమయంలో స్థానిక ముస్లింలకు ఎంతో మద్దతు ఇచ్చారని చెప్పారు. అదే సమయంలో చాలా మంది ఓటర్లు తమ ఓటుతో బీజేపీకి లాభం చేకూరుతుందని భావించారు.

ఎన్నికలు

ఎవరీ తాహిర్ హుస్సేన్ ?

దిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో 2020 ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో 40 మంది ముస్లింలు, 13 మంది హిందువులు ఉన్నారని దిల్లీ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తాహిర్ హుస్సేన్ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ గా ఉన్నప్పటికీ అల్లర్లలో అతని పేరు తెరపైకి రావడంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.

అతనిపై ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్యతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 26న తాహిర్ హుస్సేన్ ఇంటి సమీపంలోని మురుగు కాల్వలో అంకిత్ శర్మ మృతదేహం లభ్యమైంది.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తాహిర్'పై దిల్లీ పోలీసులు 10 ఎఫ్ఐఆర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒకటి నమోదు చేశాయి.

బీబీసీతో మాట్లాడిన తాహిర్ తాను నిర్దోషినని, కోర్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

అఫిడవిట్ ప్రకారం ఆయనకు సుమారు రూ.42 లక్షల విలువైన చరాస్తులు, భార్యకు సుమారు రూ.43 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే ఆయనకు రూ.8.85 కోట్లు, భార్యకు రూ.9 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

తాహిర్ కుటుంబంలో భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమారుడి పేరు మహ్మద్ షాదాబ్ హుస్సేన్. తన తండ్రి కోసం కూడా ప్రచారం చేశారు. ఆయన కుమార్తె పేరు రఫియా జారా హుస్సేన్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)