దిల్లీ ఎన్నికలు: బీజేపీ 45, ఆప్ 21 స్థానాలలో విజయం

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి ఎన్నికల సంఘం మొత్తం 66 స్థానాల ఫలితాలు వెల్లడించింది. మరో 4 స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటిదాకా వెల్లడైన వివరాల ప్రకారం బీజేపీ 45స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 21 స్థానాల్లో విజయం సాధించాయి.
బీజేపీ 3 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రవేశ్ సాహిబ్ సింగ్ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
దిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి విజయం సాధించారు.
ఇక బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నాయకులు ఎక్కడ పోటీ చేశారు?
ఎలక్షన్ కమిషన్ అందించిన వివరాల ప్రకారం వారిలో ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు? ఎవరు పరాజయం అంచున ఉన్నారో చూద్దాం..


ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, ECI/SCREENGRAB
కేజ్రీవాల్‌పై ప్రవేశ్ వర్మ గెలుపు
న్యూదిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు.
ఈ స్థానంలో ఆయనపై బీజేపీ నుంచి ప్రవేశ్ సాహెబ్ సింగ్ వర్మ మొత్తం 14 రౌండ్లు పూర్తయ్యే సరికి 4089 ఓట్ల ఆధిక్యంతో నిలిచి, కేజ్రీవాల్ పై గెలిచారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేశారు.
14 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయనకు 4568 ఓట్లు వచ్చాయి.
ప్రవేశ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు కాగా సందీప్ దీక్షిత్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు.
లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్ అనంతరం కొద్దిసేపు స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం 7వ రౌండ్ నుంచి మళ్లీ వెనుకంజ వేశారు.
కేజ్రీవాల్ 2013లో తొలిసారి ఇక్కడి నుంచి పోటీచేశారు. అప్పటినుంచి న్యూదిల్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమంత్రి ఆతిశి మార్లేనా గెలుపు
కల్కాజీ స్థానంపైనా అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంలో దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి పోటీచేశారు.ఇక్కడ అతిశి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూడీ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా వెనుకంజలో ఉన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మనీశ్ సిసోదియా జంగ్‌పురా నుంచి ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలిచారు.
కర్వాల్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా గెలిచారు.

ముస్తఫాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్ట్ గెలిచారు. ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ పై ఆయన 17578 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక్కడ ఎంఐఎం తరపున మహహ్మద్ తాహీర్ హుస్సేన్ పోటీ చేశారు. ఆయనకు 33,474 ఓట్లు వచ్చాయి.
గ్రేటర్ కైలాశ్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ గెలిచారు.
కాంగ్రెస్ తరఫున గర్విత్ సింఘ్వీ పోటీచేశారు.

ఫొటో సోర్స్, tdp

ఫొటో సోర్స్, ECI/SCREENGRAB
చంద్రబాబు ప్రచారం చేసిన చోట బీజేపీ గెలుపు
శాద్రా నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ మొత్తం 18 రౌండ్లు పూర్తయ్యేసరికి 5178 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ఆప్ నేత జితేంద్ర సింగ్ షుంటీ ఓడిపోయారు.
ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
శాకుర్ బస్తీ నుంచి ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ఒడిపోయారు. బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ ఇక్కడినుంచి గెలిచారు.
ఓఖ్లా నుంచి ఆప్ అభ్యర్థి అమన్‌తుల్లాఖాన్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి పై ఆయన 23639 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ స్థానంలో ఎంఐఎం కూడా పోటీచేసింది. ఆ పార్టీ అభ్యర్థి షిఫా ఉర్ రెహ్మాన్ ఖాన్ ఓడిపోయారు.

ఫొటో సోర్స్, @aimim_national
పోటీచేసిన రెండుచోట్లా ఎంఐఎం వెనుకంజ
దిల్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీచేసింది.
ముస్తఫాబాద్, ఓక్లా నియోజకవర్గాల నుంచి ఎంఐఎం పోటీచేసింది. రెండు చోట్లా ఆ పార్టీ ఓడిపోయింది.
ముస్తఫాబాద్‌లో తాహిర్ హుస్సేన్ ఎంఐఎం తరఫున పోటీచేశారు. . ఓక్లా నుంచి దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న షిఫా ఉర్ రహ్మాన్‌ను ఎంఐఎం బరిలో నిలపగా, ఆయన కూడా ఓడిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














