ఐదుగురు విద్యార్థినులపై రేప్, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణలు, అసలేం జరిగింది?

రాజస్థాన్, అజ్మేర్‌, బాలికలపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్

ఫొటో సోర్స్, Ravindra Singh

ఫొటో క్యాప్షన్, ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌ను వ్యతిరేకిస్తూ అజ్మేర్‌లో హిందూ సంస్థలు బంద్ నిర్వహించాయి.
    • రచయిత, మొహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో హిందూ సంస్థలు బంద్ నిర్వహించాయి. ఐదుగురు విద్యార్థినులపై అత్యాచారం జరిగిందని, వారిని బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆరోపిస్తూ ఈ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

మార్కెట్లు, పాఠశాలలు, కాలేజీలతో పాటు అన్ని సంస్థలు ఉదయం నుంచి మూసివున్నాయి. వ్యాపార సంస్థలు కూడా బంద్‌కు మద్దతిచ్చాయి. శుక్రవారం(ఫిబ్రవరి 28)న, అజ్మేర్‌ డివిజన్‌లోని కిషన్‌గఢ్, భిల్వారా, బేవర్ జిల్లాల్లో హిందూ సంస్థలు ర్యాలీ నిర్వహించాయి.

ఫిబ్రవరి 16న బేవర్ జిల్లాలోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఐదుగురు మైనర్ విద్యార్థినులను బ్లాక్‌మెయిల్ చేయడం, వారిపై అత్యాచారానికి పాల్పడడం, మతం మారాల్సిందిగా వారిని ఒత్తిడి చేయడం వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు ఈ ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నాయి.

ఈ కేసులో మాజీ కౌన్సిలర్ సహా 12 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు మైనర్లు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పోలీసులు ఏం చెబుతున్నారు?

స్థానిక కోర్టు ఆదేశాలతో, ఎనిమిది మంది నిందితులను పోలీసులు జైలుకు పంపారు. మాజీ కౌన్సిలర్ హకీమ్ ఖురేషీని రిమాండ్‌కు తరలించారు. మైనర్లందరూ జువైనల్ కరెక్షనల్ హోమ్‌లో ఉన్నారు. అయితే, హిందూ సంస్థల ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

''16వ తేదీన మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒకే స్కూలుకు చెందిన బాధిత ఐదుగురు మైనర్లు బయటకు వచ్చి విషయం వెల్లడించారు'' అని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కరణ్ సింగ్ బీబీసీతో చెప్పారు.

బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు, పోక్సో చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

''12 మందిని అరెస్టు చేశాం, వారిలో ముగ్గురు మైనర్లను కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ కరెక్షన్ హోమ్‌కు పంపించాం. మాజీ కౌన్సిలర్ అయిన నిందితుడు హకీమ్ ఖురేషీని రిమాండ్‌కు తరలించాం. మిగిలిన ఎనిమిది మంది నిందితులను జైలుకు పంపాం" అని ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన డిప్యూటీ ఎస్పీ సజ్జన్ సింగ్ చెప్పారు.

''ఐదుగురు బాధితులు వారి కుటుంబాలతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తును గమనిస్తే... బాధితుల సంఖ్య ఇంత కన్నా ఎక్కువగా ఉండే అవకాశం కనిపించలేదు'' అని సజ్జన్ సింగ్ చెప్పారు. ఎంతమంది బాధితులు ముందుకొచ్చారు..వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

ఫోటోలు, వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం, మతమార్పిడి కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను బాధితుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఆయన ధ్రువీకరించారు.

రాజస్థాన్, అజ్మేర్‌, అత్యాచారం, బ్లాక్‌మెయిల్

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, అజ్మేర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాజకీయపార్టీలు ఏమంటున్నాయి?

తీవ్రమైన అంశం కావడంతో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మౌనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించలేదు.

''బీజేపీ పాలనలో అభద్రత కారణంగా అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లడం మానేస్తారా?'' అని మీడియా నివేదికలను ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 18న సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

చాలా మంది బాలికలకు హిందూ సంస్థలతో అనుబంధం ఉందని, అందుకే వారిని లక్ష్యంగా చేసుకున్నారని రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగ్డే, ఫిబ్రవరి 23న ఝుంఝును జిల్లాలోని నవల్‌గఢ్‌లో ఒక ప్రైవేట్ పాఠశాల కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

''ఆ అమ్మాయిలకు ఒక హిందూ సంస్థతో అనుబంధం ఉంది, అందుకే మీరు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఈ విషయం గుర్తుంచుకోండి" అని ఆయనన్నారు.

రాజస్థాన్, అజ్మేర్‌, బాలికలపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్

ఫొటో సోర్స్, Ravindra Singh

ఫొటో క్యాప్షన్, బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?

''బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ కేసు వెలుగులోకి వచ్చింది" అని మసుదా డిప్యూటీ ఎస్పీ, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సజ్జన్ సింగ్ చెప్పారు.

''ఫిబ్రవరి 15న, నా కూతురు ఇంట్లో చదువుకుంటోంది. నేను ఆమె గదిలోకి వెళ్లినప్పుడు, ఆమె నిందితుడితో ఫోన్‌లో మాట్లాడుతోంది. నన్ను చూసి భయపడి ఫోన్ కాల్ కట్ చేసేసింది. నా కూతురు కాల్ కట్ చేసిన తర్వాత, లుక్మాన్ 15 నుంచి 20 సార్లు ఫోన్ చేశాడు. నేను ఫోన్ ఎత్తి నా కూతురిని మాట్లాడమని చెప్పా. అతను నా కూతురిని తిట్టాడు. తనను వెంటనే కలవకపోతే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు''

'ఆ తర్వాత లుక్మాన్ రమ్మన్న ప్రదేశానికి నా కూతురిని పంపించి, నేను వెనకే వెళ్లా. ఆ తర్వాత, ఆమెను అక్కడి నుంచి రక్షించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వివరాలు అడిగితే అసలు విషయం బయటపడింది'' అని బాధితురాలి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారని డిప్యూటీ ఎస్పీ తెలిపారు.

''లుక్మాన్ నా కూతురిని బెదిరించి హోటళ్లకు, కెఫేలకు తీసుకెళ్లాడు, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు, ఆ తర్వాత తన స్నేహితులను కలవాలని బలవంతం చేశాడు, అతని స్నేహితులు కూడా లైంగికదాడికి పాల్పడ్డారని నా కూతురు చెప్పింది.''

''మా అమ్మాయి దీని గురించి మాకు చెప్పినప్పుడు, ఆమె స్నేహితురాళ్ల కుటుంబాలతో కూడా మాట్లాడాం. వాళ్లపై కూడా లైంగిక దాడి జరిగిన విషయం బయటకు వచ్చింది'' అని బాధితుల్లో ఒకరి తండ్రి పోలీసులకు చెప్పారని ఆయన తెలిపారు.

రాజస్థాన్, అజ్మేర్‌, బాలికలపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడం ద్వారానే కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.

నిందితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

ఈ కేసులో నిందితుల కుటుంబాలను సంప్రదించలేకపోయాం. మరోవైపు, వారి ఇళ్లు అక్రమ నిర్మాణాలని ఆరోపిస్తూ నిందితుల కుటుంబ సభ్యులకు విజయ్ నగర్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది.

నిర్ణీత సమయంలోపు పత్రాలు సమర్పించకపోతే, వారి ఇళ్లను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ నిందితుడి కుటుంబ సభ్యుల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన లాయర్ సయ్యద్ సాదత్ అలీ ఈ సమాచారం అందించారు.

''16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ మాకు ఇంతవరకూ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఎస్పీ మీడియా సమావేశం ఆధారంగా మేం ముందుకు వెళ్తున్నాం. బాధితురాళ్లను కెఫేకు తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. కానీ, కేఫ్ యజమానిని అరెస్టు చేయలేదు. కానీ, అరెస్టు చేసిన నిందితుల బంధువుల ఇళ్లను కూల్చివేసేందుకు నోటీసులు జారీ చేశారు. పత్రాలు సమర్పించాలంటున్నారు'' అని సాదత్ అలీ చెప్పారు.

రాజస్థాన్, అజ్మేర్‌, బాలికలపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, అజ్మేర్‌లో హిందూ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

కొనసాగుతున్న హిందూ సంస్థల నిరసనలు

ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, అజ్మేర్‌ డివిజన్, ఇతర ప్రాంతాలలో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనకు నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్‌లు, ఇతర ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.

దోషులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పోలీసు యంత్రాంగానికి మెమోరాండం సమర్పించాయి.

అజ్మేర్‌లోని పోక్సో కోర్టులో విచారణ కోసం నిందితులను హాజరు పరిచిన సమయంలో పోలీసు రక్షణ ఉన్నప్పటికీ, వారిపై లాయర్లు కూడా చేయిచేసుకున్నారు.

ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని, విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైదేహి మహిళా జాగృక్త సంస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఒక మెమోరాండం సమర్పించింది.

''మనకు చట్టాలు ఉన్నాయి కానీ అవి సక్రమంగా అమలు కావడం లేదు. అలాంటి నేరస్తులను భయపెట్టే విధంగా చట్టాన్ని అమలు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేలా ఈ కేసులో దోషులను శిక్షించాలి'' అని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శోభా గౌతమ్ అన్నారు.

బాధితులు కేవలం ఐదుగురు మాత్రమే కాదని, ఇంకా చాలా మంది ఉన్నారని విప్ర సేన అధినేత సునీల్ తివారీ ఆరోపించారు. "భయం, గౌరవం వంటి కారణాలతో ముందుకురాని బాధిత బాలికలు ఇంకా చాలా మంది ఉన్నారు" అని ఆయన అన్నారు.

ఈ సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి అమితోష్ పరీక్ డిమాండ్ చేశారు.

మూడు దశాబ్దాల క్రితం అజ్మేర్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగుచూసింది.

అజ్మేర్‌ బ్లాక్‌మెయిల్, సామూహిక అత్యాచారం కేసుగా దీన్ని చెప్తారు. పాఠశాల, కళాశాల బాలికలతో స్నేహం చేసిన కొందరు నిందితులు వారి అశ్లీల ఫోటోలు, వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేశారు.

బేవార్‌లో కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ జరిగిందన్న ఆరోపణలు ఉండడంతో దీనిని కూడా అజ్మేర్‌ బ్లాక్‌మెయిల్ కేసులాగే చూస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)