శంభు సరిహద్దులో ఉద్రికత్తలు: 'చలో దిల్లీ' యాత్ర చేస్తోన్న రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌ల ప్రయోగం

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, నిరసనలు చేస్తోన్న రైతులు గతంలో కూడా దిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దిల్లీ వైపు ర్యాలీగా వెళుతోన్న రైతులను అడ్డుకునేందుకు శంభు సరిహద్దులో పోలీసులు బాష్పవాయు గోళాలు, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు.

హరియాణా-పంజాబ్ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులు శనివారం మధ్యాహ్నం దిల్లీ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

శంభు సరిహద్దులో భద్రతా బలగాలు, వీరిని అడ్డుకున్నాయి.

రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ఈ అంశంపై వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సర్వన్ సింగ్ పంధేర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్

''దేశం మొత్తం రైతుల ఆందోళనతో ముడిపడి ఉంది. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉద్యమానికి పట్టించుకోవడం లేదు. వ్యవసాయ మంత్రిని పత్రికల వారు ప్రశ్నించినప్పుడు ఆయన ఏమీ చెప్పడం లేదు.'' అని సర్వన్ సింగ్ అన్నారు.

యునైటెడ్ కిసాన్ మోర్చా ( నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో శంభు, ఖనౌరీ సరిహద్దులో రైతులు గత 300 రోజులుగా నిరసనలు చేస్తున్నారు.

నిరసనలు తెలుపుతోన్న రైతులు గతంలో కూడా రెండుసార్లు దిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

శంభు సరిహద్దులో రైతులు

'ఇది పాకిస్తాన్ సరిహద్దా?’

రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కిసాన్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా ఆరోపించారు.

ప్రభుత్వం ఓ వైపు రైతులను అడ్డుకోవడం లేదని చెబుతూనే మరోవైపు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తోందని అన్నారు.

రైతు సోదరులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

రైతుల నిరసనలో పాల్గొనడానికి శంభు సరిహద్దుకు చేరుకున్న బజరంగ్ పునియా ఈ వ్యాఖ్యలు చేశారు.

''రైతులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. వాళ్లు ఏదో పాకిస్తాన్ సరిహద్దుల నుంచి వస్తున్నట్లు ప్రభుత్వం స్పందిస్తోంది. తమ పంటలకు కనీస మద్దతు ధర కోసమే రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని బజరంగ్‌ పునియా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)