టూరిస్ట్ బోటు మునిగి 28 మంది మృతి, 14 మంది గల్లంతు

ఫొటో సోర్స్, AFP
ప్రతికూల వాతావరణం కారణంగా వియత్నాంలో ఓ టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 28 మంది మృతి చెందగా, మరో 14 మంది గల్లంతయ్యారు.
ఉత్తర వియత్నాంలోని ప్రసిద్ధ పర్యటక ప్రాంతమైన హా లాంగ్ బేలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది రాజధాని హనోయ్ నగరానికి చెందినవారేనని చెబుతున్నారు.
ప్రాణాలతో బయటపడిన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలకు భారీ వర్షం కారణంగా ఆటంకంగా మారింది. అయినప్పటికీ, ఇప్పటివరకు 11 మందిని నీళ్లలో నుంచి కాపాడారు.

వండర్ సీస్ అని పిలిచే ఈ నౌక 53 మంది ప్రయాణికులతో వెళుతుండగా, అకస్మాత్తుగా వచ్చిన తుఫాను కారణంగా బోల్తా పడినట్లు వియత్నాం బోర్డర్ గార్డ్స్, నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికితీశారు. వారిలో ఎనిమిది మంది చిన్నారులేనని వార్తా సంస్థ వీఎన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
గల్లంతైన వారికోసం రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్వాంగ్ నిన్హ్ ప్రావిన్స్‌లోని హా లాంగ్ బే వందలాది చిన్న ద్వీపాలతో కూడి ఉంటుంది. 2019లో 40 లక్షల మంది పర్యటకులు సందర్శించారు. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














