కాంగ్రెస్ పార్టీ తిరుపతి ప్లీనరీలో ఏం జరిగింది, పీవీ ఏం చేశారు?

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1992లో పీవీ అధ్యక్షతన తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. అప్పుడు పీవీ భారత ప్రధానిగా ఉన్నారు.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల గుజరాత్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1992నాటి తిరుపతి ప్లీనరీ చర్చలోకి వచ్చింది.

కాంగ్రెస్ సంస్థాగత విషయాల గురించి చర్చిస్తున్న విశ్లేషకులు, కాంగ్రెస్‌లో అంతర్గత పదవులకు ఎన్నికలు కావాలనుకుంటున్న ప్రతి కార్యకర్తా 1992 తిరుపతి ప్లీనరీని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి 1992 ప్లీనరీ ఎందుకంత ప్రత్యేకం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తిరుపతి ప్లీనరీతో పీవీ నరసింహారావు బలమైన నేతగా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ అధ్యక్షునిగా, దేశ ప్రధానిగా....

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాలను ప్లీనరీగా పిలుస్తారు. అలా 79వ ప్లీనరీ 1992లో పీవీ నరసింహారావు అధ్యక్షతన తిరుపతిలో జరిగింది.

ఆ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 16 మధ్య ఈ సమావేశాలు జరిగాయి.

ఈ ప్లీనరీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

  • 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత జరిగిన ప్లీనరీ.
  • కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా, దేశ ప్రధాన మంత్రిగా నెహ్రూయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి నడిపించిన పెద్ద ప్లీనరీ.
  • పీవీ ప్రధానిగా పదవి చేపట్టినా, ఆయన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందా అన్న అనుమానాల మధ్య జరిగిన ప్లీనరీ.
  • ఆర్థిక సమస్యలు దేశాన్ని కుదిపేస్తూ సంస్కరణలపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో జరిగిన ప్లీనరీ.
  • సోనియా గాంధీ హాజరు కాని ప్లీనరీ.
  • దాదాపు 20 ఏళ్ళ తరువాత సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగిన ప్లీనరీ.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ప్లీనరీ ఇప్పుడు చర్చకు రావడానికి మరో కారణం సంస్థాగత ఎన్నికలు.

సీడబ్ల్యూసీ పదవులను ఎలా పూరించబోతున్నారనే చర్చ గుజరాత్ ప్లీనరీలో జరగడంతో అందరూ తిరుపతిని గుర్తు చేసుకున్నారు. అయితే చివరకు ఎటువంటి ఎన్నికలూ జరగకుండానే గుజరాత్ ప్లీనరీ ముగిసింది.

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(ఫైల్ ఫోటో)

తిరుపతి ప్లీనరీలో ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుని తరువాత అత్యంత శక్తిమంతమైన పదవి సీడబ్ల్యూసీ సభ్యులు. ఆ పదవిని సాధారణంగా అధ్యక్షుడే భర్తీచేస్తారు.

కానీ 1992 ప్లీనరీలో సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగాయి. 1973 తరువాత రెండు దశాబ్దాలకు కాంగ్రెస్‌లో అలా ఎన్నికలు నిర్వహించడం, పీవీ హయాంలో అది జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదొక గొప్ప విషయంగా అంతా భావించారు. కానీ తర్వాత అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది.

చిత్రం ఏంటంటే, తాను నిర్వహించిన ఎన్నికను తానే రద్దు చేశారు పీవీ.

గెలిచిన వారిలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు లేరంటూ పీవీ నరసింహా రావు గెలిచిన వారందరి చేతా రాజీనామా చేయించారు.

ఎన్నికల్లో పీవీని వ్యతిరేకించే అర్జున్ సింగ్ వంటి వారు ఎక్కువగా గెలిచారు. దీంతో ఆయన ఆ కమిటీని రద్దు చేయాలనుకున్నారు. కమిటీలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు లేరనీ, అలాంటి కమిటీ సరికాదనీ పీవీ వాదించారు. కమిటీ నిండా అగ్రకులాలే ఉండకూడదంటూ.... ఆ గెలిచిన కమిటీని రాజీనామా చేయమన్నారు పీవీ. చివరకు ఒక ఎస్సీ, ఎస్టీ మహిళను సీడబ్ల్యూసీకి నామినేట్ చేసి, గెలిచిన వారిలో కొందరిని కూడా కమిటీలో ఉంచారు.

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం సీడబ్ల్యూసీకి ఉంటుంది.

తిరుపతిలో ప్లీనరీ ఎందుకు?

''పీవీ నరసింహారావు గెలిచిన నంద్యాల స్థానం ఉన్న రాయలసీమలోనే తిరుపతి కూడా ఉంది కాబట్టి, అలాగే తిరుపతికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది కాబట్టే ఆయన ప్లీనరీ కోసం తిరుపతిని ఎంచుకున్నారు అంటున్నారు కానీ... రాజకీయమైన కారణం కూడా ఉండి ఉంటుందని అని 1991: హౌ పీవీ నరసింహా రావు మేడ్ హిస్టరీ అనే పుస్తకంలో రాశారు సంజయ్ బారు రాశారు.

''సిండికేట్ బృందం ఎలా అయితే 1963లో నెహ్రూ తరువాత ఎవరు అని ఆలోచించిందో, అలాగే పీవీ కూడా నెహ్రూ కుటుంబం తర్వాత కూడా కాంగ్రెస్ భవిష్యత్తు కొనసాగాలని ఆలోచించి ఉంటారు. తిరుపతి ప్లీనరీ పీవీని బలమైననేతగా చూపడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కాంగ్రెస్‌ను ఓ కుటుంబానికి పరిమితమైన పార్టీగా కాకుండా...నిజమైన జాతీయ రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నం చేసింది'' అని సంజయ్ బారు రాశారు.

''నెహ్రూ కుటుంబం నాయకత్వం లేకుండా భారీ ప్లీనరీ నిర్వహించడం పీవీ ఘనత. అది కూడా పార్టీ అధ్యక్షునిగా, ప్రధానిగా. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాబట్టి తిరుపతిని ప్లీనరీకి వేదికగా ఎంచుకున్నారు. పీవీ నరసింహారావు దేశ ప్రజల ముందు బలమైన నేతగా నిలబడడానికి, కాంగ్రెస్‌లో అంతా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడానికి ప్లీనరీ ఒక వేదికగా మారింది. ప్లీనరీ నిర్ణయాలు, సీడబ్ల్యూసీ ఎన్నికలు వంటివన్నీ కేంద్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయి'' అని బీబీసీతో అన్నారు రాజకీయ విశ్లేషకులు ఇనుగంటి రవి.

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తిరుపతి ప్లీనరీ వల్ల కాంగ్రెస్ బలం పెరిగిందన్నది రాజకీయ విశ్లేషకుల భావన.

ప్లీనరీతో బలమైన నేతగా పీవీ...

మొత్తంగా 1991లో రాజీవ్ మరణం తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు...అప్పటిదాకా ప్రభుత్వ మనుగడపై ఉన్న అన్ని సందేహాలకు తెర దించుతూ తన బలం చాటుకున్న సమయం అది. ఆ ప్లీనరీకి సోనియా గాంధీ హాజరు కాలేదు.

''అప్పుడు నేను ఏఐసీసీ సభ్యునిగా ఉన్నాను. అవిలాల చెరువు దగ్గర మీటింగు పెట్టారు. మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ అంతా సమష్టిగా కృషి చేశాం. పీవీ ప్రధానిగా ఉత్సాహం నింపారు. బాగా జరిగిపోయింది. ఆ ప్లీనరీయే ఇప్పటికీ కాంగ్రెస్‌ను నిలబెట్టింది అని చెప్పవచ్చు'' అని బీబీసీతో అన్నారు సీనియర్ నాయకులు డీకే సమర సింహా రెడ్డి.

''పీవీ బలమైన నేతగా కనిపించడానికి ఆ ప్లీనరీ ఉపయోగపడిందా?'' అని బీబీసీ ప్రశ్నించినప్పుడు, కాదు అని సమాధానమిచ్చారాయన. ''పీవీ కాదు, పార్టీ స్థిరపడటానికి ఆ ప్లీనరీ ఉపయోగపడింది అని చెప్పవచ్చు'' అని డీకే సమర సింహా రెడ్డి విశ్లేషించారు.

''ఆ ప్లీనరీ వల్ల పార్టీ బలం పెరిగింది. పార్టీని ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా నడిపారు. ఇక సంస్కరణల విషయంలో కూడా ముందు నుంచి ఆయనకు ఒక స్పష్టత ఉంది. చాలా నిక్కచ్చిగా, స్పష్టంగా, లోతుగా ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లారు'' అని అభిప్రాయపడ్డారు.

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంస్కరణలు దేశానికి అత్యవసరమని పీవీ నరసింహారావు ప్లీనరీలో చెప్పారు.

సంస్కరణల అవసరం క్యాడర్‌కు వివరించిన పీవీ

ఆ సమావేశంలో కాంగ్రెస్ మూడు తీర్మానాలు ఆమోదించింది. అందులో ప్రధానమైనది ఆర్థిక సంస్కరణలు దేశమంతా ఆర్థిక సరళీకరణ, సంస్కరణల గురించి చర్చ జరుగుతున్న వేళ, వాటి విషయంలో ముందుగా తమ క్యాడర్‌ను సన్నద్ధం చేయాలనుకున్నారు పీవీ. కేవలం తీర్మానం ఆమోదించడమే కాకుండా, దానికి నైతిక మద్దతు కూడా తెచ్చుకోగలిగారు.

''ఆ రోజు దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఎక్కడా రూపాయి లేదు. దీంతో గ్రామీణాభివృద్ధికి నిధులు ఇవ్వాలంటే పెట్టుబడుల ఉపసంహరణ, లిబరలైజేషన్ తప్పనిసరి అని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పారు పీవీ నరసింహారావు. సరళీకరణ చేస్తేనే గ్రామీణాభివృద్ధికి పది వేల కోట్ల రూపాయలు ఇవ్వగలం అని ఆయన నచ్చజెప్పారు. కాంగ్రెస్ బలం గ్రామీణ ప్రాంతాలే. అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలంటే, సంస్కరణలు కావాలన్న అభిప్రాయం కలిగేలా క్యాడర్‌కు చెప్పారు పీవీ. ఆ క్రమంలో వచ్చినవే డ్వాక్రా పథకాలకు నిధులు. లిబరలైజేషన్ వల్ల వచ్చే డబ్బుతో, కింది స్థాయిలో అభివృద్ధి పనుల అమలుకు వీలు కుదురుతుందని చెప్పారు. తద్వారా కార్యకర్తల మద్దతు సంపాదించారు'' అని ఇనుగంటి రవి బీబీసీకి చెప్పారు.

పీవీ నరసింహారావు, ఏఐసీసీ, గుజరాత్ ప్లీనరీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గుజరాత్‌‌లో కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది.

తిరుపతి ప్లీనరీపై వివాదం

తిరుపతి ప్లీనరీ తరువాత ఇక పీవీ పూర్తి కాలం ఐదేళ్ల పాటూ ప్రభుత్వాన్ని నడపగలరా అని ఎవరూ సందేహించలేదు. ఆ తరువాత 1997లో కలకత్తాలో జరిగిన ప్లీనరీలో కూడా ఎన్నికలు జరిగాయి. అవి సీతారాం కేసరి అధ్యక్షతన జరిగాయి. ఇక ఆ తరువాత ఎన్నికలు జరగలేదు.

మొత్తంగా తాజా ప్లీనరీలో సంస్థాగత ఎన్నికలు జరగలేదు కానీ, పార్టీని సంస్థాగతంగా బలపరచడం కోసం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని గుజరాత్ ప్లీనరీ నిర్ణయించింది.

తిరుపతి ప్లీనరీలో అప్పుడు వివాదంగా మారిన అంశం ఏంటంటే... తిరుపతి ప్లీనరీ కోసం అవిలాల చెరువును పూడ్చేశారంటూ కాంగ్రెస్ మీద కొందరు తిరుపతి వాసులు సుప్రీంకోర్టులో కేసు వేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)