మణిపుర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, రెండేళ్ల కిందట అక్కడ చెలరేగిన హింసపై ఆయన ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, BJP/X
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపుర్‌లో పర్యటించారు. 2023 మే నెలలో జాతుల మధ్య చెలరేగిన హింస తర్వాత మోదీ మణిపుర్‌లో చేసిన తొలి పర్యటన ఇది.
ప్రధాని ఇంతకాలం మణిపుర్‌ను ఎందుకు సందర్శించలేదనే విషయంపై ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. గత 28 నెలలుగా ఆ రాష్ట్రం గందరగోళం, రాజకీయ ప్రతిష్టంభనను ఎదుర్కొంటోంది.
శనివారం పర్యటనలో చురాచంద్‌పూర్‌లో రూ. 7 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. హింసాకాండలో అత్యంత ప్రభావితమైన జిల్లా చురాచంద్‌పూర్, ఇక్కడ దాదాపు 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
"వర్షం కారణంగా నా హెలికాప్టర్ మణిపుర్‌లో దిగలేకపోయింది. అందుకే, నేను రోడ్డు మార్గంలో ఇక్కడికి వచ్చాను" అని ప్రధాని మోదీ అన్నారు.
"ఈశాన్య ప్రాంతాన్ని ప్రకాశింపజేసే రత్నం మణిపుర్" అని అభివర్ణించారు.
ఇక్కడ ప్రారంభించిన ప్రాజెక్టులపై మోదీ మాట్లాడుతూ "ఇవి మణిపుర్ ప్రజలకు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రయోజనం చేకూరుస్తాయి, కొత్త సౌకర్యాలు సమకూరుతాయి" అని ఆయన అన్నారు.
"మంచి రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ, 2014 నుంచి నేను దీనిపై పని చేస్తున్నా. ఇందుకోసం రెండు స్థాయిలలో పనులు జరిగాయి. మొదటిది, మణిపుర్‌కు రోడ్డు, రైలు మార్గాల బడ్జెట్‌ను పెంచడం. రెండోది, గ్రామాలను అనుసంధానించడం" అని అన్నారు మోదీ.
"భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. దాని ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా చూసేందుకే నా ప్రయత్నం" అని ప్రధాని అన్నారు.

మణిపుర్ హింసపై మోదీ ఏమన్నారు?
మణిపుర్‌ను శాంతి, శ్రేయస్సు, అభివృద్ధికి చిహ్నంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు.
"మణిపుర్ ప్రాంతం ఆశ, ఆకాంక్షల నిలయం. కానీ, దురదృష్టవశాత్తూ అది హింసతో చుట్టుముట్టింది. కొద్దిసేపటి కిందట, శిబిరాల్లో నివసిస్తున్న బాధితులను కలిశా. ఆశ, విశ్వాసంతో కొత్త ఉదయం మణిపుర్‌ను మేలుకొలుపుతుందని చెప్పగలను. అభివృద్ధికి శాంతి స్థాపన చాలా ముఖ్యం" అని అన్నారు.
"మణిపుర్ అభివృద్ధి కోసం, వీలైనంత త్వరగా నిర్వాసితులకు సరైన ఆవాసం కల్పించడానికి, శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం మణిపుర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటుందని హామీ ఇస్తున్నా" అని అన్నారు మోదీ.

ఫొటో సోర్స్, BJP/X
మిజోరాంకు మొదటి రైల్వే లైన్
మిజోరాం మొదటి రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని మొట్టమొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఐజ్వాల్‌ను దిల్లీకి కలుపుతుంది.
వార్తాసంస్థ పీటీఐ కథనం ప్రకారం, రూ. 8,070 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరాబి-సైరాంగ్ కొత్త రైల్వే లైన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ లైన్‌లో 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి.
ప్రారంభోత్సవానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ మాట్లాడుతూ " కొన్ని సంవత్సరాల కిందట, ఐజ్వాల్ రైల్వే లైన్‌కు పునాది రాయి వేసే అవకాశం దక్కింది. ఈ రోజు దానిని దేశ ప్రజలకు అంకితం చేయడం గర్వకారణం" అని అన్నారు.
"అనేక సవాళ్ల తర్వాత, ఈ బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ కార్యరూపం దాల్చింది. మన ఇంజనీర్లు, కార్మికులు దీనిని సాధ్యం చేశారు" అని అన్నారు మోదీ.
"ఇది కేవలం రైలు మార్గం మాత్రమే కాదు, మార్పుకు జీవనాడి. ఇది మిజోరం ప్రజల జీవితాలను, జీవనోపాధిని విప్లవాత్మకంగా మారుస్తుంది. రాష్ట్ర రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లతో అనుసంధానమవుతారు" అని ప్రధాన మంత్రి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














