చీతాలకు నీరు పెట్టిన వీడియో వైరల్.. చివరకు ఏమైందంటే

కునో నేషనల్ పార్క్, చీతాలు

ఫొటో సోర్స్, Press Information Bureau

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • నుంచి, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతా, దాని కూనలకు నీరు అందించిన అటవీ శాఖ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు అధికారులు.

ఆ అటవీ ఉద్యోగి చీతా, దాని కూనలకు నీరు పెడుతున్న వీడియో ఇటీవల వైరల్ అయింది.

అధికారికంగా అనుమతులున్న సిబ్బంది మాత్రమే పులులు, చీతాలు, చిరుతలు వంటి జంతువుల వద్దకు వెళ్లాలన్న నిబంధనలను ఈ నేషనల్ పార్క్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఉల్లంఘించారని అధికారులు ‘పీటీఐ’ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

భారతదేశంలో చీతాలు అంతరించిపోయినట్లు 1952లోనే ప్రకటించారు. అయితే, మళ్లీ వాటి సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో 2022లో నమీబియా నుంచి తీసుకొచ్చి కునో నేషనల్ పార్కులో వదిలారు. అనంతరం 2023లో మరికొన్ని చీతాలను ఈ అభయారణ్యంలో వదిలారు.

కునోలోని చీతాలకు ఓ వ్యక్తి నీరు తాగిస్తున్న వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో అది వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఆ వ్యక్తి ఒక వెడల్పాటి గిన్నెలో నీరు పోస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

గిన్నెలో నీరు పోసిన తరువాత జ్వాలా అనే చీతా, దాని నాలుగు కూనలు వచ్చి ఆ నీరు తాగినట్లు కూడా వీడియోలో కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చీతాలు వంటివి నేషనల్ పార్క్ లోపలి నుంచి సరిహద్దుల వద్దకు వచ్చినప్పుడు వాటికి కొందరు సిబ్బంది నీరు పెట్టడం మామూలేనని, అవి నీరు తాగి మళ్లీ అడవిలోకి వెళ్లిపోతాయని అధికారులు తెలిపారు.

తల్లి చీతా, దాని పిల్లలు సరిహద్దు సమీపంలోని పొలాల్లో ఉన్నాయని అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉత్తమ్ కుమార్ శర్మ పీటీఐతో చెప్పారు.

"చీతాలు మనుషుల మీద దాడి చేసే పరిస్థితి రాకుండా ఉండేందుకు, ఒక వేళ అలాంటి పరిస్థితి తలెత్తితే చీతాలను సంరక్షణ కేంద్రంలోకి మళ్లించేందుకు పర్యవేక్షణ బృందానికి ఆదేశాలు జారీ చేశాం" అని ఆయన చెప్పారు.

అయితే, అలా చేసేందుకు శిక్షణ పొందిన వారికి మాత్రమే అనుమతి ఉందని, డ్రైవర్ చర్యలు నిబంధనలను ఉల్లంఘించడమేనని శర్మ అన్నారు.

"చీతాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. శిక్షణ పొందిన వారు మాత్రమే వాటికి దగ్గరగా వెళ్లి, అవసరమైన పనులు చేస్తారు" అని శర్మ చెప్పారు.

కునో నేషనల్ పార్క్, చీతాలు

ఫొటో సోర్స్, Alamy

భారత్‌లో చీతాల జనాభా పునరుద్దరించేందుకు 2022, 2023లో దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు కొన్ని చీతాలను తీసుకువచ్చారు.

కునో నేషనల్ పార్క్‌కు తీసుకువచ్చిన చీతాల్లో కిడ్నీల వైఫల్యం, సంభోగ సమయంలో గాయాలతో పాటు వివిధ కారణాల వల్ల 8 చనిపోయాయి. దీంతో కునో నేషనల్ పార్క్‌లో పరిస్థితులపై సందేహాలు తలెత్తాయి.

"సరైన సమయంలో చీతాల సంరక్షణకు చర్యలు చేపట్టి, మెరుగైన పర్యవేక్షణ ఉంటే ఈ మరణాల్లో కొన్నింటిని నివారించే అవకాశం ఉండేది" అని ఈ ప్రాజెక్టులో భాగమైన సౌతాఫ్రికా, నమీబియా నిపుణులు 2023లో సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో తెలిపారు.

అయితే ఈ అంశాలను పార్క్ అధికారులు కొట్టిపారేశారు. ప్రస్తుతం 26 చీతాలు ఉన్నాయని.. అందులో 17 స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, 9 చీతాలను ఎన్‌క్లోజర్లలో పెట్టామని తెలిపారు.

ఈ ఏడాది సౌతాఫ్రికా నుంచి భారత దేశానికి మరో 20 చీతాలు వస్తాయని చెప్తున్నారు. దక్షిణాఫ్రికా అధికారులతో కలిసి ఓ టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే ఈ 20 చీతాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)